కామినేని, పైడికొండల రాజీనామా


ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు వైదొలిగారు. ఈరోజు ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. ‘నాలుగేళ్ల కాలంలో మీరిద్దరూ సమర్థంగా పనిచేశారు’ అని చంద్రబాబు వారిని అభినందించారు.

అంతకుముందు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చుని ఉండగా తెదేపా మంత్రులు వారిని కలిశారు. పదవుల నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందా? అని తెదేపా మంత్రి ప్రశ్నించగా... రాజకీయాల్లో ప్రవేశంతో పాటు నిష్క్కమణం కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామినేని చెప్పారు. పదవి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత మంత్రి మాణిక్యాలరావును కలిసిన గంటా మిమ్మల్ని అభినందించాలా? లేక సానుభూతి వ్యక్తంచేయాలా? అని అడిగారు. ఎప్పటిలాగే అభినందించాలంటూ మాణిక్యాలరావు సమాధానమిచ్చారు. మరోవైపు కామినేని రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇలా జరగటం బాధాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రతి తెలుగువారూ ఆవేదనతో ఉన్నట్లు చెప్పారు. అయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరించారు. శాసనసభలో స్పీకర్‌ అనుమతి తీసుకుని రాజీనామాలపై మాట్లాడతానని కామినేని తెలిపారు.

ముఖ్యాంశాలు