అటవీశాఖ ఆధ్వర్యంలో వేడుకగా మహిళాదినోత్సవం


లింగ వివక్షకు, అణచివేతకు అతీతమైన సమసమాజం రావాలని, అందుకోసం స్త్రీపురుషులు పరస్పరం సహకరించుకొంటూ, ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలని డివిజనల్‌ అటవీ అధికారి (కాకినాడ) డాక్టర్‌ నందని సలారియా అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జోసి ఫౌండేషన్‌ సౌజన్యంతో రాజమండ్రి లాలాచెరువు వద్ద గల మహాపుష్కర నగరవనంలో గురువారం మహిళాదినోత్సవ కార్యక్రమాలు సందడిగా జరిగాయి. కాకినాడ డీఎఫ్‌ ఓ డాక్టర్‌ నందని సలారియా జెండా ఊపి 2కె రన్‌ను ప్రారంభించారు. అనంతరం బెలూన్లు ఎగురవేసి మహిళాదినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజం కోసం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్నారు. వారి గౌరవార్థం ఏదో ఒకరోజు పాటిస్తే సరిపోదని, ప్రతిరోజూ, ప్రతీక్షణం మహిళను గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పిలుపునిచ్చారు. పురుషులకు కూడా ఎంతో కష్టసాధ్యమైన అటవీశాఖలోఎంతో ప్రయాసకు, కష్టనష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్న మహిళలను ఆమె కొనియాడారు. మహిళగా క్లిష్టమైన ఉద్యోగ బాధ్యత నిర్వహణలో తాను రాణించడానికి దోహదపడిన పరిస్థితులను ఈ సందర్భంగా ఆమె వివరించారు. అల్లు రామలింగయ్య హోమియో వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ నీలిమా అగర్వాల్‌ ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ వహించాని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు పాటించాల్సిన ఆహార నియమాలను ఆమె వివరించారు. మహిళలు తమను తాము ముందుగా ప్రేమించడం నేర్చుకోవాలని, సానుకూల దృక్పథంతో జీవితంలో ప్రతి దశలోనూ సమర్థంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం, ఆ సమాజం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాయన్నారు. స్కూల్‌ ఆఫ్‌ యూనివర్సల్‌ లీడర్‌ షిప్‌ ఎన్‌ఎల్‌పి ట్రెయినర్‌ సురేష్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒత్తిడినుంచి రిలాక్స్‌ అయేందుకు దోహదపడే వ్యాయామ పద్ధతును, మానసిక ఒత్తిడి తొగించుకునే విధానాలను ఆయన ప్రయోగాత్మకంగా వివరించారు. ఎవరైనా తమపై దౌర్జన్యం, దాడికి పాల్పడినప్పుడు ఎలా రక్షించుకోవాలనే అంశానికి సంబంధించి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడు శామ్యూల్‌ ఆధ్వర్యంలో యువతులు ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. జిల్లావ్యాప్తంగా పనిచేసే అటవీశాఖ మహిళాసిబ్బంది, ఎపి ఫారెస్ట్‌ అకాడమీ ట్రెయినీలు, జోసి ఫౌండేషన్‌ ప్రతినిధులు, డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్యకళాశాల మహిళా సిబ్బంది, విద్యార్థినులు, నగరవనం వాకర్స్‌ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం