కాంగ్రెస్ లో వాజపేయి మేనకోడలు

దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరును ఉపయోగించుకొని ఓట్లు రాబట్టుకోవాలని అటు అధికార భాజపా, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ సొంత నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావ్‌లో ఆయనకు ప్రత్యర్థిగా వాజ్‌పేయీ మేనకోడలు కరుణ శుక్లా బరిలోకి దిగుతున్నారు. 2013లో భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆమె ఇప్పుడు సీఎంకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ భాజపా వాజ్‌పే యీ విలువలను మర్చిపోయిందన్నారు. ‘భాజపా తన మార్గాన్ని, ముఖాన్ని మార్చే సుకుంది. అటల్‌ జీ, అడ్వాణీ సమయంలో పార్టీ ఉన్నట్లుగా ఇప్పుడు లేదనే విషయం ప్రజలకు బాగా తెలుసు. నేను అటల్‌ జీ మేనకోడలిని. ఆయన మార్గదర్శకాలనే నేను అనుసరిస్తాను. కాంగ్రెస్‌ గెలుపొందితే అవినీతి రహిత రాష్ట్రంగా నిలబెడతామనే విషయం రాజ్‌నంద్‌గావ్‌ ప్రజలకు బాగా తెలుసు’ అని ఆమె అన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గాన్ని పూర్తిగా మరిచిపోయారని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదని  విమర్శించారు. రాజ్‌నంద్‌గావ్‌ ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ దఫా కాంగ్రెస్‌ తప్పక విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్లా వ్యాఖ్యలను భాజపా నేతలు ఖండిస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో చేరేందుకు శుక్లా భాజపాను వీడారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రమణ్‌సింగ్‌కు ఆమె ఏమాత్రం పోటీ కాదని రాష్ట్ర భాజపా సీనియర్‌ నేత సంజయ్‌ శ్రీవాస్తవ అన్నారు.
2013లో కరుణ శుక్లా భాజపా నుంచి బయటకు వచ్చారు. 2014 ఫిబ్రవరిలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. భాజపాలో ఉన్నపుడు ఆమె 2004 లోక్‌సభ ఎన్నికల్లో జంజ్‌గిర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2009లో కోర్బా నుంచి ఓడిపోయారు.