పోలవరంపై సూప్ లో పడిన కేంద్రం !


పోలవరం ప్రాజెక్టు 2018 జూన్‌ నాటికి పూర్తవదు. కానీ ఈ నెపం ఎవరిపై పడుతుంది? "కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర సంస్థలు నిర్ణయాలు తీసుకునేందుకు 3 నెలలు పట్టింది.. ఫలితంగా కీలకమైన పనిదినాలు కోల్పోయాం!" ఇదీ దీనిపై చంద్రబాబు లేటెస్ట్ మాట! ఒక విధంగా ఇది కరెక్టే! జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించిన తర్వాత కేంద్రప్రభుత్వం తానూ క్రియాశీలకం కాలేదు. చంద్రబాబును క్రియాశీలకం చేసింది. మీటింగులు పెట్టడం.. కాంట్రాక్టర్ మార్పుపై రభసకే కేంద్రం పరిమితం అయింది. ముందు వద్దన్న కాఫర్ డాం ఇప్పుడు మళ్ళీ ఓకే అయింది. ఇదేదో ముందే చేస్తే పని అయిపోను కదా అనే భావన జనంలో కలిగింది. కనీసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ సైట్ కి రాలేదు (ప్రత్యక్షంగా 15 రోజులకోసారి వస్తానని చెప్పిన తర్వాత కూడా). ఇచ్చిన నిధులు డైవర్ట్ అయ్యాయనేది సత్యమే అయినా కేంద్ర ప్రభుత్వం దానిపై నోరెత్తడం లేదు! పోలవరంపై తప్పో ఒప్పో శ్రద్ధ అనేది చంద్రబాబే చూపుతున్నారని.. లేట్ కావడానికి కేంద్రం డబ్బు ఇవ్వకపోవడం.. సాంకేతిక అంశాలపై కాలయాపన చేయడమే కారణమని ఇపుడు జనంలో అండర్ కరెంట్ ప్రచారం జరుగుతుంది. ఇది చంద్రబాబు మైండ్ గేమ్ కావచ్చు.. కానీ కేంద్రప్రభుత్వ స్వయంకృతం కూడా! పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి 2018 జూన్‌ నాటికి తొలిదశగా గ్రావిటీ ద్వారా నీళ్లు సరఫరా చేసే ప్రణాళిక ఆచరణకు అసాధ్యంగానే కనిపిస్తోంది. దాదాపు 3 నెలలు అనేక పనులు సాగకపోగా, వచ్చే జూన్‌ వరకు 150 పని రోజులు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంలో సోమవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని అంగీకరించారు. 2018కి గ్రావిటీ ద్వారా నీటి సరఫరా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే కనిపిస్తున్నా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ‘వివిధ సాంకేతిక కారణాల వల్ల, కేంద్ర సంస్థలు కొన్ని సాంకేతిక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు 3 నెలల సమయం పట్టింది. దిగువ కాఫర్‌ డ్యాంలో ఇప్పటికే జెట్‌ గ్రౌటింగు పనులు ప్రారంభమయ్యాయి. 65వేల చదరపు మీటర్ల పనిచేయాలి. ఇందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుంది. ఆ పైన దాదాపు 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉంటుంది. 100 ఏళ్లకోసారి వచ్చే 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే స్థాయిలో ఈ కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టాలి. ఇందులో దశలవారీగా చదును చేస్తూ.. గట్టిపరుస్తూ నిర్మించుకుంటూ రావాలి. కేవలం మూడు నెలల కాలంలో ఇంత పని చేయడం అంత సులభమేమీ కాదని చెబుతున్నారు. స్పిల్‌ వే కాంక్రీటు పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయి. ఆగ్రిగేట్‌ చిల్లింగ్‌ ప్లాంటు పని చేయించడం సోమవారమే ప్రారంభమైంది. కొత్త గుత్తేదారు కూడా ఖరారు కావాలి. స్పిల్‌ వే కాంక్రీటు పనులు, స్పిల్‌ ఛానల్‌ మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు చేయాల్సి ఉంది. ఒక్క స్పిల్‌ ఛానల్‌లోనే 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాలి. స్పిల్‌ వేలో 15 లక్షలకు పైగా కాంక్రీటు పని చేయాలి. ఈ పనులు చేస్తూనే గేట్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలి. మరోవైపు స్పిల్‌ ఛానల్‌లో చివర గోదావరి నీటిని మళ్లించి నీటిని తిరిగి గోదావరిలోకి కలిపే మార్గంలో గట్లను 31 మీటర్ల ఎత్తుకు పటిష్ఠంగా నిర్మించుకోవాలి. ఇవన్నీ 150 రోజుల్లో పూర్తిచేయడం సులభమేమీ కాదు. ఈ పరిస్థితుల్లో 2019 జూన్‌కే ఎగువ కాఫర్‌ డ్యాం ద్వారా పోలవరం గ్రావిటీ నీరు సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రధాన డ్యాంలో డయా ఫ్రం వాల్‌ పనులు పూర్తయినా ఒక సీజన్‌లోనే పూర్తిస్థాయి డ్యాం పనులు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.

ముఖ్యాంశాలు