జాతీయగీతం వేయమన్నదెవరు?వద్దన్నదెవరు?


సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరిగా వేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని నవంబరు 2016 లో కేంద్రం రూల్ చేసింది. అయితే అది కేంద్రం స్వయంగా చేసింది కాదు. సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకే అప్పట్లో అలా చేసింది. విచిత్రం ఏమిటంటే.. ఆ తర్వాత కొందరు ఈ విషయంలో కోర్టులకెక్కితే .. కోర్టులు ఏమి తీర్పులు చెప్పాయి? సినిమా హాల్లో జాతీయగీతం అవసరం లేదని .. లేదా అక్కడ నిలబడి దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ద్వంద్వ నీతి చూపాయి. అంటే సుప్రీం కోర్టు చెప్పిన దానిని ఆయా కోర్టులు కాదన్నాయన్న మాట. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల గొడవలు జరిగి ఈ వ్యవహారం శాంతిభద్రతల సమస్యగా మారే పరిస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు ఆ ఆదేశాలను నిలుపుదల చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సోమవారం ఈమేరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా మొదలయ్యే ముందు థియేటర్లలో జాతీయ గీతం అక్కర్లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై సరైన మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈ అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు తాము ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేసి 30 నవంబరు 2016 తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిల్‌ విచారణకు రానుంది. అయితే ఈ వార్తని కవర్ చేస్తున్న మీడియా కేంద్రం ఎదో యూ టర్న్ తీసుకుందని.. తగ్గిందని.. అవగాహనా లోపంతో ఏవేవో చెబుతోంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ యూ టర్న్ లేదా జెడ్ టర్న్ ఏది తీసుకున్నా.. కోర్టు తీర్పుల్లోనే ఆ మతలబు ఉంది తప్ప కేంద్రంలో లేదు. దేశభక్తి కేవలం ప్రభుత్వానికే ఉండాలి.. మనం, కోర్టులు కాదంటున్నా సరే రూల్స్ అమలు చేసి చివాట్లు తినాలా? అందుకే కేంద్రప్రభుత్వం కూడా జనం పాపం ఇబ్బంది పడుతున్న ఈ నిబంధనని ఉపసంహరించుకుంది. ఇది నిజానికి జనంగా మనం సిగ్గు పడాల్సిన విషయం. గంటలు, రోజులు ఎదురు చూసి ఒక్కోసారి లైన్లో నిలబడి టిక్కెట్లు తీసుకుని సినిమాకి వెళ్లి.... పాటలకు, ఫైట్ లకు, డైలాగులకు, ఈలలు, చప్పట్లు కొట్టి, కొట్టి అలసిపోయే మనం కేవలం రెండు నిముషాలు నిలబడి దేశభక్తి ప్రదర్శించలేనంత దుస్థితిలో ఉన్నందుకు మనమే సిగ్గుపడాలి.

ముఖ్యాంశాలు