రాహుల్ పై పిటిషన్ కొట్టేసిన సుప్రీం


ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న ప్రముఖుడిపై ఒకరు కోర్టులో కేసు వేసారు.. ఈయన అసలు భారతీయుడే కాదు అని .... కోర్ట్ ఏమి చెప్పాలి? భారతీయుడే అయితే అవునని.. కాకపోతే కాదని చెప్పాలి.. అప్పుడు ఇక శంకలు, వివాదాలు ఉండవుగా! కానీ మెరిట్ లేదని పిటిషన్ ని కొట్టేస్తే ఏమిటి అర్థం? ఇప్పుడు అటువంటి గందరగోళ వాతావరణమే దేశంలో ఉంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ విచారణకు అర్హం కాదని తోసిపుచ్చింది. యూకేకు చెందిన ఓ కంపెనీ తమ వార్షిక డేటాలో రాహుల్‌ గాంధీని బ్రిటీష్‌ పౌరుడిగా పేర్కొందని, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హిందూ మహాసభ కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఏదో ఒక కంపెనీ ఏదో ఒక పత్రాల్లో ఆయన(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) బ్రిటిష్‌ వ్యక్తి అని పేర్కొంటే ఆయన బ్రిటిష్‌ పౌరుడు అయిపోతారా..? ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదు. దీన్ని మేం కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది. రాహుల్‌ పౌరసత్వంపై గతంలోనూ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాహుల్‌ పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాహుల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అంతకుముందు ఇదే విషయమై 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాహుల్‌ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ముఖ్యాంశాలు