వీసా నిబంధనలపై మోదీ ఎఫెక్ట్


లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపించే హెచ్‌-1బీ వీసా పరిమితులపై అమెరికా నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభావితం చేసింది. మోదీ ఎఫెక్ట్ తో అమెరికా నాయకత్వం దీనిపై కాస్త పట్టుసడలించింది. ఈ వీసాలను రెండు సార్లు మాత్రమే పొడిగించాలన్న ప్రతిపాదనలను ప్రస్తుతం పక్కనబెడుతున్నట్టు ప్రకటించింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం అవసరమయ్యే ‘గ్రీన్ కార్డు’ వచ్చేలోపు ప్రస్తుతం అక్కడున్నవారు ఎన్నిసార్లయినా హెచ్-1బీ వీసా గడువును పొడిగించుకునే వెసులుబాటు ఉంది. అయితే దీనికి పరిమితులు విధించి రెండుసార్లు మాత్రమే అంటే ఆరేళ్ల వరకు మాత్రమే హెచ్‌-1బీ వీసాలను పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. బై అమెరికన్, హైర్ అమెరికన్’ అన్న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను అనుసరించి గడువు తీరిన వీసాదారులను వెనక్కి పంపేయాలని యూఎస్‌సీఐఎస్ ప్రతిపాదించింది. దీంతో చాలామంది వలసదారులు ప్రత్యేకించి భారత టెకీలు తీవ్ర ఆందోళన చెందారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలు చేయాలని అమెరికా భావిస్తే.. దాదాపు 7.5 లక్షల మంది భారత హెచ్-1బీ వీసాదారులు ఇంటిముఖం పట్టాల్సివచ్చేది. కాగా యూఎస్‌సీఐఎస్ తీసుకున్న తాజా నిర్ణయంపై... హెచ్1బీ కార్మికుల కోసం పోరాడుతున్న సంస్థ ‘ఇమ్మిగ్రేషన్ వాయిస్’ హర్షం వ్యక్తం చేసింది.

ముఖ్యాంశాలు