వ్రతం చెడినా ఫలితం దక్కని పవన్


పవన్ కల్యాణ్ కి వ్రతం చెడినా ఫలితం దక్కని వైనం తెలంగాణాలో ఎదురైంది. కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ ఆయనను పొగిడి ఆకాశానికెత్తినా ప్రీమియర్ షోలకు అనుమతి రాలేదు. ఇదీ పవన్ కి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఝలక్. పాపం ప్రగతి భావం కి వెళ్లి వెయిట్ చేసి మరీ సీఎం కి న్యూ ఇయర్ విషెష్ చెప్పి తెలంగాణలో విద్యుత్ సరఫరాను హోరున పొగిడారు పవన్. కానీ కేసీఆర్ మాత్రం మొహమాటపడలేదు.. తమ్ముడు తమ్ముడే.. అన్నట్టు వ్యవహరించారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు అనుకున్న పవన్ కల్యాణ్ కేసీఆర్ ను చంద్రబాబును పొగిడిన దానికంటే ఎక్కువ పొగిడి ఆశ్చర్యంలో ముంచారు. ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ ఇలా పొగడ్తలకు సిద్ధం కాడంపై విమర్శలూ వచ్చాయి. ఒకవేళ పవన్ మరేవైనా అంశాలలో ప్రశ్నించి, విద్యుత్ విషయంలో మాత్రం కేసీఆర్ ను పొగిడి ఉంటే పోనీ అని సరిపెట్టు కునేవారు. కానీ తెలంగాణలో ఉన్న సమస్యల గురించి స్పందించే తీరిక లేని పవన్ కు ఉన్నట్టుండి అజ్ఞాతవాసి విడుదలకి ముందు... కొత్త సంవత్సరం విషెష్ చెప్పడానికి, ఒక ప్రోగ్రామ్ ను పొగడటానికి మాత్రం తీరిక దొరకడం చర్చనీయాంశం అయింది. పొగడ్తలకు బదులుగా పవన్ కల్యాణ్ తన తాజా సినిమా ప్రీమియర్స్ కు అవకాశాన్ని సంపాదించుకున్నాడనే ప్రచారం జరిగింది. అయితే చివరకు అది కూడా పూర్తి స్థాయిలో కాదని.. కేవలం ఒక్క షో మాత్రమే అని తేలిపోయింది. పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు అని గతంలో మాట్లాడిన కేసీఆర్, అతడు తన వద్దకు వచ్చినప్పుడు సాదరంగానే ఆహ్వానించి రాజకీయం అంటే ఏమిటో పవన్ కు రుచి చూపించారు. రాజకీయం చేయడం తనకే తెలుసనీ స్పష్టం చేసారు.

ముఖ్యాంశాలు