అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు


రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు-2019ను రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లుకు ఇంత విస్తృత మద్దతు లభించడం సంతోషంగా ఉంది. సభలో బిల్లుపై ఉత్సాహభరిత చర్చ జరిగింది. బిల్లును ఆమోదించడం ద్వారా మన రాజ్యాంగ రూపకర్తలకు, స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులర్పించిన వాళ్ళం అయ్యామని, సామాజిక న్యాయానికి ఇదో గొప్ప విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్‌ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం రాత్రి 10.22 గంటలకు 165-7 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని సభ్యులు ప్రతిపాదించిన సవరణలను తోసిపుచ్చింది. ఈ తాజా బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పటివరకూ 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిధి 60 శాతానికి పెరిగింది. రాజ్యాంగంలో 15(6), 16(6) పేరుతో కొత్త సబ్‌ క్లాజ్‌లు చేరాయి. బిల్లుపై పది గంటలపాటు చర్చించిన అనంతరం పెద్దల సభ సభ్యులు ఆమోదముద్ర వేశారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపాలని అనేకమంది అన్నా ఓటింగ్‌ లో మాత్రం అనుకూలంగా ఓటేశారు. డీఎంకె, ఏఐడీఎంకె, ఆర్‌జేడీ, ఐయూఎంల్‌ పార్టీలు మినహా అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లు, తెలంగాణలో ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశాలను తెలుగుదేశం, తెరాస సభ్యులు లేవనెత్తినా వాటికీ ప్రాధాన్యత లభించలేదు. ఎన్డీయే, యూపీయే కూటములతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమి భయం పట్టుకొనే హడావుడిగా ఈ బిల్లు తెచ్చారని కాంగ్రెస్‌ మండిపడింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చినందున ఈ రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంటుకు లేదని అన్నాడీఎంకే అభిప్రాయపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య అజెండాలో భాగంగానే ఎన్నికల ముందు ఈ బిల్లు పెట్టారని ఆప్‌ ధ్వజమెత్తింది. తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ చెప్పిందని బిజెపి మంత్రులు పేర్కొని ఆ పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఆనాడు అగ్రవర్ణాలకు చెందిన నెహ్రూ నిమ్న వర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పుడు వెనుకబడిన తరగతులకు చెందిన మోదీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రసంగిస్తూ అందరూ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు చెబుతూనే షరతులూ పెడుతున్నారు. ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే పూర్తి అధికారాలున్నాయి. మౌలిక స్వరూపం (బేసిక్‌ స్ట్రక్చర్‌) మినహా మిగతా అన్నీ సవరించొచ్చు. దాని పరిధిలోకి రిజర్వేషన్లు రావు. అందువల్ల ఈ బిల్లుపై రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరమే లేదని ఆయన చెప్పారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగ పీఠికలోనే ఉందని, అందుకే ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2010లోనే మేజర్‌ జనరల్‌ సునో కమిషన్‌ అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని మంత్రి గుర్తు చేసారు. ఆ తర్వాత అయిదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రమైనా ప్రస్తుతం పెట్టిన రూ.8లక్షల ఆదాయ పరిమితిని తగ్గించుకోవచ్చు అని కూడా మంత్రి చెప్పారు.

'ఇరా' వార్తా వ్యాఖ్య::

ముఖ్యాంశాలు