సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మకు ఉద్వాసన


సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన గల అత్యున్నత కమిటీ నిర్ణయించింది. వారం రోజుల్లోగా కొత్త డైరెక్టర్‌ ని నియమిం చనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మోదీ, జస్టిస్‌ సిక్రీ, ఖర్గే పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో అవకతవకల ఆరోపణతో అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మోడీ, సిక్రి బలప ర్చగా ఖర్గే వ్యతిరేకించారు. బహుశా ఆలోక్ వర్మను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బదిలీ చేయవచ్చు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ను సెలవుపై వెళ్లాల్సినదిగా కేంద్రం ఆకస్మికాదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కోర్టుకెక్కారు. ఆయన్ను విధుల్లో కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత విధుల్లో తిరిగి చేరారు.అయితే ఇలా చేరిన మర్నాడే ఆయన్ను తొలగిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఆలోక్‌ వర్మకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చే అంశంపై చర్చించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, లోక్‌సభ పక్షనేత ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి ఉన్నారు. ఆలోక్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ కమిటీ కూలంకషంగా చర్చించింది. సీవీసీ కమిటీ నివేదిక బుధవారం అందకపోవడంతో గురువారం కూడా కమిటీ సమావేశమైంది. సీవీసీ నివేదిక పరిశీలించిన అనంతరం ఆలోక్ ను సాగనంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారుల బదిలీ ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానా కేసును విచారిస్తోన్న డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్‌ గౌబా, జేడీ మురుగేశన్‌, ఏడీ ఎ.కె.శర్మను బదిలీ చేసి కేసు విచారణను మోహిత్‌ గుప్తాకు అప్పగించారు. ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడంతో వారిద్దరి అధికారాలను వెనక్కి తీసుకొని, వారిని బలవంతపు సెలవుపై పంపుతూ సీవీసీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 23న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజున ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

'ఇరా' వార్తా వ్యాఖ్య

ముఖ్యాంశాలు