దేహ భావన భ్రాంతి... భగవదనుభవమే శాంతి


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో ఎనిమిదవరోజు ప్రసంగం) దేహ తాదాత్మ్యతే అజ్ఞానమని దానినే భాగవతం భ్రాంతి అని చెబుతున్నదని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఇంద్రియ సహజ లక్షణాలను లేదా ఇంద్రియ సంతృప్తి కొరకు సాధించిన అనిత్యమైన వాటిని శాశ్వతమని నమ్మేవారు, ఎప్పుడు నశించిపోతుందో తెలియని దేహాన్నిఅమితంగా మోహిస్తూ ఇది నిత్యమని భ్రమసే వారు గృహవ్రతులనబడతారని తెలిపారు. అనిత్య వస్తువుతో సాధించిన అనిత్యమైన విషయాలను నిత్యమని పొరబడటం ఒక తప్పయితే.. అవి నశించినందుకు బాధపడడం మరొక తప్పన్నారు. దేహ తాదాత్మ్యతే జీవుడి ఉన్నతికి ఉన్న అతిపెద్ద అవరోధమని చెబుతూ.. చివరికి రోగగ్రస్తమై, శిథిలం అయినా కూడా జీవుడు ఈ శరీర భ్రాంతిని విడువలేకున్నాడని, నరకంలో బాధలు అనుభవించడం కోసం లభించే తత్కాల శరీరంపై కూడా ఇట్టివారు మోహాన్నే కనబరుస్తారని కపిలగీత చెబుతున్నదన్నారు. భారతంలోని వ్యాస కీటక సంవాదాన్ని ప్రస్తావిస్తూ.. ఎంతటి అల్పదేహంలో ఉన్నా కూడా జీవుడికి దేహభావన.. అది శాశ్వతం అనే భ్రమ తొలగవన్నారు. నిత్యానిత్య వివేకముతో జీవుడు దేహ భ్రాంతిని తొలగించుకొని దృష్టిని భగవంతునిపై మళ్లించుకుంటే.. తత్సాధనతో కలిగే దివ్యానుభవమే శాంతి అని అదే ముక్తి పొందడం అని సూత్రీకరించారు. దేహంలో ఉండి నిర్వహించే కర్మల కారణంగా జీవుడు పొందే వివిధ ఉత్తర గతులను కపిలగీత వివరించిందన్నారు. ఇవి తెలుసుకుంటే ప్రతివారికీ తమ స్థాయి, భవిష్యత్తు తెలియడమే కాకుండా ఆ పరిస్థితినుంచి ఉన్నత స్థితికి వెళ్లడం ఎలాగో కూడా తెలిసివస్తుందన్నారు. ఇట్టి గొప్ప జ్ఞానాన్ని విష్ణు అవతారమైన కపిలమహర్షి తన మాతృమూర్తి దేవహూతి నెపంతో మానవాళికి గొప్ప వరంగా ప్రసాదించాడని.. అందుకే కపిలుడ్ని జ్ఞానావతారునిగా సంభావించుకోవాలని పేర్కొన్నారు. మరణానంతరం జీవులకు లభించే వివిధ గతులు పాపగతి, సద్గతి, మిశ్రగతి, క్రమముక్తి లక్షణాలను వివరించారు. కేవలం లౌకిక ధర్మాలు, ఇంద్రియ లౌల్యం.. ఆర్జన తప్ప మరొకటి తెలియకుండా బతికే వారు గృహవ్రతులని.. ఇట్టివారికి మరణానంతరం పాపగతులు తథ్యమని కపిలుడు చెప్పాడన్నారు. పంచ యజ్ఞాలను (దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు) చేస్తూ, త్యాగపూర్వక కర్మాచరణతో, ధర్మబద్ధమైన సంపాదన, ధార్మిక సుఖభోగానుభవంతో జీవించే వారు గృహస్థులు అనబడతారని.. ఇట్టివారు తాము సాధించిన పుణ్యార్హతల కారణంగా ఉత్తమలోకాల్లో నిర్దిష్ట కాలం పాటు సుఖభోగాలను అనుభవించి ఆపైన మళ్ళీ జన్మలెత్తుతారన్నారు. కాలావధి కలిగిన దేహంతో, కాల అధీనమైన ఇంద్రియాలతో కాలావధి మేరకు ఆచరించబడిన పాప, పుణ్య కర్మల ఫలితంగా లభించే సద్గతులు, దుర్గతులు కూడా కాలావధి మేరకే ఉంటాయి తప్ప శాశ్వతాలు కావన్నారు. మరణానంతరం పాప పుణ్యాల మేరకు ఆయా లోకాల్లో కర్మలనుభవించి.. ఆపైన తిరిగి భూమిపై మళ్ళీ జన్మించి.. ఇక్కడ మళ్ళీ కర్మ క్షయం చేసుకోవడాన్ని మిశ్రగతి అంటారని చెప్పారు. మన ధర్మంలో కర్మకు ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కనుకనే భారత దేశం కర్మదేశమని చెప్పబడింది అని సామవేదం అన్నారు. అయితే జీవన కాలంలో ఉత్తమ ధర్మాలు ఆచరిస్తూ.. పరమార్థ స్పృహతో గడుపుతూ ఉపాసన లేదా యోగ మార్గంలో చరించిన వారికి క్రమ ముక్తిని కపిలగీత చెప్పిందన్నారు. దీని ప్రకారం ఇట్టి జీవులు హిరణ్య గర్భ లోకం అనబడే సగుణ బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని ఆయుఃపర్యన్తం (నూరు కల్పాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం) అక్కడే వసిస్తారని ఆ తర్వాత బ్రహ్మదేవునిలో పాటు వీరు కూడా ముక్తిని పొందుతారని పేర్కొన్నారు. బ్రహలోక నివాసం కూడా పూర్తి ముక్తి కాదని.. అక్కడ అనేక కల్పాల పాటు ఉన్న తర్వాతే పరమపదానికి వారు వెళతారు గనుక దీనికి క్రమముక్తి అని పేరన్నారు. భూమిపై ఇంకొందరు ఉత్తములు ఇంద్రియ, దేహాసక్తులు త్యజించి, ఆత్మానుభూతిని పొంది ఇక్కడనే.. ఈ దేహంతో ఉండగానే భగవదనుభూతి పొందుతూ ఉంటారని వారిని జీవన్ముక్తులు అని చెబుతారని తెలిపారు. ఇట్టి జీవన్ముక్తులు ఆయువు ఉన్నంతవరకూ తామరాకుపై నీటిబొట్టులా దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటారు తప్ప ఎట్టి వికారాలూ వీరిని అంటవన్నారు. దేహాన్ని విడిచిన అనంతరం వీరు నేరుగా పరబ్రహ్మంలో ఐక్యమై పరమపదం పొందుతారన్నారు. గృహవ్రతులకు పాపగతులు, గృహస్థులకు సద్గతులు, సాధకులు-ఉపాసకులకు క్రమముక్తి కాగా జీవన్ముక్తులకు మాత్రం నేరుగా మోక్షం నిర్దేశించబడినదని కపిలగీత ప్రమాణంగా చెప్పారు. ఈ చివరి రెండూ (క్రమముక్తి, జీవన్ముక్తి) పరమగతులుగా గుర్తించాలన్నారు. మొదటి ఇద్దరినీ రాత్రి అధిదేవత, కృష్ణపక్ష దేవత ధూమ మార్గంలో ఆయాలోకాలకు తీసుకుపోతే.. పరమగతులు పొందిన వారిని మాత్రం ఉత్తరాయణ దేవత, పగటి అధిదేవత కలసి అర్చిరాది మార్గంలో గొనిపోవడం జరుగుతుందన్నారు. జన్మాంతరంలో కర్మ శేషాన్ని అనుభవించాల్సిన జీవుల విషయం వివరిస్తూ.. స్వర్గాది ఉత్తమలోకాల్లో నియమిత కాలం పాటు దివ్య సుఖాలను అనుభవించిన జీవుడు.. ఆ వ్యవధి ముగిసాకా...అనంతమైన దిగులుతో తిరిగి భూమిపై పడతాడన్నారు. సూక్ష్మదేహం (లింగదేహం)తో జలం ద్వారా భూమిపైకి వచ్చి.. ధాన్యం గింజల్లో ఆశ్రయం పొంది.. ఏ తండ్రి ద్వారా తిరిగి జన్మ పొందాలో ఆ తండ్రిని చేరుకొని.. తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడతాడని కపిలాగీత ప్రమాణంగా విశదపరిచారు. ఈ గీతలో చెప్పిన పిండోత్పత్తి ప్రకరణంలో గొప్ప శాస్త్ర విజ్ఞానం ఇమిడి ఉన్నదని సామవేదం సోదాహరణంగా తెలిపారు. ఏడవ మాసంలో గర్భస్థ శిశువు స్థితిని వర్ణిస్తూ అప్పటి ఆసనంలో (ధనురాకారంలో ఉండే స్థితి) ఆ శిశువుకు పూర్వ జన్మ జ్ఞానం కలుగుతుందన్నారు. ఆయా జన్మల్లో ఎన్నో తప్పులు చేసానని పరితపిస్తూ.. ఈ జన్మనైనా సార్థకం చేసుకుంటానని శిశువు ఒట్లు పెట్టుకుంటుందని... అయితే ప్రసూతి వాయువులు తాకడంతోనే ఆ జ్ఞానం నశించి మళ్ళీ దేహభావన ఆవరిస్తోందని వివరించారు. ప్రకృతి.. దాని స్వరూపమైన దేహం జీవుడిని ఎంతగా భ్రాంతికి గురి చేస్తున్నాయో వివరించిన తదుపరి.. పరమాత్మను పట్టుకోవడం ద్వారా దేహ భావన వదిలిపెట్టాలని దేవహూతికి కపిలుడు ఉపదేశించాడని.. జీవన్ముక్తి మార్గమే శరణ్యమని, శ్రేష్టమని స్పష్టం చేసాడని సామవేదం వారు వెల్లడించారు. కపిలుని ఉపదేశానుసారం ఆ తల్లి అన్ని వ్యామోహాలను, ఇంద్రియ ఉపాధులనూ త్యజించి పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను ఉపాసిస్తూ.. అభ్యాస వైరాగ్యాలతో జీవన్ముక్తురాలైనదని.. ప్రారబ్ధ అనంతరం దేహాన్ని వదిలి దేవదేవునిలో లీనమైందని అత్యద్భుత రీతిలో వివరించారు. అలా తరించిన దేవహూతి దేహత్యాగం అనంతరం మరెందరినో తరింపజేయగల పుణ్య తీర్థంగా అవతరించిందన్నారు. కర్దముడు దేవహూతి వసించిన, కపిలుడు జనియించి తల్లికి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆశ్రమమే సిద్ధాశ్రమం అని.. ఇది గుజరాత్ లో అహ్మదాబాద్ కు సమీపాన ఇప్పటికీ ఉందని.. అక్కడే బిందు సరోవరం, దేవహూతి పుణ్యతీర్ధంగా అవతరించిన సరోవరాన్ని గాంచవచ్చని తెలిపారు. భక్తి భ్రాంతికి, నిజభక్తికి ఉన్న తేడాని కూడా భాగవతం స్పష్టంగా చెప్పిందన్నారు. నిజంగా దైవభక్తి.. తాను ఆ దైవ సంబంధం కలిగిన జీవుడినని స్పృహ ఉంటే ఇన్ని భౌతిక లంపటాలు ఎలా పెట్టుకుంటారని భాగవతం ప్రశ్నిస్తుందన్నారు. లక్ష్యం ఏదైనా కూడా ఆశ్రయం భగవంతుడే అని గుర్తించినవాడు ఆమేరకు ధన్యుడన్నారు. లోకంలో అందరూ సంపదలు, ఐశ్వర్యము కోరుకుంటూ సిరి (శ్రీలక్ష్మి) వెంట పడతారు తప్ప ఆ సిరి హరితోనే ఉంటుందన్న భావన లోపించడమే అజ్ఞానమన్నారు. భాగవతం, ఉపనిషత్తులు, భఙ్గావద్గీత తదితర వేద ప్రమాణ గ్రంథాలనుంచి సామవేదంవారు జీవన్ముక్తి లక్షణాలను సమన్వయము చేస్తూ స్ఫూర్తిదాయకంగా బోధించారు. భాగవతం నుంచి నేర్వవలసినది శరణాగత భక్తి అని ప్రతిపాదించారు. కడవని గంగలో ముంచినప్పుడు చూడడానికి కడవలో ఒక గంగ.. బయట ఒక గంగ కనిపిస్తాయని.... కానీ కడవ పగిలిపోయినప్పుడు గంగ ఏకరూపమైపోతుందని ఉదహరిస్తూ ఇందు కడవను దేహంగా అందులో నీటిని జీవన్ముక్తుని ఆత్మగా.. గంగను పరమాత్మగా తెలుసుకోవాలన్నారు. తొడిమను అంటిపెట్టుకున్న దోసపండు (ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్) ను ఉదహరిస్తూ చెప్పిన మృత్యుంజయ మహామంత్రం కూడా జీవన్ముక్తిని సూచిస్తుందన్నారు. మహా సరోవరంలో నిలిచి ఉన్న గజరాజు ఆవల అరణ్యంలో దావాగ్నిని చింత లేకుండా పరికిస్తున్నట్టుగా జీవన్ముక్తుడు ప్రపంచ వికారాలను తానెట్టి వికారానికీ లోను కాకుండా చూస్తూ సాక్షిమాత్రుడై ఉంటాడన్నారు. రామకృష్ణ పరమహంస, చంద్రశేఖరేంద్ర సరస్వతి, రమణ మహర్షి వంటి వారు జీవన్ముక్తులకు మన సమీప ఉదాహరణలని సామవేదం చెప్పారు. భగవానుడు సర్వ భూతాలకు అంతరాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రతివాడూ సర్వ భూతాత్ముడే అన్నారు. భారతీయ విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్నీ తీసి పారెయ్యడానికి అజ్ఞానం చాలని.. కానీ దీని వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవడానికి లోతైన జ్ఞానం అవసరమని సద్గురువులు సామవేదం స్పష్టం చేసారు. జీవన్ముక్తి అనే భావన, సర్వ భూత ఏకాత్మత అనే భావం కలిగిన ధర్మం ప్రపంచంలో హైందవం ఒక్కటే అని ప్రకటించారు. ఈ ధర్మంలో ఒక్కో శాస్త్రం ఒక్కోలా చెప్పినట్టు పైకి కనిపించినా అవన్నీ చెప్పినది ఒక వస్తువు గురించే అన్నారు. పాలు తెల్లగా, చల్లగా, తీయగా ఉన్నాయని మూడు ఇంద్రియాల అనుభవంతో చెబుతారని.. ఇందులో ఒక ఇంద్రియపు అనుభూతి మరో ఇంద్రియానికి తెలియదని చెబుతూ అట్లే తత్వాన్ని ఒక్కో శాస్త్రం ఒక్కోలా చెప్పినా అది అంతిమంగా ఒకే పరమాత్మను గురించి అని స్పష్టం చేసారు.

ముఖ్యాంశాలు