దీదీ మాయాలతో మోదీ రగడ


నరేంద్ర మోదీ ఓబీసీ కాదు. మోదీ నిజంగా ఓబీసీయే అయి వుంటే ఆరెస్సెస్‌ ఆయనకు ప్రధాని అయ్యే ఛాన్స్ ఇచ్చేదే కాదు. పుట్టుకతో మోదీ ఓబీసీ కాదు. వెనకబడిన వర్గాలు పడే బాధల్ని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదు. రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసమే మోడీ తన కులాన్ని వెనకడిన వారి జాబితాతో చేర్చుకున్నారు. -బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శ

నన్ను కుల రాజకీయాల్లోకి లాగవద్దు. అత్యంత వెనకబడిన కులం నుంచి వచ్చాను కాబట్టే ప్రతిపక్షాలు నాపై దాడి చేస్తున్నాయి. - మోడీ వ్యాఖ్య ఇదీ బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ నాయకురాలు మాయావతి, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఎన్నికల ప్రచారంలో సాగుతున్న వివాదం. ఇక పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో వివాదం చూద్దాం. ప్రధానమంత్రి సినిమా హీరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీదీ తనకి ఏడాదికి రెండుసార్లు కుర్తాలు, స్వీట్లు పంపుతుంటారని చెప్పారు. దీంతో మమతకు మండిపోయింది. అవును నేను మర్యాదపూర్వకంగా స్వీట్లు, బట్టలు పంపుతానేమో కానీ.. ఓట్లు మాత్రం రానివ్వను అంది. ఆ తర్వాత మాటల యుద్ధం ముదిరింది. వెస్ట్ బెంగాల్లో నలభై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, లోక్ సభ ఎన్నికల తర్వాత దీదీకి అధికారం అనుమానమే అని మోదీ అన్నారు. దీనిపై తృణమూల్ సహజంగానే మండిపడింది. మోదీ ఇక్కడికి ఎన్నికల ప్రచారానికొచ్చారా లేక ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చారా అని ప్రశ్నించింది. దీదీ మాట్లాడుతూ మోడీకి ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ చూపిస్తానని ఆవేశంగా హెచ్చరించింది. దీనికి మోదీ ప్రతిస్పందిస్తూ.. దీదీ దెబ్బలు కూడా ఆశీస్సులే అన్నారు. మళ్ళీ మమతా వివరణ ఇస్తూ.. ప్రజాస్వామ్యం చెంపదెబ్బ అంటే చేతితో కొట్టే దెబ్బ కాదన్నారు. ఇలా తన వ్యాఖ్యని వక్రీకరించడం పై మరోసారి ఆగ్రహించారు. చిట్ల కుంభకోణం, బొగ్గు మాఫియా పాత్రధారులు అంటూ తృణమూల్ నేతలపై ప్రధాని చేసిన విమర్శతో మరోసారి మమతా భగ్గుమంది. బొగ్గు మాఫియాలో మా 42 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో ఎవరైనా ఉన్నట్లు మీరు రుజువు చేస్తే మా అభ్యర్థులందరినీ ఉపసంహరించుకుంటాను. రుజువు చేయలేకపోతే ప్రజల ముందు మీరు చెవులు పట్టుకొని 100 గుంజిళ్లు తీయాలి అంటూ ప్రధాని మోడీకి సీఎం మమతా సవాలు విసిరారు.

ముఖ్యాంశాలు