మండిపడిన ట్రంప్.. పాక్ కు గడ్డు రోజులే!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి ఏళ్ల తరబడి తమను మోసం చేసిందని ఆయన నిప్పులు చెరిగారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంగా ఉంటున్నదని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం ట్విటర్‌ ద్వారా ట్రంప్‌ పాక్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.15ఏళ్ల నుంచి పాకిస్థాన్‌కు అమెరికా తెలివితక్కువగా దాదాపు 33 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. వాళ్లు (పాక్) అమెరికాని డబ్బు కోసం మోసం చేస్తూ అబద్ధాలు చెప్పింది. వాళ్లు మా నేతలను మూర్ఖులుగా భావిస్తున్నారు. పాక్‌ ఇప్పటికీ ఉగ్రవాదులకు సురక్షిత స్థలంగానే ఉంది. ఇక పాకిస్థాన్ ఆటలు మా దగ్గర సాగబోవు అని హెచ్చరించారు. గతంలో కూడా పలుమార్లు ట్రంప్‌ ఈ తీరున పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సన్నటి తెలిసిందే. ఉగ్రవాద సంస్థలపై పాక్‌ చర్యలు తీసుకోకపోతే ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ దఫా ట్రంప్‌ హెచ్చరించారు. ఇప్పటికే పాక్‌కు యూఎస్‌ నుంచి అందే 255 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అమెరికా కట్‌ చేయాలని భావిస్తున్ననేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే ఇక పాక్‌కు యూఎస్‌ నుంచి సాయం అందడం గగనమేనని అర్థం అవుతోంది. గత రెండు మూడేళ్ళుగా పాకిస్థాన్ అక్రమాలను భారత ప్రభుత్వం అగ్ర దేశాలన్నిటికీ ఆధారాలతో సహా వివరిస్తున్న నేపథ్యంలో పాక్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న తీరు ప్రపంచానికి విస్పష్టంగా అర్థం అయింది. ఉగ్రవాద శిబిరాలను మీరు తొలగిస్తారా..మమ్మల్ని తొలగించమంటారా అని కూడా లోగడ ట్రంప్ పాకిస్థాన్ ను హెచ్చరించారు.. అయినప్పటికీ పాక్ తీరు మారకపోవడం గమనార్హం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం