విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇక రెడ్ కార్పెట్


కీలకరంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ప్రోత్సహించేలా నిబంధనలను ఇంకాస్త సరళతరం చేస్తూ బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం ఒక పెద్ద కుదుపు. కాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు పూర్తిగా ఎత్తేయడంపై కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు మండిపడుతున్నాయి. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో ఆటోమేటిక్‌ రూట్‌లో 100% ఎఫ్‌డీఐలకు అనుమతించింది. ఆటోమేటిక్‌ రూట్‌ అంటే భద్రతాపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌-డీఐపీపీ సిఫారసులు మాత్రం వీటికి సరిపోతాయి. నిర్మాణ అభివృద్ధి రంగంలోనూ ఇదే తరహా వెసులుబాటు ఉంటుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాలో 49% పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్‌ రూట్‌లో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అప్రూవల్‌ రూట్‌ అంటే వివిధ శాఖల అనుమతులు తీసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. వైద్యపరికరాలకు ప్రస్తుతం ఉన్న నిర్వచనాన్ని సవరించి, ఆ రంగంలోనూ విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలిగించింది. విదేశీ నిధులు పొందే కంపెనీలతో సంబంధం ఉన్న ఆడిట్‌ సంస్థల్లోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారిగా 2016 జూన్‌లో విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళీకరించగా, రెండో విడతగా ప్రస్తుతం మార్పులు చేసింది. కాగా నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు అంటే రియల్ ఎస్టేట్ లో నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం ఇవ్వడం కాదని, స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థల్లోనే ఈ పెట్టుబడులకు అవకాశం ఉందని స్పష్టంచేసింది. కర్ణాటకలోని తుంగభద్ర స్టీల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థను మూసివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ సంస్థ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌)లో గ్రూప్‌‘ఎ’ కేడర్‌ను సమీక్షించడానికి మంత్రివర్గం ఆమోదంతెలిపింది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి కెనడాతో అవగాహనకి ఆమోదం తెలిపింది. మానసిక వికలాంగుల జాతీయ ట్రస్ట్‌ పాలక మండలి పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసింది. ఎయిర్‌ ఇండియాలో 49 శాతం పెట్టుబడులకు అవకాశం కల్పించడంటే దాన్ని దేశంలోని ఇతర విమానయాన సంస్థలతో సమానంగా పరిగణించడమేనని విమానయానశాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పారు. జాతీయ విమానయాన సంస్థగా ఇంతవరకు ఇచ్చిన ప్రత్యేక ఆదరణను రద్దు చేసినట్టని తెలిపారు. ఇక్కడ ఈ నిర్ణయం వెలువడిన మరుక్షణం దీనిలో పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆసక్తి కనబర్చడం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థ టాటాలతో కలిసి దేశంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోంది.

ముఖ్యాంశాలు