ఉగ్రవాది అరెస్ట్ ... ఢిల్లీలో కలకలం


18 సంవత్సరాల తర్వాత ఓ ఉగ్రవాది అరెస్ట్‌ అయ్యాడు. అతడు దేశ రాజధాని ఢిల్లీలో అనుకోకుండా పట్టుబడడం... సరిగ్గా రిపబ్లిక్ డే వేడుకల సమయంలో ఇది జరగడంతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లష్కర్‌-ఇ-తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ అహ్మద్ అనే ఈ ఉగ్రవాది సామాన్యుడు కాదు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు. తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల బిలాల్‌ అహ్మద్‌ కవాను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం పట్టుబడ్డాడు. శ్రీనగర్‌ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్‌ ఏటీస్‌-స్పెషల్‌ సెల్‌ పోలీసులు వెల్లడించారు. హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించిన అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. కవా బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు సేకరించిన అధికారులు హవాలా ద్వారా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలకు అతను నగదు బదిలీ చేసినట్లు ఇప్పటికే ధృవీకరించారు. ఎర్ర కోట దాడి తర్వాత 18 ఏళ్లుగా కవా పలు ప్రాంతాలలో వివిధ కార్యకలాపాలు నెరపాడు. కశ్మీర్‌ లో అనేక విధ్వంసాలతో ఇతడికి సంబంధాలున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో ఈసారి ఢిల్లీలో ఏదైనా పెద్ద దాడులకు లష్కర్ ఫ్లాన్‌ చేసి ఉంటుందని అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. బిలాల్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించారు. పేద ఎత్తున నాకాబందీ చేపట్టారు.

ముఖ్యాంశాలు