చైనాకి చెక్ .. ఇండియాకు వియత్నాం పిలుపు !


వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చమురు, సహజ వాయువు సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టాలని భారత్‌ను వియత్నాం ఆహ్వానించింది. దీనికి చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్‌లోని వియత్నాం రాయబారి టాన్‌ సిన్హ్‌ తాన్‌ ఆన్‌ మంగళవారం భారత దేశానికి చెందిన ఒక న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ పెట్టుబడులను తమ దేశం ఆహ్వానిస్తోందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యగా దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్‌ ఆ వెంటనే పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఈ అంశాన్ని తాము సహించబోమని తెలిపారు. అభివృద్ధి కోసం పొరుగుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను తాము వ్యతిరేకించబోమని కూడా ఆయన చెప్పారు. వియత్నాం పేర్కొన్న ప్రాంతాల్లో భారత్‌కు చెందిన ఓఎన్‌జీసీ చమురు అన్వేషణలు సాగించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకించగా ఇది వాణిజ్య కార్యకలాపాల్లో భాగమని, ఈ వివాదంతో తమకు సంబంధం లేదని భారత్‌ అన్నది. వ్యూహాత్మకంగా కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో ఏటా లక్ష కోట్ల డాలర్ల వాణిజ్యం సాగుతుంది. ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్‌ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని అంచనా. ఈ ప్రాంతం తమదే అని చైనా అంటున్నది. ఆమేరకు ఆక్రమణ చర్యల ద్వారా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే వియత్నాం, ఫిలిప్పైన్స్‌, మలేసియా, బ్రూనై, తైవాన్‌ దేశాలు ఈ సముద్ర జలాల్లో వాటా కోసం పోరాడుతుండడంతో వివాదం నెలకొంది.

ముఖ్యాంశాలు