దైవదర్శనం సత్యం.. కుతర్కం అజ్ఞాన జనితం


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో తొమ్మిదో రోజు ప్రసంగం) భగవంతుడు సాకారంగా దర్శనం ఇవ్వడం జ్ఞానుల విషయంలో పరిపూర్ణ సత్యమని.. దీనిపై సందేహం అనవసరమని సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవే దం షణ్ముఖ శర్మ స్పష్టం చేసారు. రాజమహేంద్రవరం లో సాగుతున్న శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం రాత్రి ఆయన ప్రసంగిస్తూ పోతనామాత్యునికి శ్రీరామ చంద్రమూర్తి, తిక్కన సోమయాజికి హరిహరులు, కూచిమంచి తిమ్మకవికి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యారనేది నూరుపాళ్లు నిజమన్నారు. ఈ విషయాన్ని వారే చెప్పుకున్న తరువాత కాదనడానికి మనమెవరమని ప్రశ్నించారు. శైవ వైష్ణవ వైరం నేపథ్యంలో తిక్కన సోమయాజి తన గ్రంథానికి ఇద్దరి ఆశీస్సులను అన్వయిస్తూ హరిహరుల ప్రత్యక్షం గురించి రాశాడంటూ ఒక విద్యావేత్త సిద్ధాంత గ్రంథంలో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ సామవేదం వారు తీవ్రంగా నిరసించారు. యజ్ఞం చేసిన సోమయాజి తిక్కన అని.. ఆయన అసత్యం చెప్పే పరిస్థితి ఎన్నటికీ రాదన్నారు. అగ్ని వాగధిష్టాన దేవత అయినందున అగ్నికార్యం ఉన్నవాడు అబద్ధం ఆడితే దారుణ దోషం కలుగుతుందని చెప్పారు. ఆరాధించిన రూపంలో భగవత్ సాక్షాత్కారం అనేది గొప్ప సాధకుల విషయంలో అత్యంత స్వాభావికమని చెప్పారు. దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఆజన్మాంతం తపస్సు గా జీవించిన మహాత్ముల అనుభవాలను కాదని అంటే మనకి పాపం అంటుకుంటుందని హెచ్చరించారు. భారతీయ విధానమైన హైందవారాధనా పద్ధతులను విమర్శించడం.. అవహేళన చేయడం కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తరింపజేసేది భక్తే తప్ప తర్కం కాదన్నారు. మంత్రం భగవానుడి శబ్ద స్వరూపమని చెబుతూ పురాకృత సుకృతంతో మాత్రమే దానిని పొందడం సాధ్యమన్నారు. అలా మంత్రోపదేశం పొందినవాడు తదేక దృష్టితో, ఏకాగ్ర చిత్తంతో భగవత్ స్వరూపాన్ని భావన చేస్తూ.. ఆ మూర్తికి భౌతిక సేవలు, ఉపచారాలు చేస్తూ, ధ్యానిస్తే తప్పక తరిస్తాడన్నారు. భగవంతుడు కనిపిస్తాడా? అని అడిగే వాళ్ళు తపస్సు చేస్తే తప్పక కనిపిస్తాడని తెలుసుకోవాలన్నారు. భక్తులైనవారు హిందూ ధర్మంపై దుష్ప్రచారాలు నమ్మకపోవడమే కాకుండా వాటిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. శాస్త్రం చెప్పిన పద్ధతిలో వాటికి సరైన సమాధానం చెప్పి ధర్మ వ్యతిరేకుల నోళ్లు మూయించాలన్నారు. పూజలు, అభిషేకాలు, యఙ్ఞహోమాలు ఇలాంటివన్నీ వ్యర్థం అని మేధావుల ముసుగులో పలువురు చేస్తున్న వాదనలు దొంగమాటలన్నారు. కొందరు హిందువులు, ఆచార్య స్థానాల్లో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలే చెబుతూ ధర్మద్రోహం చేస్తున్నారన్నారు. బద్ధకానికి అనువుగా ఉన్నాయి కదా అని ఇలాంటి శాస్త్ర విరుద్ధ పోకడలను అనుసరిస్తే హిందువులు ఉభయభ్రష్టులవుతారని హెచ్చరించారు. బాహ్యమైన అన్నపానాదులు, దేశకాల ప్రయోజనాలు మనకు అవసరమైనంత కాలమూ ఆధ్యాత్మికపరమైన బాహ్య ఉపచారాలు కూడా తప్పక ఆచరించాలన్నారు. అందుచేతనే జ్ఞానులు తాము భగవదనుభూతి పొందినా కూడా పూజను మానరన్నారు. శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ స్వామి వంటి పీఠాధిపతులు వారు జీవన్ముక్తులైనప్పటికీ కూడా మనకు సందేశం ఇవ్వడానికే నిత్య పూజలు చేస్తున్నారన్నారు. జ్ఞానులు, మహాత్ముల జీవితాలను సాధనాదృష్టితో చూస్తే మనకు గొప్ప సందేశాలను ఇస్తాయని సామవేదం వారు పేర్కొన్నారు. నామరూపాత్మకమైన ఈ ప్రాపంచిక మాయలో చిక్కుకున్న మనం ఇందులోనుంచి బయటపడాలంటే భగవంతుని నామరూపాలే శరణ్యమని స్పష్టం చేసారు. మంత్రమే దేవత అని వేదం చెప్పిందని తెలిపారు. భగవంతుడు భావ వర్ధనుడని.. ఏ మంత్రంతో, ఏ భావనతో ధ్యానిస్తే ఆ భావాన్ని లేదా ఆ యోగాన్ని వర్ధిల్లజేస్తాడని... అంటే సాకారం చేస్తాడని సిద్ధాంతీకరించారు. సరూపంగా పూజిస్తే ఆ రూపంలో, నిర్గుణ ధ్యానులకు నిరాకార నిర్గుణునిగా ఈశ్వర ప్రాప్తి కలుగుతుందని.. సకాములకు అభీష్టాలు సిద్ధిస్తే.. నిష్కాములు ముక్తిని పొందుతున్నారని వెల్లడించారు. అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన అంతిమ లక్ష్యం అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. యజ్ఞ హోమాదుల ద్వారా కట్టెను నిప్పుకి అర్పిస్తే అదే భక్తి అనబడుతుంది.. అదే నిప్పు కట్టెపై పడి దగ్ధమైపోతే అదే జ్ఞానమని అంటూ ఏదయినప్పటికీ అజ్ఞాన ధ్వంసమే లక్ష్యమన్నారు. తొమ్మిదో రోజు ప్రవచనం మొత్తం ధ్రువోపాఖ్యానం సాగింది. సామవేదం వారి ప్రవచన ఝరిలో ఆ కథాగమనం ఇలా ఉంది. స్వాయంభువ మనువు కుమారుల్లో పెద్దవాడైన ఉత్తానపాదుడు ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. అతడికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. రాజుకి రెండో భార్య మీదనే ప్రేమ. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే కుమారులు ఉన్నారు. ఒకనాడు ఉత్తానపాదుడి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు కూడా తండ్రి ప్రేమను ఆశించి ఆయన చెంతకు వెళ్లబోగా పినతల్లి సురుచి అతడిని తోసివేసింది. నీకు ఆ ఒడిలో కూర్చునే అదృష్టం లేదని.. అది తన బిడ్డకే సొంతమని అంటూ.. నువ్వు తపస్సు చేసి నా కడుపున పుడితే తప్ప అంతటి భాగ్యం దక్కదంటూ ఈసడించింది. ఎంతో బాధపడిన ధ్రువుడు తల్లి సునీతికి ఈ విషయం చెప్పి విలపించాడు. ధార్మికురాలైన ఆ తల్లి కుమారుడిని ఊరడిస్తూ.. నాయన.. నీ పినతల్లి నిర్దాక్షిణ్యంగా నిన్ను తోసివేసినా.. ఆమె చెప్పిన మాట ఏమాత్రం నీకు హితదాయకమని తెలిపింది. ఏ లక్ష్యానికైనా శ్రీహరి ధ్యానమే శరణ్యం కనుక ఆ స్వామి కోసం తపస్సు చేయాలని కుమారుడిని ప్రేరేపించింది. రాజకుమారుడైన ధ్రువునిలో తమ్మునిపై పైచేయి సాధించాలన్న పంతం, తండ్రి ప్రేమ పొందాలన్న పట్టుదల మిక్కుటంగా ఉన్నాయి. ఇప్పుడా తల్లి ప్రేరేపణతో తపస్సు ద్వారా వాటిని సాధించాలని బయలుదేరాడు. పురాకృత సుకృతం పుష్కలంగా ఉన్న ఆ బాలుడికి దోవలో నారద మహర్షి ఎదురయ్యాడు. ఏమిటని అడిగిన నారదునికి ధ్రువుడు సమస్తం చెప్పి నారాయణుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చెప్పమని కోరాడు. అపుడు నారదుడు... తమ్ముడిపై పంతం ఎందుక