బిజెపికి కనీస మెజారిటీ వస్తుందా?


దాదాపు పూర్తయిన పోలింగ్ నేపథ్యంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడం నూరుశాతం ఖాయమే అని తేలినా.. కనీస మెజారిటీపై ఆ పార్టీలోనే భయ సందేహాలున్నాయి. దేశంలో ప్రధాన వ్యతిరేక పక్షం కాంగ్రెస్ తో సహా మరే ఇతర పార్టీకీ గట్టిగా అరవై సీట్లు వస్తాయనే గ్యారంటీ కూడా లేకపోయినా.... కూటమి రాజకీయాల దృష్ట్యా.. బిజెపి సంకట పరిస్థితిని ఎదుర్కోవచ్చని అంచనాలున్నాయి. పని చేసే ప్రధానిగా, నిజాయితీపరునిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్రమోడీకి జనంలో ఎంత మంచి పేరు ఉన్నా దానిని ఓట్ల బలంగా మార్చుకోవడంలో బిజెపి చతికిలబడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. నిజంగా ప్రధాని పదవికి ప్రత్యక్ష ఎన్నిక అయితే (అధ్యక్ష తరహా అయితే) నాలుగువందల పైగా సీట్లు బిజెపికి వచ్చేవి. కానీ వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, వాటి బలాబలాలు, అక్కడి ప్రజలతో బిజెపి స్థానిక సంబంధాలు ప్రభావితం చేయడం వలన బిజెపి బలం గణనీయంగా తగ్గిపోయింది. పాకిస్థాన్ పై మెరుపుదాడులు, పది శాతం పేదల రిజర్వేషన్ అంశం గట్టిగ ప్రభావం చూపితే మాత్రమే బిజెపికి మెజారిటీ వస్తుంది. ఇవి ఎన్నికలో పని చేస్తే బిజెపికి కనీస మెజారిటీ ఓ లెక్కలోది కాదు.. 300 పైచిలుకు సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇవి పని చేయకపోతే మాత్రం 180 నుంచి 250 మధ్యలో బిజెపి బలం పరిమితం కావచ్చు. గతంలో పూర్తి ఎంపీ సీట్లు వచ్చేసిన రాష్ట్రాల్లో ఈసారి తగ్గుదల కనిపించే అవకాశాలు, గతంలో బలహీనంగా ఉన్న కొన్నిరాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించు అలాగే ఉండడం... ఆంధ్ర తెలంగాణ లాంటి చోట్ల పూర్తి వ్యతిరేక పరిస్థితి... కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల బలం పెరుగుతుంది అనుకున్నా. అది ఏ స్థాయిలో ఉండి, ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలీని పరిస్థితి నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్తాన్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలపైనే బిజెపి ఆశలు పెట్టుకొంది. ఇక ఆంధ్ర లో జగన్ పార్టీ, తెలంగాణాలో కేసీఆర్ పార్టీ, ఒడిశాలో బిజెడి గెలిచి తమకి మద్దతిస్తామని ఆశతో ఉంది. ఒడిశాలో అయితే తమకి సొంతంగా కొన్ని సీట్లు కూడా రావచ్చని ఆశిస్తోంది. ఇంకొక గమనార్హమైన అంశం ఉంది. చంద్రబాబు, మాయావతి, మమతా, కేజ్రీవాల్, శరద్ పవర్, లాలూ బాచ్, స్టాలిన్ తదితరులు ప్రధాని మోడీపై వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్నారు. మోడీ పై కక్షతో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ అనుకూల, బిజెపి వ్యతిరేక కూటమిని బలంగా తయారు చేసే పనిలో ఉన్నారు. ఎన్ డి ఏ లోనూ చీలిక తేవాలని చూస్తున్నారు. బిజెపి బలం తగ్గితే ఇది అసాధ్యం ఏమీ కాదు. ఇప్పుడు పైకి ఏ మాటలు మాట్లాడుతున్నా.. మమతా బెనర్జీ, మాయావతి, రామ్ విలాస్ పాశ్వాన్, చంద్రబాబు, కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్, శివసేన, స్టాలిన్.. వీళ్ళెవరూ కూడా బిజెపి లేదా కాంగ్రెస్ లేదా థర్డ్ ఫ్రంట్ కి కట్టుబడిపోయిన వాళ్ళు కారు. బిజెపికి, కాంగ్రెస్ కి, తమకి వచ్చిన సీట్లని బట్టి.. అప్పటి సమీకరణాలను పరిణామాలను బట్టి వారు ఆ సమయానికి ఏ ఎత్తుగడలు వేస్తారో వారికే తెలియదు. ప్రధాని పనితీరుని బట్టి పార్టీ ఇమేజి పెరగడం లేదా తగ్గడం సాధారణంగా జరుగుతుంది.. కానీ ఇక్కడ రివర్సు. ప్రధానమంత్రి ఇమేజి కొండంత ఉన్నా... వాడుకోలేక డేమేజి అయిన పరిస్థితి బిజెపిలో ఉంది.

ముఖ్యాంశాలు