తీవ్ర తుపానుగా మారిన గజ


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘గజ తుపాను’గా ఐఎండీ నామకరణం చేసింది. ప్రస్తుతం ఇది పోర్ట్‌బ్లెయిర్‌కు 400 కి.మీ, చెన్నైకి 900కి.మీ, నెల్లూరుకి 1050కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది తీవ్ర తుపానుగా మారి ఈ నెల 15 నాటికి చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. గజ తుపాను ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 11 నాట్ల వేగంతో కదులుతోందని స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది. తుపాను కారణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

ముఖ్యాంశాలు