ధరలీగతి పెరుగుతుంటే దేశమేగతి బాగుపడునోయ్!


అధికారంలో ఉన్నవారు.. అధికారం కోసం కలలు కంటున్నవారు కూడా తెలుసుకో వలసిన విషయం ఒక్కటుంది! కేవలం రెండు రెండున్నరేళ్లు అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం గురించి జనం మూడు దశాబ్దాల పాటు గుర్తుంచుకోవడం ఎక్కడైనా ఉంటుందా? అది జనతా పార్టీ ప్రభుత్వం విషయంలో జరిగింది. ఇప్పటికీ పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి... జనతా రోజులు స్వర్ణయుగం అనే చెబుతారు. దానికి కారణం ఒక్కటే... ఆ రెండేళ్ల టైం లోనే ధరలు రికార్డు స్థాయిలో దిగివచ్చాయి.. ఓపెన్ మార్కెట్ చేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గి పేద మధ్యతరగతి జనాలు ఊపిరి పీల్చుకున్నారు! ఆ ప్రభుత్వం ఉన్నప్పటికి నా వయసు ఆరేళ్ళే కాబట్టి నాకు ప్రత్యక్షంగా తెలియదు. కానీ ఇవి ఇంతకాలం జనంలో నేను విన్న విషయాలు ఇవి. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం విషయంలోనూ ఇలా ధరలు తగ్గించారనే మాటని నేను వినలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతూనే ఉండగా.. రైతులకు కిట్టుబాటు ధరలు పెద్దగా పెరగని పరిస్థితి ఉండగా... వినియోగదారుడికి మాత్రం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవేవైనా కరువు రోజులా, యుధ్ద సమయమా? దేశంలో ఇందిరా గాంధీ నుంచి, నరేంద్ర మోడీ వరకూ, రాష్ట్రంలో చెన్నారెడ్డి మొదలు చంద్రబాబు వరకూ అందరూ సంజాయిషీ చెప్పుకోవలసిన దారుణం ఇది! అసలు ధరల దెబ్బకి దేశంలో అత్యధిక జనం ఈ పూట గడవడం ఎలాగరా బాబూ అని బెంగపడే పరిస్థితి వస్తే... ఇక దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అవును.. ధరలీగతి పెరుగుతుంటే దేశమేగతి బాగుపడునోయ్ !!?

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం