100 వ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం


వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే గనుక ఇవాళ (శుక్రవారం, జనవరి 12) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన వందో ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది మన అంతరిక్ష పరిశోధనారంగంలో మరో మైలురాయి అవుతుంది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. దీనిద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్‌ మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేర్చినట్టు అవుతుంది. కెనడా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌, అమెరికాకు చెందిన 28 ఉపగ్రహాలతో పాటు మన ఉపగ్రహాలు మూడింటిని ఈ తాజా ప్రయోగంలో నింగిలోకి పంపనున్నారు. వీటిలో 25 నానో, మూడు మైక్రో ఉపగ్రహాలు ఉన్నాయి. కార్టోశాట్‌-2ఇ బరువు 710 కిలోలు. మిగిలిన ఉపగ్రహాల బరువు 613 కిలోలు. పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇది 42వ ప్రయోగం. ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కార్యక్రమం గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైంది. ఇది 28 గంటలపాటు కొనసాగుతుంది. ఇస్రో చీఫ్ కిరణ్‌కుమార్‌ శ్రీహరికోట చేరుకుని శాస్త్రవేత్తలతో ప్రయోగంపై సమీక్షించారు. భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్‌ ఫోటోలను అందించడం కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత. కార్టోశాట్‌-2 శ్రేణిలో ఇది మూడవది. ఇందులో పాన్‌క్రొమాటిక్‌, మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరాలు ఉంటాయి. అర్బన్, రూరల్ ప్లానింగ్, తీర ప్రాంత వినియోగం, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

ముఖ్యాంశాలు