పథకాల కోసం కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కారాదు


10 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంతో ప్రభుత్వం పట్ల ప్రజావిశ్వాసం మరింత పెరిగిందని, ప్రభుత్వ బాధ్యతనూ ఈ కార్యక్రమం పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల సంఖ్య కంటే ఎంతమంది అర్హులకు చేరుతున్నాయనేది ప్రధానం అన్నారు. గురువారం రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో జన్మభూమిపై అయన అధికారులతో సమీక్షించారు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు అర్హులున్నా అందరికీ పింఛను సహా ప్రయోజనాలన్నీ అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల కోసమే ఉన్నతమైన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించడానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వచ్చే కలెక్టర్ల సదస్సుకి తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. కాగా గురువారం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన జన్మభూమి-మాఊరు ముగింపు సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని ఈ సందర్భంగా తెలిపారు.

(Report from Ananthapuram) రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే ఏమాత్రం సహించేది లేదని.. ఇది కొనసాగితే తోలు తీస్తాననీ,వారికి అర్థమయ్యే భాషలో ఎలా చెప్పాలో తనకు తెలుసని హెచ్చరించారు. గ్రామాల్లో సమస్యల్ని ఆర్థిక, ఆర్థికేతరమైనవిగా విభజించి ఆర్థికేతర అర్జీల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. అనంతపురంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉపన్యాసాలు ఇస్తారు గానీ ప్రజలతో మరుగుదొడ్లు కట్టించలేక పోతున్నారని చంద్రబాబు విమర్శించారు. మార్చి 31లోపు ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి తీరాలన్నారు. వృద్ధులకు తాను పెద్దకొడుకుగా ఉంటున్నానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆనంద సూచికలో (హ్యాపీనెస్‌ ఇండెక్స్‌) పది పాయింట్లకు గాను నార్వే 7.54 పాయింట్లతో మొదటి స్థానంలో 4.35 పాయింట్లతో భారత్‌ 122వ స్థానంలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 5.36 పాయింట్లతో 72వ స్థానంలో ఉందని సీఎం తెలిపారు. ఎందరు అడ్డుపడినా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని ఏడాదిలో పూర్తిచేసి చూపామని చంద్రబాబు తెలిపారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని అలాగే వంశధార-నాగావళి నదులను కలుపుతామని చెప్పారు. ఇలా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇటు సీమ జిల్లాల్లో నదులను కలుపుతామన్నారు. అనంతలో వర్షాభావం ఏర్పడితే.. శ్రీకాకుళం నుంచి నీటిని తెచ్చి ఇస్తామన్నారు. సీమలో కరవును పారదోలేందుకు ఎంత డబ్బయినా ఖర్చు చేస్తామన్నారు. జన్మభూమి సభకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా ద్వారా వచ్చిన కృష్ణా జలాలతో నిండిన బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు దేవినేని ఉమ, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శాసన మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌, శాసనసభ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం