100వ ఉపగ్రహ ప్రయోగం.. ఇస్రో సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రంనుంచి  వందో ఉప‌గ్ర‌హాన్ని, ఇతర మైక్రో, నానో ఉపగ్రహాలను దిగ్విజయంగా ప్ర‌యోగించి క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు  పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యల్లో ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. ఇది భార‌త్ వందో ఉప‌గ్రహానికి సంబంధించిన ప్రయోగం కావడంతో పలు ప్రపంచ దేశాలు ఈ ప్రయోగాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయి. ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తరలించిన ఘనత గతంలో ఇస్రో సొంతం అయింది. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అమెరికా, రష్యా వంటి అగ్రదేశాల సరసకు భారత్ చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బ్రేక్ చేసి ఒక బలమైన సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా ఇవాళ్టి ప్రయోగంలో 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపగా వాటిలో 28 విదేశాలకు చెందినవి ఉన్నాయి. ఈ రాకెట్ లో సగానికి పైగా బరువు ఉన్న ఏకైక ఉపగ్రహం  ‘కార్టోశాట్‌-2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం కాగా ఇది భారత్‌కు చెందినది. మరో సగం బరువు (సుమారు)లో 28 ఇతర దేశాలకు చెందినవి కాగా, మైక్రో, నానో (ఐఎన్‌ఎస్‌)లు మనదేశానివి. ఇప్పుడు పంపే ఉపగ్రహాలు అయిదేళ్లు పనిచేస్తాయని అంచనా. వీటి సహాయంతో పొరుగుదేశాలపైనా నిత్యం నిఘావేసి ఉంచే సదుపాయం కలుగుతుంది. ఈ కెమెరాలు భూమిపై ఒక మీటర్‌ పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరిత గతిన తమ నియంత్రణ కేంద్రాలకు పంపగలవు. ఇప్పటికే సేవలందిస్తున్న ‘కార్టోశాట్‌’ తరగతి ఉపగ్రహాలు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందివ్వడం గమనార్హం. తాజా ‘కార్టోశాట్‌’తో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కచ్చితత్వంతో కూడిన రేఖాచిత్రాలను తయారుచేసే సౌలభ్యం లభిస్తుంది. 

Facebook