విన్నపాలు వినవలె!-  ప్రధానికి బాబు వినతిపత్రం

విభజన చట్టంలోని హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. నెరవేర్చాల్సిన హామీలతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని ఆయన ప్రధానికి అందజేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్ల అంచనాతో సమర్పించిన నివేదికను ఆమోదించడం, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడం వంటి విన్నపాలను సీఎం ప్రధానికి వినిపించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా కేంద్రం నుంచి సుమారు రూ.3వేల కోట్లు రావాల్సి ఉందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీ రుణాల గురించి సీఎం చర్చించారు. వీటి కింద రూ.20,010 కోట్లు రావాల్సి ఉండగా, ఐదేళ్లలో ఇంత మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే సామర్థ్యం  లేదన్నారు. ఈ నిధులతో పాత విదేశీ రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, నాబార్డు రుణాలు చెల్లించేందుకు అనుమతించాలని కోరారు. విశాఖ రైల్వే జోన్‌, అమరావతి మెట్రో కూడా వారి మధ్య చర్చకు వచ్చాయంటున్నారు. 

Facebook
Twitter