ఈ లంచగొండి నిజంగానే తిమింగలం!


అవినీతి నిరోధక శాఖ చరిత్రలో అత్యధిక లంచం తీసుకుంటూ ఒక అధికారి పట్టు బడ్డాడు. ఓ కంపెనీకి ఇన్‌పుట్‌ పన్ను రాయితీ చెల్లింపునకు గాను రూ.22.5 లక్షలు లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఏడుకొండలు ఎసిబి అధికారులకు చిక్కారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలోనే అతడు ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. అతడు ప్రస్తుతం చెక్‌ పోస్టుల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఎసిబి డీజీ ఠాకూర్‌ పర్యవేక్షణలో కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో లంచం తీసుకున్న వారితో పాటు అది ఇచ్చిన వారిపైనా ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఇంకా కార్యాలయ సూపరింటెండెంట్‌ అనంతరెడ్డి, కంపెనీ డిప్యూటీ మేనేజర్‌ సత్యనారాయణ, లీగల్‌ అడ్వయిజర్‌ గోపాలశర్మపై కూడా కేసు నమోదైంది. తమ శాఖ చరిత్రలో ఇంత భారీ మొత్తం లంచం తీసుకుం టూ పట్టుబడిన మొట్టమొదటి ఘటన ఇదేనని శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. ఈ లంచం చేతులు మారుతున్న విషయమై తమకి సమాచారం రాగా నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ లేని సమయంలో కంపెనీ ప్రతినిధులను పిలిపించి ఈ డబ్బు తీసుకోబోతుండగా పట్టుకున్నామన్నారు. మరో రూ.2.5లక్షలు చేతులు మారా యని ... వివరాలకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ముఖ్యాంశాలు