నిజమైన ప్రజాస్వామ్య భావన.. నాటి రాజర్షుల పరిపాలన


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో పదవ రోజు ప్రసంగం) భాగవత పురాణంలో వర్ణించబడిన ప్రాచీన భారతదేశపు ఆదర్శ పరిపాలనా వ్యవస్థను, ఆ కాలంలోని నిజమైన ప్రజాస్వామ్యాన్ని, గమనించదగిన విశ్వ శాస్త్ర రహస్యాల సాంకేతిక పరిభాషా సంకేత విషయాలను ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అత్యద్భుతంగా వివరించారు. ఆదివారం రాత్రి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా ఆయన పదవరోజు ప్రవచనం గావించారు. ధ్రువుని వంశస్థులలో ఉత్కళుడు మొదలు పృథు చక్రవర్తి వరకూ గల మహాత్ముల చరిత్రలను అందలి విశేషాలను ఈ సందర్భంగా ఉత్కంఠ గొలుపు రీతిన వివరించారు. కాలగతి తెలిపే విశ్వ రహస్యాల ప్రస్తావనతో పాటుగా.. ఆనాటి ప్రజాస్వామ్య వైభవము ఇందు చోటు చేసుకోవడం విశేషం. ధ్రువుని కుమారుడు ఉత్కళుడు నివృత్తి మార్గం అనుసరించి సింహాసనం వలదని తిరస్కరించగా... అతడి తమ్ముడైన వత్సరుడ్ని (యితడు భ్రమి కుమారుడు) రాజుగా అభిషేకించారు. ఈ పేర్లకు గొప్ప విశేషం ఉందని... మనువులు, ప్రజాపతులు, లోకగతిని మలుపు తిప్పిన గొప్ప మహారాజుల నామాలు మహా విశ్వ పరిణామాల, అంతరిక్ష విశేషాల తాలూకు సంకేత నామాలు కావచ్చునని ఆయన చెప్పారు. ఈ రమ్యమైన కథలను గురించి మనం ఇటువంటి ప్రాతిపదికపై కూడా ఆలోచిస్తే అద్భుతమైన సత్యాలు బయటికి వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విదేశాల్లో కాస్మిక్ నాలెడ్జి, కాన్షస్ నెస్ స్టడీస్ పేరుతో జరుగుతున్న పరిశోధనలు హిందూ విజ్ఞానం పైనే అని, భారతీయ మహర్షులు వేల ఏళ్ళనాడే దర్శించిన ఈ విశ్వ దృష్టి పైనే అని తీర్మానించారు. వారు పైకి మన ధర్మం పేరు చెప్పడంలేదని.. అయితే ఇటువంటి మహా జ్ఞానం ప్రాచీనకాలంనుంచే కొలువుదీరిన ధర్మం హిందూ ధర్మం మాత్రమేనన్న సత్యాన్ని మన యువత గ్రహించాలన్నారు. మనం ఈ విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలన్నారు. ధ్రువుడు అంటే కాల చక్రానికి ఆధారమని.. ఉత్కళుడు (ఉత్కాలుడు) అంటే ఆ కాలాతీత స్థితిని అంటే బ్రహ్మ జ్ఞానం పొందినవాడని సామవేదం సూత్రీకరించారు. ఇక భ్రమి అంటే కాల చక్ర భ్రమణం అని పేర్కొన్నారు. ఆ భ్రమి తనయుడు వత్సరుడు పేరు రీత్యా సంవత్సర అధిపతి అయితే అతడి భార్య సర్వీధి.. అని .. సర్వీధి అంటే సూర్యుడి మార్గం అని వక్కాణించారు. వత్సరుడు, సర్వీధుల సంతానం పుష్పార్ణుడు, యుగ్మకేతు, వసువు, జయుడు తదితరులు ఆరుగురు కాగా వీరు ఋతువులకు అధిపతులు అని తెలిపారు. ఇది కాస్మిక్ విజ్ఞానం అయినప్పటికీ.. ఇవి సంకేత కథలు మాత్రం కావని నిజంగా జరిగిన కథలే అని అన్నారు. ప్రకృతిలో, విశ్వంలో కనిపించే స్వరూపాలకు అధిష్టాన దేవతలే ఈ పాత్రలని.. ఇదొక రహస్య జ్ఞానమని స్పష్టం చేసారు. అందుచేతనే వేదాలకంటే పురాణ విజ్ఞానం గహనమని మన పెద్దలు చెప్పారన్నారు. చదవకుండానే పురాణాలను విమర్శించడం.. ఈ గొప్ప విజ్ఞానాన్ని చిన్నచూపు చూడడం అలవాటైపోయిందని ఆవేదన చెందారు. చదవడానికి తేలిక కాబట్టి వాటిలోని విషయం తేలికగా ఉంటుందని అనుకోవద్దని.. పురాణాలు మామూలుగా ఏమాత్రం అర్థం కాని గహనమైన రహస్యాలను చిన్ని చిన్ని కథల రూపంలో సరళంగా అందిస్తున్నాయని చెప్పారు. పురాణకథలను సక్రమంగా అర్థం చేసుకోవడానికి నిశిత పరిశీలన శక్తి అవసరమని సామవేదం వారు స్పష్టం చేసారు. వైజ్ఞానిక అంశాల్ని రమ్యమైన కథలుగా చెప్పే పురాణాలు పరమేశ్వర ప్రణాళికను తేటతెల్లం చేస్తాయని తెలిపారు. విజ్ఞానానికి రసత్వం అద్దడం వలన మనం ఆస్వాదించగలమనే దయతోనే వాటిని మహర్షులు ఇలా ఋషులు ప్రసాదించారన్నారు. ఈ కోణం నుంచి నేటి యువత పురాణ విజ్ఞానాన్ని పరిశీలించి అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేమమే లక్ష్యంగా సాగిన పరిపాలనా వైభవాన్ని పుష్పార్ణుడి భార్యల పేర్లు ప్రభ, దోష (పగలు, రాత్రి అని అర్థం) కాగా ప్రభకు ముగ్గురు కుమారులు.. వీరి పేర్లు ప్రాతః, మధ్యందిన, సాయంకాల (కళాభిమాన దేవతలు). ఇక మరో భార్య దోష పుత్రుల పేర్లు ప్రదోష, నిశీధి, విష్ణము అని చెబుతూ ఇదంతా కాల స్వరూపమే అని విశదపరిచారు. దోష మూడవ పుత్రుడైన విష్ణునకు భార్య పేరు పుష్కరిణి (సూర్యోదయానికి ముందు దశ).. వీరికి సర్వ తేజసుడు పుత్రుడు అతడి భార్య ఆకూతి. వారి పుత్రుడు చాక్షుష. ఇతడొక మనువు (చాక్షుష మన్వంతరం).. ఇతడికి పన్నెండు మంది పుత్రులు అని పేర్కొన్నారు. వారిలో వృక్కునికి జన్మించినవాడు అంగుడు అని ఈ అంగుడు ధర్మబుద్ధితో పాలించాడని వివరించారు. అయితే అతడికి పుట్టిన వేణుడు దుష్టుడు, నాస్తికుడు.. దయాహీనుడు కావడంతో ఇట్టి పుత్రుడు పుట్టకున్న బాగుండేదని విసిగి వైరాగ్యం చెందిన అంగుడు వానప్రస్థం స్వీకరించగా వేణుడు రాజయ్యాడు.ఈ వేనరాజు కాలాన్ని పరిశీలిస్తే ఆనాటి రోజుల్లో ప్రజాస్వామ్యం గురించి తెలుస్తుందన్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం భక్తి మాత్రమే కాదని భాగవత మహా పురాణం చదివితే తెలుస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు. సక్రమ జీవన విధానమే ఆధ్యాత్మికత అని.. అది లేకుండా జీవిస్తే గుడ్డి బతుకే అవుతుందని పేర్కొన్నారు. వ్యక్తి, కుటుంబ, సమాజ జీవితగతుల్ని సమృద్ధంగా ఆనాటి పురాణాల్లో వివరించారన్నారు. ఇవి నేటి ప్రపంచానికి కూడా సరిపోతాయన్నారు. తానే ప్రభువని, ఎవరూ యజ్ఞ యాగాలు చేయరాదని.. చేస్తే ఆ హవిస్సులు తనకే ఇవ్వాలని వేన రాజు ఆదేశించాడని తెలిపారు. రాజు అవినీతి పరుడైతే అధికారులు దొంగలవుతారని భాగవతం తెలిపిందన్నారు. వేణుడి అరాచకం మూలంగా రాజ్యం కుపితమవగా.. మేధావులు, మంత్రులందరూ ఆలోచించి వేణుడికి హితబోధ చేసారు.. అయినా సరే అతడు మాట వినకపోవడంతో అతడిని చంపేశారని వెల్లడించారు. ప్రజాక్షేమం కోసం ఒక దుష్టుడైన రాజుని చంపినా తప్పు లేదని ఈ వృత్తాంతం చెప్పిందన్నారు. వారసత్వం రాజ్యాధికారానికి ఆ రోజుల్లో ఒకానొక అర్హత మాత్రమే అని.. ఆ అర్హతతో పాటు రాజవడానికి జ్ఞానము, పాలనాదక్షత, పరాక్రమం వంటి ఇతర అర్హతలెన్నో అవసరం అని నాటి వ్యవస్థ నిర్దేశించిందన్నారు. ప్రజాభిమానం కోల్పోయిన రాజు సగం చచ్చినట్లే అని ఆనాడే చెప్పారని, చివరికి ప్రజాకంటకుడైన రాజుని దింపేయడానికి, శిక్షించడానికి కూడా స్పష్టమైన నిబంధనలున్నాయన్నారు. రాజు తర్వాత వాడి కొడుకు రాజవుతున్నాడనే వ్యతిరేక భావనతోనే మనవాళ్ళు ప్రజాస్వామ్యం అంటూ ఈ పద్దతి తెచ్చారని.. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైనా భిన్నంగా ఉన్నదా? అనేది విజ్ఞులు యోచించాలన్నారు. ఇవాళ ఒకడి తర్వాత ఇంకొకడు వారసుడిగా వస్తున్నారని.. చివరికి వాడి ఇంట్లో కుక్కని కూడా భరించాల్సిన దుస్థితికి ప్రజలు నెట్టబడ్డారని ఆందోళన వ్యక్తం చేసారు. పాలకుల అవినీతి కిందిస్థాయి వరకూ ఎలా పాకిపోతుందో భాగవతంలో ఈ అధ్యాయం చెప్పిందన్నారు. పాలనా భోగం కాదని అది బాధ్యత అని త్యాగ భావనతో చేయాలని తెలిపిందన్నారు. పాలనలో ఆస్తికత ఒక ముఖ్యఅంగమని.. దానిని వదిలేసినా తర్వాతే మన పాలనావ్యవస్థకి దుర్దశ మొదలైందన్నారు. అమెరికన్ డాలర్ పై వుయ్ ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాసి ఉంటుందని సామవేదం గుర్తు చేసారు. తమ పదవుల కోసం పనికొచ్చిన యజ్ఞ యాగాలు ప్రజాక్షేమానికి పనికిరావని నేటి పాలకులు భావించడమే నేటి వినాశన స్థితికి కారణమన్నారు. అయితే వేణుడి మృతదేహాన్ని అతడి తల్లి సునీత తనకు తెలిసిన శాస్త్రీయ పద్ధతిలో పదిలపరచిందని భాగవతం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. ఇవాళ్టి వైజ్ఞానికాన్ని చూసి పాత యుగాలు అంధకాలం అనుకోరాదని.. అప్పటి విజ్ఞానం అప్పుడు ఉన్నదనే సత్యాన్ని ఈ విశేషం స్పష్టం చెబుతుందన్నారు. భాగవత, రామాయణ, భారత మహా గ్రంథాల్లో ఉన్న వైజ్ఞానిక, శాస్త్ర, వైద్య, విమాన, అస్త్ర, వాస్తు, నిర్మాణ విజ్ఞానాలను గుర్తించి.. మన దేశం యుగాల కిందటే గొప్ప వైజ్ఞానిక దేశం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఉపదేశించారు. ఈ గత వైభవాన్ని పునరుద్ధరించుకునే దిశగా నేటి తరం దృష్టి సారించాలని ఉపదేశించారు. మన ప్రాచీన విజ్ఞానం గురించి దివంగత అబ్దుల్ కలాం పలుమార్లు చెప్పిన సంగతి గుర్తు చేసారు. అనంతరం సద్గురువులు సామవేదం తిరిగి కథాక్రమం వివరిస్తూ... వేణుడికి వారసుడు లేనందున తదుపరి రాజు ఎంపికలో అప్పటి మంత్రులు గొప్ప వైజ్ఞానిక అద్భుతాన్ని సృజించారని తెలిపారు. తల్లి చేత భద్రపరచబడిన వేణుడి శరీరములో జన్యు పరంగా ఉన్న గొప్ప శక్తి విశేషాన్ని అతడిలోని విష్ణు అంశతో కూడిన తేజస్సును మధనం ద్వారా వారు బయటికి తీశారన్నారు. ఆ శక్తి విష్ణు తేజస్సుతో కూడిన ఒక స్త్రీ, పురుష రూపంలో వ్యక్తమైనది. ఆ తేజములు సంగమించి ఆవిర్భవించిన వాడే పృథు మహారాజని అంటూ ఈ మహారాజు చరిత్రను స్మరిస్తే భూదేవి ప్రసన్నురాలవుతుందని ఫలశ్రుతి తెలిపారు. ఈ పృథు చక్రవర్తి పట్టాభిషేకానికి బ్రహ్మాదులు కూడా వచ్చి ఆశీర్వదించారన్నారు. పృథువు గొప్ప ధార్మిక, ప్రజాస్వామ్య పాలనను ఆచరించాడని.. అయితే ఆనాడు భూమి ఓషధీ రహితమైపోయి పంటలు పండక కరవు తలెత్తిందన్నారు. అప్పుడు ధర్మప్రభువైన పృథివి భూదేవిని ఎందుకిలా చేసావని ప్రశ్నించాడు. అప్పుడు భూమి గోరూపంలో ప్రత్యక్షమైనదన్నారు. పృథువు ప్రశ్నకి భూమి సమాధానం చెబుతూ నీ తండ్రి కాలంలో ఎంత అధర్మం జరిగినా.. అతడి పూర్వుల పుణ్యం కారణంగా తననుంచి ఓషధులు వచ్చాయని.. అయితే వేణుడి కాలంలో జరిగిన దారుణ పాపాల ఫలితమే ఇప్పుడు ఓషధులను ఇవ్వలేకపోతున్నానని చెప్పిందన్నారు. భూమి తనలోని ఓషధులు అంతరించిపోవడానికి గల కారణాలను సవివరంగా చెప్పిందని... అవన్నీ నేటి తరానికి గొప్ప గుణపాఠాలని బ్రహ్మశ్రీ సామవేదం తెలిపారు. అనంతరం ఆ గోవు పృథువు ధార్మిక పాలనను ప్రశంసిస్తూ.. నీ ప్రజా క్షేమ పాలనకు మెచ్చాను.. నా నుంచి నీకు కావలసినన్ని ఓషధులను పిండుకోమని అనుగ్రహించిందన్నారు. అప్పుడు మనువును పాత్రగా చేసి (అంటే ధర్మాన్ని ప్రసాదించిన వాడు), చేతులని పాత్రగా చేసి ఓషధులను పాల రూపంగా పిండాడన్నారు. పాత్రగా చేతులు ఉంచడం వెనుక కృషి అనే అర్థాన్ని గుర్తించాలన్నారు. ధర్మంతో చేపి కృషి ద్వారా సంపాదించాలి.. అప్పుడుమాత్రమే భూమి కరుణిస్తుందని.. అదే ఇక్కడ నిజమైన అంతరార్థం అన్నారు. ఋషులు, దేవతలు కూడా పృథువు తర్వాత ఆ గోవును పిండుకున్నారని ఈ కథ చెప్పిందని.. అంటే దేవతలు, ఋషులకు కూడా భూమే ఆధారభూతమనేది ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం అన్నారు. ఈ కథలోని అంతరార్ధాలు.. మహా రహస్యాలను అవగతం చేసుకోవాలంటే తలా చిట్లేలా ఆలోచించాలని... అంత గొప్ప విజ్ఞానాన్ని మన ఋషులు రమ్యమైన కథల్లో ఇమిడ్చారని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా గోవు భూమికి ప్రతీక అని సామవేదం తెలిపారు. గోహింస జరిగితే భూమి బాధపడుతుందని, ఇది నేటి తరం గుర్తించాలని అన్నారు. అభివృద్ధి అంటే ఆర్ధిక పరంగా మాత్రమే చూడడం అరిష్టాలకు కారణమన్నారు. నిర్మల ప్రకృతి, ఆరోగ్యవంతమైన ప్రజలు, సుపరిపాలన మాత్రమే అభివృద్ధికి నిజమైన తార్కాణమని గుర్తించాలన్నారు. అన్నిటినీ మెటీరియలిస్టిక్ దృక్పథంతో చూడడం మానుకోవాలన్నారు. ఈ భాగవత ప్రవచన సందర్భాన్ని కేవలం సాంస్కృతిక.. ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే కాకుండా... ఇదొక గొప్ప వైజ్ఞానిక, ప్రజాపరిపాలన వ్యవస్థలకు సంబంధించిన ప్రాచీన విశేషాల పునరావిష్కరణ వేదికగా మీడియా గుర్తించాలని సామవేదం అభిలషించారు. పృథు చక్రవర్తి భూమిని విస్తరింపజేశాడని.... చక్కటి ప్రణాళిక పరంగా భూమిని విభజించి మహా నగర, నగర, పట్టణ, పుర, గ్రామ, పశువుల కొట్టాలు, నగరోద్యాన వనాలు, దుర్గాలు, కొండలపై నగరాలూ, అన్ని వృత్తులకూ అనువైన నివాస వ్యవస్థలు, వనాలు... ఇలా వాసయోగ్యంగా విభజించిన వాడు పృథు చక్రవర్తి అన్నారు. అతడి వలన భూమికి పృథ్వీ అనే పేరు ముందే ఉన్నప్పటికీ ఆపేరు సార్థకం అయిందన్నారు. పృథువు జన సంక్షేమం కోసం నూరు యజ్ఞాలు చేశాడన్నారు. అతడి వలన తన పదవికి ఏమి భంగం కలుగుతుందో అని భయపడిన ఇంద్రుడు ఒకానొక యజ్ఞంలో యాగాశ్వాన్ని అపహరించగా.. పృథువు కుమారుడు విజితాశ్వుడు వెళ్లి దానిని క్షేమంగా తీసుకు వచ్చాడన్నారు. నూరు యజ్ఞాలు పూర్తవగా నారాయణుడు పృథువుకి ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించగా.. నీ కథా శ్రవణానందం తో తరించడం కోసం పదివేల చెవులు ఇవ్వమని కోరాడన్నారు! శరీరంతో కర్మలు చేస్తూ హృదయంతో భగవంతుడిని ప్రేమించాలని, భగవత్ ప్రీతిగా కర్మాచరణ అన్నదే ఇందలి అంతరార్థం అన్నారు. భగవత్ భక్తుల కథలను.. అంటే భాగవతాన్ని పరమ ఇష్టంగా వినాలన్నారు.