త్రిపురలోనూ విజయం సాధిస్తాం.. అమిత్ షా


విజయ పరంపర కొనసాగుతుందని.. త్రిపురలోనూ భాజపా జెండా ఎగురవేస్తామని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ నియోజకవర్గాల్లో ప్రజల స్పందన చూస్తుంటే భాజపా పాలిత 20వ రాష్ట్రంగా త్రిపుర నిలువబోతున్నాడనే విశ్వాసం కలుగుతోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చరిష్మాతో అంతకుముందు తమ పార్టీ ఎమ్మెల్యేలే లేని ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్‌, అసోంలలో అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఇప్పుడు అదే తరహా విజయం త్రిపురలోనూ లభిస్తుందన్నారు. 25ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్షపార్టీ ఏ సమస్యనూ తీర్చలేదని విమర్శించారు. తక్కువ సమయంలోనే భాజపా పాలిత ప్రాంతాలు అభివృద్ధిపథంలో పరుగులిడుతుంటే.. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీఎం వల్ల రాష్ట్రం వెనుకబాటు తనానికి గురైందని దుయ్యబట్టారు. అత్యాచారాలు, హత్యలతో దేశంలోనే అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల్లో త్రిపుర ఒకటిగా మారడం ఒక్కటే సీపీఎం పాలనలో ఒనగూడిన విజయమని వ్యంగ్యంగా విమర్శించారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. వామపక్ష వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతోందని, వారి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. భాజపా అధికారంలోకి వస్తే, తాము విడుదల చేసిన మేనిఫేస్టో ప్రకారం రాష్ట్రాంలో సెజ్‌ల ఏర్పాటు, యువతకు సెల్ ఫోన్ల పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు. 60మంది సభ్యులు గల త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న ఎన్నికలు జరగనుండగా భాజపా మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసి 51 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ముఖ్యాంశాలు