సరిహద్దుల్లో చైనా ఆగడాలు


భారత్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నది. ఇటీవలే సిక్కింలోని నకు లా పాస్ వద్ద భారత బలగాలతో తలపడిన చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో లడఖ్ గగనతలంపై చైనా సైనిక హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెనువెంటనే యుద్ధవిమానాలను పెట్రోలింగ్‌కు పంపంది. ఘటన గత వారం జరిగినట్లు తెలుస్తోంది. ఎల్‌ఏసీ వద్ద చైనా సైనిక హెలికాఫ్టర్లు ఎగురుతుండగా భారత్ సత్వరమే స్పందించడం, వెంటనే యుద్ధ విమానాలను పెట్రోలింగ్‌కు పంపడడం ఇదే తొలిసారని రక్షణ నిపుణులు చెబుతున్నారు. సుఖోయ్ 30 ఎమ్‌కేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చైనా ఆర్మీకి గట్టిగా జవాబిచ్చింది. వారం క్రితం సిక్కిం నకు లా పాస్ వద్ద చైనా బలగాలు భారత బలగాలకు కలబడ్డాయి. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయినట్లు సమాచారం. ఇంతలోనే ఎల్‌ఏసీ వద్ద చైనా హెలికాఫ్టర్లు ఎగరడాన్ని రక్షణరంగ నిపుణులు తేలిగ్గా కొట్టిపారేయడం లేదు. భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హంద్వారా ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్థాన్ యుద్ధవిమానాలు ఇటీవలే సరిహద్దుల వద్ద చక్కర్లు కొట్టాయి. ఈ తరుణంలో చైనా బలగాల దుందుడుకు చర్యలను కూడా ఇండియన్ ఆర్మీ నిశితంగా గమనిస్తోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం