ఇండియాలో లాక్ డౌన్ సఫలమా.. విఫలమా?

 మార్చి 24 లాక్ డౌన్ మొదలయ్యే నాటికి భారతదేశంలో కరోనా కేసులు 560 +
ఇవాళ కేసులు 70 వేలు దాటాయి.. వచ్చే ఇరవై రోజుల్లో రెండు లక్షలు కావచ్చని అంచనాలు ఉన్నాయి! లాక్ డౌన్ పెట్టినది కరెక్టు టైం లో.. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ ని సమర్థించారు.. అయితే లాక్ డౌన్ అమలు సక్రమంగా జరగలేదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ కి సిద్ధపడి  దాని లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తలకెత్తుకున్నా కూడా కరోనా అదుపు కాలేదని వాపోతున్నారు. ఈ వైఫల్యానికి   ప్రజలతో పాటు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బాధ్యత వహించాల్సిందే!
మొదట తబ్లీగి జమాత్ గొడవ... వీసాల్లేని విదేశీయుల హల్ చల్  తర్వాత పరాయి రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల గొడవ...ఆ తర్వాత వలస కార్మికుల ఆందోళనలు.. ఇక ప్రతిరోజూ నిబంధనలు  తోసిరాజని వీధులమ్మట తిరిగే జనాలు.. వెరసి ఇండియాలో లాక్ డౌన్ ని వ్యర్థ ప్రయాసగా, విఫల ప్రయోగంగా మిగిల్చి పారేశాయి.
ఇప్పుడు ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకోవచ్చు..
మరో అమెరికా, ఇటలీ కాకపోవడానికి లాక్ డౌన్ పెట్టడమే కారణమని కొందరు.. లాక్ డౌన్ విఫలం కావడమే ఇండియాలో  పరిస్థితి ఇంత తీవ్రం కావడానికి కారణమని ఇంకొందరూ ..
ఎవరి విచక్షణ వారిది! అయితే ఒక విషయం గమనార్హం. 30 వేలనుంచి కేసులు 60 వేలు కావడానికి భారత దేశంలో పట్టిన సమయం 11 రోజులు
ఇదే స్పీడు కొనసాగితే 22 రోజుల తర్వాత 2 లక్షల పైన కేసులు ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఒక సారి పూర్వాపరాలు పరిశీలిస్తే జనవరి31 2020 నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ  కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా (గ్లోబల్ ఎమర్జెన్సీ) ప్రకటించింది.కానీ మన కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి లో ఎన్నో పబ్లిక్ మీటింగులు,క్రీడా సంబరాలు జరిగాయి. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ మోతె రా స్టేడియం లో లక్షల మంది మోడీ, ట్రంప్ మీటింగ్ కు గుమిగూడారు. అప్పుడుకూడా ఏమి జాగ్రత్త పడలేదు. ఫిబ్రవరి  30న ఇండియాలో మొదటి కరోనా మరణం కర్ణాటక లో సంభవించింది. అయినా నిర్లక్ష్యంగా, బాధ్య తా రాహిత్యంతో ఢిల్లీ లో జమాత్ కు మార్చిలో అనుమతి ఇచ్చారు. తర్వాత కూడా ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోకుండా (10 రోజులు వ్యవధి ఉండికూడా) లాక్ డౌన్ ప్రకటించారు. దాని ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. ఇపుడు కేంద్రం, రాష్ట్రాలు తప్పు మీది అంటే మీది అని తప్పించుకుంటున్నాయి. గంటలు కొట్టించడం, దీపాలు వెలిగించడం.. పూలు జల్లించడం మంచిదే అయినా మిగతా పనుల్ని కూడా పట్టించుకోవాలిగా. అయినా  సరే  ఇవాళ మిగతా ప్రపంచంతో పోలిస్తే భారత్  కాస్త మెరుగైన స్థానంలో ఉందంటే కారణం కేవలం భారతీయుల  జీవనశైలి, సాత్వికమైన ఆహారపు ఆలవాట్లు మాత్రమేనని అభిప్రాయం కూడా వినిపిస్తోంది.