కోడి కత్తి ఎవరి మెడలో దిగింది?


ఒకడు కోడి కత్తితో ప్రతిపక్ష నేత జగన్ ను చంపాలనుకున్నాడు. అయితే అది ఉపయోగిస్తున్నప్పుడు జగన్ చాకచక్యంగా తప్పుకోవడంతో అది చేతిమీద దిగింది. ఇదే ఆ ప్లాన్ వర్కవుట్ అయి మెడలో దిగితే ప్రాణాపాయ పరిస్థితి వచ్చేది. ఇది ముమ్మాటికీ హత్య ప్రయత్నమే. దీని వెనుక తెదేపా హస్తం ఉంది. - ఇది వైకాపా కథనం. ఏమాత్రం ప్రాణాపాయం లేని రీతిలో చేతిమీద కోడి కత్తితో తన అభిమాని ద్వారా దాడి చేయించుకొన్న జగన్ మోహన్ రెడ్డి సానుభూతి కోసం డ్రామా ఆడారు. హైదరాబాద్ వెళ్ళి ఆసుపత్రిలో చేరడం ద్వారా దర్యాప్తుకి సహాయ నిరాకరణ ప్రదర్శించారు. పైగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదని చెప్పడం ద్వారా వారి నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీశారు. - ఇది తెదేపా ఆరోపణ. కత్తి చేతిలో దిగిన మాట వాస్తవం. అది మెడలో దిగితే ప్రాణాపాయం ఉందన్నది వాస్తవమే. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో ఆ కత్తి వేటు తప్పినా.. తదుపరి రాజకీయ ప్రహసన ప్రక్రియలో ఆ కోడి కత్తి ఏదో ఒక పక్షాన్ని దెబ్బ తీసే తీరుతుంది. ఇంతకీ ఆ కోడికత్తి జగన్ మెడలో దిగిందా, బాబు మెడలో దిగబడిందా! ఈ విషయం తెలియాలంటే ఈ విశ్లేషణ, విశేషాలను ఒకసారి పరిశీలించాలి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి వ్యవహారంలో ఇంకా మిస్టరీ అలాగే ఉంది. విచిత్రంగా ఘటన జరిగిన గంటలోపే ఆ నిందితుడు జగన్ అభిమాని అని, ఇది ఉత్తుత్తి డ్రామా అని, చిటికెలో తేల్చేస్తామని... ఇలా అనేకానేక వ్యర్థ వ్యాఖ్యానాలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై రోజులు కావస్తున్నా ఇవాళ్టికీ కేసుని కొలిక్కి తేలేకపోయింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25 న జగన్ తో సెల్ఫీ కోసం వచ్చిన శ్రీనివాసరావు అనే యువకుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి వ్యవహారం దాదాపు గంట సేపు గోప్యంగానే ఉండిపోయింది. ఎందుచేతనో జగన్ గానీ, పార్టీ శ్రేణులు గానీ కత్తి దాడి విషయాన్ని మొదట్లో ఇష్యూ చేయదలచుకోనట్టు కనిపించింది. అయితే గంట తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నాయకులు రంగప్రవేశం చేసి ఒకరిని మించి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు, విపరీత వ్యాఖ్యానాలు ప్రారంభించారు. ఈ దాడిని జగన్ తనకు తానే చేయించుకున్నారనే అర్థం వచ్చేలా వారు మాట్లాడారు. జగన్ పై కత్తి దాడి చేసిన వ్యక్తి తో కొన్ని తెదేపా అనుకూల మీడియా సంస్థలు అప్పటికప్పుడు వైకాపా ఫ్లేక్సీలను కూడా సృష్టించి ప్రచారంలో పెట్టేశాయి. అంతటితో ఆగకుండా దాడి జరిగిన స్థలం ఎయిర్ పోర్టు కాబట్టి అది తమ పరిధిలోది కాదని చెప్పడం మరీ విచిత్రంగా తోచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, ఇదే విశాఖ ఎయిర్ పోర్టులో గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని నిర్బంధించి ఉంచిన విషయాన్ని ముఖ్యమంత్రి ఇంత త్వరగా ఎలా మర్చిపోయారో! బహుశా ఆయనకు మరచిపోయే సౌలభ్యాన్ని భగవంతుడు ప్రసాదించి ఉంటాడు. కత్తి దాడి జరిగిన తర్వాత జగన్ అక్కడ ఏ విధమైన షో చేయకుండా, ప్రాథమిక చికిత్స చేయించుకొని నేరుగా విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఆసుపత్రిలో చేరారు. జగన్ ఇలా ఎందుకు చేశారనేదానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. విశాఖలో ఆసుపత్రిలో చేరితే తన ప్రాణానికి భరోసా ఉండదని అయన భయపడ్డారా.. లేక అక్కడ పోలీసుల పై నమ్మకం లేక తెలంగాణ వెళ్లిపోయారా? అదీ గాక తన పరిస్థితి ఏమిటనేది రాష్ట్రప్రభుత్వం గోప్యంగా ఉంచేస్తే.. ఆ ఆందోళనతో పార్టీ శ్రేణులు దాడులకు దిగడం.. తద్వారా పార్టీకి చెడ్డపేరు వస్తుందని అనుకున్నారా? ఇలా ఎదో కారణం ఉంది ఉండొచ్చు. ఆయన తన చర్య ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడారని అనుకోవాలి. మరి అలాంటి బాధ్యతాయుత ప్రవర్తన కనబరిచిన కొన్ని గంటలకే .. అదే మనిషి బాధ్యతారహితంగా ఎపి పోలీసులపై నమ్మకం లేదని ఎలా ప్రకటిస్తారు? ఇదేమైనా స్ప్లిట్ పెర్సనాలిటీనా? లేక రాజకీయంగా ఇలా మాట్లాడితే మైలేజ్ వస్తుందని ఈలోగా ఎవరైనా సలహా ఇచ్చారా? జగన్ మాటలు ఇలా ఉంటే ఈ వ్యవహారంలో మీడియా పాత్ర అత్యంత వివాదాస్పదంగా ఉంది. కొందరు అటు, కొందరు ఇటు అన్నట్టుగా చీలిపోయి అనేకానేక కథనాలు వండి వార్చేసారు. వీళ్ళ పరిశోధనలు, వీళ్ళ గెస్సింగులు... కథనాలు, ఆరోపణలు ఒకదానికొకటి పొంతన లేకుండా రైలు పట్టాల్లా సమాంతరంగా సాగిపోయాయి. అసలు విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటన జరిగిన తోలి గంటలోనే అధికార పక్ష వైఖరి వింతగా కనిపించింది. దర్యాఫ్తుకంటే ముందు జడ్జిమెంట్ ఇవ్వాలన్న తాపత్రయం గోచరించింది. ఇది చాలా చిన్న సంఘటన, చేసింది వాళ్ళ మనిషే.. అంటూ జగన్ పై సానుభూతికి అడ్డుపడుతూనే .. ఈ ఘటనపై కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమని మరోవైపు హంగామా చేసింది. ఒక దెబ్బకి రెండు పిట్టలు అనే సూత్రాన్ని అమలు చేసి ఒక వైపు జగన్ ని, మరోవైపు మోడీ సర్కారుని కూడా ఇరుకున పెట్టె వ్యూహంగా అనిపించింది. ఇంకోపక్కనుంచి గరుడ, బిరడా అంటూ మరో హంగామాతో అంతా గందరగోళంగా అనిపించింది. ఎవరి మీద, ఎప్పుడు ఎలా దాడులు చేస్తారో.. ఎవరి వ్యూహాలు ఏమిటో చెప్పేయాలంటే జ్యోతిష్కుడైనా అయి ఉండాలి.. వాటిని అమలు చేసేవాడైన అయిఉండాలి తప్ప ఇతరులకి సాధ్యం కాదనేది తెలిసిందే. ఆపరేషన్ గరుడ ప్లాన్ వెల్లడించిన నటుడు శివాజీ ఎందుకు ఇప్పుడే పరారయ్యాడు? అతడి ప్లాన్ ని తెదేపా వర్గాలు పదేపదే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి? రాష్ట్ర ప్రతిపక్ష నేతపై కత్తి దాడి జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? ముఖ్యమంత్రి లేదా హోమ్ మంత్రి వెళ్లి పరామర్శించనక్కరలేదా? కనీసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరినైనా పరామర్శకు పంపారా? ఇవేవీ చేయకుండా దాడి సొంతంగా చేయించుకున్నాడని చెప్పడం ఏమిటి మానవత్వ స్పృహ లేకుండా? శత్రువుపై దాడి జరిగినా అయ్యో పాపం అనడం, వీలైతే పరామర్శించడం చేస్తాం. అలాంటిది రెచ్చగొట్టే వ్యాఖ్యలేమిటి? ఎంత మానవత్వం లేని నాయకుడైనా సరే... ఎవరిమీదనైనా దాడి జరిగీతే అది అతడి అమ్మ, చెల్లి చేయించారని ఆరోపిస్తాడా? ఇలా ఆరోపించడం ద్వారా ఆ తల్లి చేత బహిరంగ ప్రకటన చేయించే పరిస్థితి తీసుకొచ్చిన వాడు అధికార పక్షానికి మేలు చేసినట్టా.. కీడు చేసినట్టా? ఇరవై రోజులు కావస్తున్నా కేసు ఎందుకు తేలలేదు? అసలు తేల్చే ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? జగన్ తనపై తానే కత్తి దాడి చేయించుకున్నాడని ఒకటికి రెండు సార్లు మాట్లాడిన వ్యక్తులు ప్రభుత్వంలో అనేకమంది ఉన్నారు. ఇది రుజువు చేయగలరా? గంటలోనే ఈ ప్రకటన చేయగలిగిన పొలిసు బాసులకి దీనిని రుజువు చేయడానికి ఎన్ని రోజులు కావాలి? రుజువు చేయకుండా డ్రామా చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటే మాత్రం అది తెలుగుదేశం ప్రభుత్వానికే దెబ్బ. జగన్ గనుక ఆ రోజు విశాఖలోనే ఆసుపత్రిలో చేరి.. ఆ మర్నాడు పాదయత్రకి అదే కట్టుతో వెళ్లి ఉంటే.. నిజంగానే భారీ సింపతీ వచ్చి ఉండేదేమో. అయితే జగన్ అనాలోచితంగా రాష్ట్ర పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇది నిస్సందేహంగా అయన రాజకీయ అవగాహన లోపానికి నిదర్శనం. పోలీసులు అధికారంలో ఎవరంటే వారికి అణిగి మణిగి ఉంటారు. రేపు తనుయ్ అధికారంలోకి రావాలని ఆశిస్తున్న జగన్ ఆ పోలీసుల్ని నమ్మనని అనడం మూర్ఖత్వం. పైగా ఆ పొలిసు రక్షణతోనే ఆయన వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి మరిచాడా? ఇదే నేపథ్యంలో మరిన్ని అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. కస్టడీలో ఉన్న శ్రీనివాసరావు (నిందితుడు) పరిస్థితి ఎలా ఉంది. అతడి ప్రాణాలకు భరోసా ఉందా? ఈ కేసులో వందలాదిమందిని విచారణ పేరోతో పోలీసులు వేధిస్తున్నారని అంటున్నారు నిజమేనా? శ్రీనివాసరావు పని చేసిన హోటల్ (ఎయిర్ పోర్టు లోది) యజమానికి తెలుగుదేశానికి సాన్నిహిత్యం ఉందా? అతడి నియామకంలో పార్టీ ప్రమేయం ఏదైనా ఉందా? కోడి కత్తి క్యాంటీన్ లోకి ఎలా, ఎవరి ద్వారా వచ్చింది? అసలు తనపై హత్యాయత్నం జరిగినా జగన్ ఎందుకు దాన్ని కామ్ గా ఉంచాలని భావించారు? ఎందుకు నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు? అంతా పెద్ద లీడర్ పై హత్య ప్రయత్నం అంత సింపుల్ గా ఉంటుందా? అక్కడ అంత జరిగితే ఆ వెంటనే ముఖ్యమంత్రి స్పందన అంత దారుణంగా ఉంటుందా?

ముఖ్యాంశాలు