విహంగాల రక్షణ పథంలో విలువైన మైలురాయి పక్షుల పండగ - 2018


ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, తూర్పు గోదావరి నదీ ముఖద్వార జీవ వైవిధ్య పరిరక్షణ సంస్థ (ఇగ్రీ) సంయుక్తంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) సౌజన్యంతో కోరింగ బర్డ్ ఫెస్టివల్ ( పక్షి ఉత్సవం) - 2018 నిర్వహిస్తున్నారు. ఈనెల 14 ,15 తేదీల్లో నిర్వహించే ఈ బర్డ్ ఫెస్టివల్ కు సాధారణ ప్రజలను, పర్యాటకులను, పాఠశాల, కళాశాల విద్యార్థుల ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కోరింగ మడ అడవుల్లో ఇటువంటి ఉత్సవాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. కోరింగ అభయారణ్యంతో కూడిన ఇగ్రీ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పక్షి స్థావరం. సెంట్రల్ ఆసియన్ ఫ్లై వే (మధ్య ఆసియా పక్షి ప్రయాణ మార్గం) లోని ఈ ప్రాంతం 271 పక్షి జాతులకు నిలయం. వీటిలో 95 రకాల పక్షులు వలస జాతులు కావడం విశేషం. భౌగోళికంగా, జీవవైవిధ్య పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన 17 నీటి పక్షి జాతుల్లో ఒక్క శాతానికి ఈ ప్రాంతం ఆవాసంగా, ఆధారంగా ఉండి పోషిస్తోంది. ఈ ఇగ్రీ (కోరింగ అభయారణ్యం) ప్రాంతం సుసంపన్నమైన పక్షి జీవ వైవిధ్యానికి ఆటపట్టు. దేశం మొత్తం మీద 84 వలస పక్షి జాతుల్ని గుర్తిస్తే వాటిలో 57 రకాల పక్షులు ఇగ్రీ ప్రాంతంలో కనిపించాయి. ఇగ్రెట్స్, storks అని వ్యవ హరించే తెల్ల కొంగలు, ఇతర రకాల కొంగలు ఇక్కడ కనిపించే మొత్తం పక్షి జనాభాలో దాదాపు 20 శాతం ఉంటాయి. ఈ చిత్తడి ప్రాంతం ఆవాస యోగ్యంగా ఉందని, ఇక్కడ పక్షి జాతులకు తగిన ఆహారం లభిస్తోందని చెప్పడానికి ఇక్కడ విస్తారంగా కనిపిస్తున్న వలస పక్షుల సంఖ్య ఒక ప్రాతిపదిక. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న అనేక పక్షి జాతులకు కూడా ఈ ఇగ్రీ ప్రాంతం ఆతిథ్యం ఇచ్చి రక్షిస్తోంది. రష్యా, చైనా దేశాలనుంచి ఏటా గుడ్లు పెట్టే సీజన్లో ఇక్కడికి వచ్చే గ్రేట్ నాట్ పక్షులు వీటిలోకి ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో కనిపించిన మరో అరుదైన పక్షిజాతి ఇండియన్ స్కిమ్మర్. ఈ బర్డ్ ఫెస్టివల్ కు మస్కట్ గా ఇండియన్ స్కిమ్మర్ ని గుర్తించినట్టు నిర్వాహకులు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో విస్తారంగా ఒకప్పుడు కనపించిన ఈ పక్షి ఇపుడు అంతరించిపోయే దశకు చేరుకుంటోంది. పక్షి ఉత్సవం పేరుతో నిర్వహించే ఈ ఉత్సాహభరిత కార్యక్రమం ద్వారా ప్రజల్లో జీవవైవిధ్య, పక్షి జాతుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై సదవగాహన కల్పించాలని అటవీశాఖ, ఇగ్రీ, భావిస్తున్నాయి. పక్షుల జీవన విధానాలు, వాటి ఆవాసాలను గురించి అవగాహన కల్పించ డం ద్వారా, అవి ఎదుర్కొంటున్న ముప్పును తెలియజేయడం ద్వారా ప్రమాదంలో ఉన్న పక్షి జాతులను కాపాడే కృషిలో ప్రజలను భాగస్వాములను చేయాలని భావిస్తున్నాయి.

ముఖ్యాంశాలు