అన్ క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లలో రూ. 8 వేల కోట్లు


బ్యాంకు ల్లో డబ్బు వేస్తారు.. కానీ తీసుకోవడానికి ఎవరూ రారు. ఇలాంటి ఖాతాలను అన్క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్లు అంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి రెండున్నర కోట్లకు పైగా ఖాతాల్లో ఏకంగా రూ.8వేల కోట్ల నగదు ఉందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఆ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వ్యక్తులు లేదా వారసులకు సంబంధించిన వివరాలేవీ అధికారుల దగ్గర లేవు. దీనికి సంబంధించిన తాజా నివేదికను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసింది. మొత్తం 2.63కోట్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలేమీ బ్యాంకు అధికారుల దగ్గర లేవు. 2012 నుంచి 2016 వరకు ఈ అప్రకటిత బ్యాంకు డిపాజిట్లలోని నగదు రెట్టింపయ్యింది. బ్యాంకుల్లో ఏళ్ల తరబడి డిపాజిట్లు చేసి.. వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా.. ఆ డిపాజిట్‌దారులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడం ఈ ఖాతాల కిందికి వచ్చిందని ఒక బ్యాంకర్ తెలిపారు. అప్రకటిత బ్యాంకు ఖాతాల సంఖ్య కూడా 2012లో 1.32కోట్లు ఉండగా.. 2016 నాటికి అది రెట్టింపై 2.63కోట్లగా చేరింది. అదే సమయంలో వారి డిపాజిట్లు కూడా రూ.3,598కోట్ల నుంచి రూ.8,864.6కోట్లకు చేరాయి. అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్‌దారుల వివరాలను బ్యాంకు అధికారులు తమ తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది. ఈ జాబితాలో తప్పకుండా ఆ డిపాజిట్‌ చేసిన ఖాతాదారుని పూర్తి పేరు, వివరాలు పొందుపరచాల్సిందిగా ఆర్‌బీఐ సలహా ఇచ్చింది. అలా చేయడం వల్ల వారి వారసులు వివరాలను తెలుసుకోవడం సులువని ఆర్‌బీఐ పేర్కొంది. అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్లు అత్యధికంగా ఉన్న బ్యాంకు జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. దాదాపు 47 లక్షల ఇన్‌యాక్టివ్‌ ఖాతాల్లో మొత్తం రూ.1,036కోట్ల నగదు ఉంది. కెనరా బ్యాంకు తర్వాతి స్థానంలో ఉంది.

ముఖ్యాంశాలు