శివ కేశవ భేద భావం.. ముక్తికి అవరోధం


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో పదకొండవ రోజు ప్రసంగం) శివకేశవుల మధ్య భేద భావన మనసులో లేశమాత్రం ఉన్నా సరే జీవుడు ముక్తి పొందలేడని, శివుడు, విష్ణువు ఒక్కరే అన్న జ్ఞానాన్ని త్రికరణశుద్ధిగా పొందినవాడికే మోక్షం లభిస్తుందని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మఅన్నారు. రాజమహేంద్రవరం లోని విరించి వానప్రస్థాశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీమద్భాగవతం ప్రవచన మహాయజ్ఞంలో పదకొండవరోజైన సోమవారం రాత్రి అయన మాట్లాడుతూ శివాయ విష్ణు రూపాయ, శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అనే వేదప్రతిపాదిత వాక్యాలు ప్రత్యక్షర సత్యాలన్నారు. ఎంతటి మహావిష్ణు భక్తులైనా సరే శివుడి యందు కించిత్ భేదభావం చూపినా, ఆ అజ్ఞానం తొలగించుకునేందుకు మరో జన్మ ఎత్తవలసిందే అన్నారు. విష్ణువు పరమ భక్తుడిని... అయితే శివుడ్ని నిందించలేదు కాబట్టి తప్పు లేదు అనుకోవడానికి సైతం అవకాశం లేదని.. చిన్నచూపు కూడా క్షంతవ్యం కాదని తేల్చి చెప్పారు. ఆ విష్ణువు, ఈ శివుడూ ఒక్కడే అని తెలుసుకునేవరకూ ఎవరి భక్తులైనా సరే ముక్తికి ఆస్కారమే లేదని స్పష్టం చేసారు. శివకేశవ అభేద భావనే ముక్తి సోపానమని, అది కలగనంతవరకూ మోక్షం దుర్లభమేనని సూత్రీకరించారు. స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ మానసపుత్రునిగా జన్మించిన దక్ష ప్రజాపతి ఆ తర్వాత చాక్షుష మన్వంతరంలో మారిష, ప్రచేతసులకు పుత్రునిగా జన్మించి జఠర వేదన అనుభవించిన ఉదంతం శివనింద వలన కలిగిన ఫలితానికి ప్రత్యక్ష తార్కాణమన్నారు. తొలి మన్వంతరంలో బ్రహ్మ మనసునుంచి పుట్టిన దక్షుడు ఆనాడు అహంకారంతో విర్రవీగి.. శివుని పరమేశ్వర తత్వాన్ని గ్రహించలేకపోయాడని.. సామాన్య దేవతగా పొరబడి అవమానించి, నిందించాడని చెప్పారు. దుష్టుల అవమానం మహాత్ములను ఏమాత్రం బాధించదని.. అయితే తత్దోషం దుష్టులను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అనే వేదవాక్కుని కొందరు సంధ్యావందనంలో ప్రక్షిప్త వాక్యంగా పేర్కొంటూ ఉండడం బాధాకరమన్నారు. ఇష్టం లేని విషయాలన్నీ ప్రక్షిప్తమని చెప్పడానికి మనకేమి అర్హత ఉందని ప్రశ్నిస్తూ... పై వాక్యం యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తు చెప్పినదనే నిజాన్ని ప్రతిపాదించారు. దక్షుడంతటివాడే శివ నింద కారణంగా ఉన్న స్థితి నుంచి పతనమైతే అల్పులమైన మనమెంత అనే విషయాన్ని గ్రహించి బుద్ధిని సంస్కరించుకోవాలని.. శివకేశవుల అభేద భావనను సదా చిత్తంలో నిలుపుకోవాలని ఉపదేశించారు. కర్మ ప్రారంభానికి బ్రహ్మ అధిపతి అయితే, కొనసాగింపు విష్ణువు అధీనంలోనిదని.. కర్మ ఫల ప్రదాత మాత్రం ఈశ్వరుడని చెబుతూ సృష్టి స్థితి లయాలను అన్వయించారు. ఫలప్రదాత అయిన శివుడ్ని అవమానించినందునే దక్షుని యజ్ఞానికి ప్రతికూల ఫలితం వచ్చి అతడి తల తెగి పడిందన్నారు. భాగవతంలోని ఉత్తమ క్షత్రియ వంశాల రాజుల గుణగణాలను పరిశీలిస్తే అద్భుతమైన ధార్మికత, తాత్వికత, జీవన్ముక్త లక్షణాలు వారిలో కనిపిస్తాయని తెలిపారు. కొందరు ప్రవృత్తి, మరి కొందరు నివృత్తి మార్గాలను న్ని ఆశ్రయించగా.. ఇంకొందరు నివృత్తి మార్గంలో ఉన్నప్పటికీ భగవత్ ప్రీతిగా ధర్మమార్గాన కర్మలు నిర్వహించారని వెల్లడించారు. అట్టి పరంపర ను, వారి చారిత్రములను సద్గురువులు సామవేదం సజ్జన మనోరంజకరీతిలో ప్రస్తావించారు. అఖండ భూమండలాన్నీ పాలించిన ఆ మహనీయుల కథలన్నీ కట్టెదుట సాక్షాత్కరించు తెఱగున ఆయన వివరించారిలా.. స్వాయంభువ మనువు రెండో పుత్రుడు ప్రియవ్రతుడు (ఉత్తానపాదుని తమ్ముడు) పుట్టుకచేతనే విరాగి. ఆ భావంతో తపోదీక్షకు తరలిన ప్రియవ్రతునికి బ్రహ్మ ప్రత్యక్షమై.. రాజ్యపాలన చేపట్టి పరమేశ్వరార్పిత బుద్ధితో కర్మ ఆచరించమని ఉపదేశిస్తాడు. తాను విష్ణువుపై భారం మోపి సృష్టి రచన చేసినట్టే నిమిత్తమాత్రునిగా రాజ్యం చేపట్టమని ఆదేశించాడు. అలాగే చేసిన ప్రియవ్రతుడు విశ్వకర్మ కుమార్తె బర్హిష్మతిని పెళ్లాడి తన రాజ్యాన్ని పాలించసాగాడు. యితడు మహా యజ్ఞశీలి. సూర్య భక్తుడైన ప్రియవ్రతుడు ఆ సూర్యుని వద్ద ఉన్నటువంటి రథాన్నే తన గొప్ప తపోశక్తి వినియోగం చేత తయారు చేయించిన ధీశాలి. భూమిని జంబూ ద్వీపాధి సప్త ద్వీపాలుగా విభజన చేసినది కూడా ఈ తపస్సంపన్నుడే. పదిమంది పుత్రులను కన్నాడు. యజ్ఞాగ్ని రూపాల పేర్లే వారివి. వారిలోని అగ్నిధ్రుడు ప్రథముడు.. గొప్ప చక్రవర్తి. ప్రియవ్రతుడు మరో భార్య యందు కన్న ముగ్గురు పుత్రుల పేర్లు ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీరు ముగ్గురూ మనువులు కావడం ఇక్కడ విశేషం. మనువు అనేది చక్రవర్తి కంటే ఉత్తమ పీఠం.. పైగా అది దైవదత్తం, శాశ్వతం. ఈ ప్రియవ్రతుని పుత్రిక ఊర్జస్వతి. ఈమెను శుక్రాచార్యునికిచ్చి పెళ్లి చేసాడు. ప్రథమ పుత్రుడు అగ్నీధ్రుడిని జంబూ ద్వీపానికి రాజును చేసాడు. మిగిలిన పుత్రులకు మిగతా భూమిని అప్పగించాడు. ఇలా పుత్రులందరికీ బాధ్యతలప్పజెప్పి వానప్రస్థానికి పోయాడు. ఎంతటి గొప్ప చక్రవర్తులైనా సరే భోగ త్యాగమే పరమావధిగా.. పరమేశ్వర దర్శనమే లక్ష్యంగా మన పూర్వపు రాజులు జీవించారు. ఇక అగ్నీధ్రుని కథ. ఈయన భార్య పూర్వ చిత్తి అనే అప్సరకాంత. ధర్మబద్ధ భోగలాలసుడు ఈ రాజు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలి అనేవారు ఇతడి పుత్రులు. వీరి పేర్లతో వర్షములు (దేశాలు) గా జంబూ ద్వీపాన్ని విభజించాడు అగ్నీధ్రుడు. పిల్లలకు దేశాలు అప్పజెప్పి ఉత్తరగతులుగా అప్సరలోకాలకు చేరి భోగాలు అనుభవిస్తున్నాడు. తర్వాతి రాజు నాభి. ఈ రాజు నాభి వర్షాన్ని పాలించినవాడు. ఇతడి భార్య మేరు దేవి. నాటి ఋత్విజులు గొప్ప యజ్ఞం చేసి నారాయణుని ప్రత్యక్షం చేసుకున్నారు. నీ అంతటి వాడిని మా రాజుకి పుత్రునిగా ఇమ్మని అడిగారు పురోహితులు. నా అంతటివాడు నేనే గానీ మరొకడు ఉండడని చెప్పిన విష్ణువు తానే అవతరిస్తానని వరమిచ్చాడు. ఆ మాటమేరకు ఋషభదేవునిగా వచ్చాడు. మహా యోగి అయిన ఋషభుడు అనేక యజ్ఞ యాగాదులతో నాభి వర్షాన్ని కర్మభూమిగా మార్చాడు. ఇంద్రుని కుమార్తె జయంతి ఇతడి భార్య. వీరికి వందకు పైగా సంతానం వీరిది. ఆ బిడ్డల్లో అనేకమంది పుట్టుకతోనే నివృత్తి మార్గాన తపస్సుకి వెళ్లిపోయారు. ఇక ముఖ్యులైన తొమ్మిది మంది ఋషభ పుత్రుల పేర్లు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, కలభాజనుడు ఈ తొమ్మిది మందీ జ్ఞానులు. వారు ఆవిష్కరించినదే భాగవత మార్గం. ఇంకా కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పుక్కు, విదర్భుడు, కీటకుడు అనేవారు ఋషభుని రాజ్యంలో పలు భాగాలను పాలించారు. అందరికంటే పెద్దవాడైన భరతుడికి ప్రధాన భూభాగమైన నాభి వర్షాన్నిఅప్పగించాడు ఋషభుడు. అనంతరం పిల్లలందరిని సమావేశపరచి ఋషభుడు భోగాలకు ధర్మాన్ని హద్దుగా నిర్దేశించుకోవడమే క్షత్రియ ధర్మమని ఉపదేశించాడు. ధర్మమంటే జ్ఞానమే. బ్రహ్మనిష్ఠతో కర్మలను ఆచరించమన్నాడు. భరతునికి అభిషేకించిన నాభి వర్షమే తర్వాతి కాలంలో భరతవర్షమని ప్రసిద్ధమైంది. ఈ భరతుడి చరిత్ర మహాదివ్యం. అతడు వాసుదేవుని సంభావిస్తూ ఆయనకే యజ్ఞఫలాన్ని అర్పిస్తూ యజ్ఞాచరణ చేసాడు. అంటే యజ్ఞ దేవతలన్నిటినీ యజ్ఞ పురుషుడైన నారాయణుడి శరీర అంగాలుగా, ఇంద్రియాలుగా భావిస్తూ ఆయననే ఊహించుకుంటూ యజ్ఞాలు చేసాడు. ఇలా కర్మిష్ఠిగా కాక కర్మయోగిగా యజ్ఞాచరణ చేసిన ఫలితంగా భరతుని మనో మాలిన్యాలన్నీ అనతికాలంలోనే నశించి విశుద్ధ సత్వ ప్రధానుడిగా మిగిలాడు. అప్రాకృత మహా సన్మంగళ దివ్య స్వరూపంపై ఆతడి మనసు నిలిచిపోయింది. అప్పుడు వానప్రస్థం స్వీకరించి గండకీ నదీ తీరాన (ఇప్పటి నేపాల్ లో ఉంది) గల పులహాశ్రమానికి తరలివెళ్ళాడు. విష్ణువు సాలగ్రామ రూపంలో నిలిచి ఉన్న ఈ ప్రాంతంలో సూర్యారాధన చేస్తూ తపోదీక్షలో గడుపుతున్నాడు. ఒకనాడు ప్రసవ వేదనతో ఉన్న ఒక లేడి సింహ గర్జనకు బెదిరి నీటిలో దుమికింది. అప్పుడు ఆ లేడి మరణించి అప్పుడే పుట్టిన లేడి కూన నీటిలో పడింది. దానిని కరుణతో కాపాడి ఆశ్రమానికి తీసుకు వచ్చిన భరతుడు ప్రేమతో సాకాడు. అయితే ఆ జాలి కాస్తా ఆ తర్వాత దాని పట్ల ప్రేమగా, వ్యామోహంగా మారిపోయి భరతుడు తన తపోదీక్షను, అనుష్టానాన్ని కూడా మరచి లేడి గురించే ఆలోచించడం ప్రారంభించాడు, కొంతకాలానికి అది ఎక్కడికో పోయింది. దీనితో అతడిలో బాధ పెల్లుబికింది. ఆ వియోగ పరితాపం మనోవ్యాధిగా పరిణమించి కొంతకాలానికి దాని గురించే పరితపిస్తూ మరణించాడు. సకల సంపదల్ని వదలి, పుత్ర పౌత్రాదుల వ్యామోహం వీడి వచ్చిన జ్ఞాని, మోక్షం పొందవలసిన భరతుడు కాస్తా లేడి పైన మమకారం కారణంగా... ఆ ప్రారబ్ధ కర్మ చేత మరుజన్మలో లేడిగా పుట్టాడు. కానీ ముందు జన్మలో చేసిన అపార పుణ్యకర్మ, అద్వితీయ సాధన అనుస్మృతిగా రావడంతో ఆ లేడికి ముందు జన్మ గుర్తుంది. అందుచేత ఆ లేడి కాలంజర క్షేత్రంలో జన్మించినప్పటికీ తాను క్రితం జన్మలో సాధన చేసిన గండకీ తీరానికి వచ్చి.. ఏకాంతంగా వసిస్తూ తన పరిధిలో తాను ఆధ్యాత్మిక సాధన చేసింది. ప్రారబ్ధం ముగియగానే గండకీ నదిలో పడి ప్రాణత్యాగం చేసింది. అయితే మోక్షానికి ఆ ఉపాధి అనువు కానందున తదుపరి జన్మములో భరతుడు బాహ్యంగా జడునిగా కనిపించిన జీవన్ముక్తునిగా అవతరించాడు. అతడే జడభరతుడు. ఈ జన్మలో జడభరతుడు అసలు నోరు విప్పినవాడు కాదు. అయితే అతడు ఒకే సారి నోరు తెరిచి మహారాజైన రహూగణుడితో జరిపిన ధార్మిక సంవాదం గొప్ప తాత్విక నిధి. ఈ ప్రవచన నేపథ్యంలో బ్రహ్మశ్రీ సామవేదం అనేక ధార్మిక రహస్యాలను.. నిత్య ఉపదేశాలను సందర్భోచితంగా ప్రసాదించారు. భోగలాలస దర్మబద్ధంగా ఉంటే మనిషి పతనం అవడని పైగా తద్వారా మరిన్ని ఉత్తమ భోగాలు వస్తాయని బ్రహ్మశ్రీ సామవేదం తెలిపారు. ధర్మమనే తపస్సు చేత అతడి భోగాలు ఆశ్రయించుకుని ఉండడం చేత ఎప్పుడో ఏదో జన్మలో జ్ఞానం తద్వారా వైరాగ్యం కూడా వస్తాయన్నారు. ఫ్యాన్ కి రెగ్యులేటర్ ఉన్నట్టు.. లైటుకి స్విచ్ ఉన్నట్టు భోగానికి నియంత్రణ కూడా ఉండాలి అని సూత్రీకరించారు. భోగానికి ప్రేరణ పూర్వజన్మ వాసనలు కావచ్చునని, అటువంటపుడు దానిని తప్పించుకోలేమని తెలిపారు. అవి క్షయం కానిదే ముక్తి అసంభవం కనుక జ్ఞానులు వాటి యెడల అప్రమత్తులుగా ఉంటారన్నారు. రామకృష్ణులవారు ఒకసారి పట్టుశాలువా ధరించి హుక్కా పీల్చిన ఘటన, హల్వా తిన్న ఘటన ఇటువంటివే అన్నారు. చిన్న చిన్న సరదాలైతే తీర్చుకొని వాటిని వదిలేయాలి.. పెద్ద కోరికలైతే వివేకంతో ఆలోచించి వాటి జోలికి వెళ్లడం మానేయాలి! అని ఈ సందర్భంగా సామవేదం ప్రతిపాదించారు. కల్పాంత జీవులు అయిన మహర్షులు అన్ని కాలాల్లో ఉంటారని తెలిపారు. ఆ ఋషుల పేర్లు తలచుకుంటే చాలు ధన్యత కలుగుతుందన్నారు. భాగవతంలో ఎందరెందరో మహాత్ములు, మహర్షులు ఉన్నారని అందుకే ఈ శ్రవణం పాపహరణం అని తీర్మానించారు. తాత్విక విజ్ఞానాన్ని ఈ మోక్షాగ్రంథం ప్రతిపాదిస్తుందన్నారు. కథాకాలక్షేపానికి పరిమితం కాదు అని నిరంతర అధ్యయన గ్రంథం అని చెప్పారు. భరత అంటే వేదప్రకారం అగ్ని దేవుడని, పరమేశ్వరుడని ఆయన అర్థాలను చెప్పారు. భారత దేశానికి (లేదా వర్షానికి) ఈ పేరు వచ్చినది ఋషభ పుత్రుడైన భరతుని వల్లనే తప్ప శకుంతలాదుశ్యంతుల పుత్రుడైన భరతుని పేరిట కాదని స్పష్టం చేసారు, ఋషభదేవుడ్ని కొన్ని పాషండ అవైదిక మతస్థులు ఆ తరువాత తమ ఆది పురుషునిగా స్వీకరించారన్నారు. వేదతీత స్థితికి వేద విరుద్ధ స్థితికి తేడా తెలియకపోవడం ఇందుకు కారణం అన్నారు. భాగవతం భగవద్గీత రెండూ ఒకటే చెప్పాయని.. ఇది అర్థమైతే బతుకు బాగుపడుతుందని అన్నారు. పుణ్య క్షేత్ర దర్శనం భక్తుల జీవితాల్లో అతి ప్రధానం అని చెప్పారు. పవిత్ర క్షేత్ర దర్శనం భగవదనుభూతికి, చిత్తశుద్ధికి హేతువు అవుతుందన్నారు. సర్వ జీవుల్లో భగవానుడే ఉన్నాడనే సత్యాన్ని మరువరాదని.. శరీర ధర్మాలకు జీవుడి సంస్కారాలకు సంబంధం ఉండదు కనుక ఎవరికైనా సరే ఆకలి దప్పుల విషయంలో, ప్రాణ రక్షణ విషయంలో సహాయపడడం భక్తునికి విధాయకమని తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం