కథారూపంగా శాస్త్రం .. అదే భాగవత మహా కావ్యం


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో 12వ రోజు ప్రసంగం) కథారూపంగా శాస్త్ర విషయాలను సుందరంగా అందించిన భాగవతం గొప్ప కావ్యమని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఇందు అనేక పాత్రలను నెపంగా, ఉపాధిగా చేసుకొని సాధకులను తరింపజేసే పలు ఉత్తమ ధర్మాలను, ఆధ్యాత్మిక రహస్యాలను, శ్రేష్టమైన జీవన విధానాలను భాగవతోత్తములు వ్యాస మహర్షి ఉపదేశించారన్నారు. శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా మంగళవారం రాత్రి పన్నెండవ ప్రవచనం గావిస్తూ జీవన్ముక్తుడైన జడభరతుడు, సౌవీర రాజు రహూగణుడు మధ్య తాత్విక సంభాషణ జిజ్ఞాసువులు, సాధకులైన భక్తులను తరింపజేయడానికే అన్నారు. లౌకికులు ప్రపంచ విషయాల్లో చైతన్యంగా, జ్ఞాన విషయాల్లో మాత్రం జడంగా ఉంటారని.. కానీ జీవన్ముక్తులు ప్రాపంచిక విషయాల్లో జడులై కనిపించినా పరమాత్మ సంబంధ విషయాల్లో నిరంతర చైతన్యంగా ఉంటారని జడభరతుని గురించి చెప్పే సందర్భంలో పేర్కొన్నారు. లౌకికులకు ఏది రాత్రియో అది యోగులకు పగలు అని చెబుతూ.. లోకవ్రతులు ఏ విషయంలో నిద్రపోతారో ఆ విషయంలో (అనగా భగవద్ విషయంలో) జ్ఞానులు మేలుకొని ఉంటారన్నారు. లోకులు మెలకువగా వ్యవహరించే ప్రాపంచిక విషయాల్లో జ్ఞానులు నిద్రపోతారన్నారు. ఈ విషయం తెలిస్తే అసలైన శివరాత్రి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. సంసార లంపటులు ప్రతిచోటా అనేక మంది ఉండగా జీవన్ముక్తుడు మాత్రం ఎక్కడో అరుదుగా ఒకానొక చోట మాత్రమే కనిపిస్తాడని.. అట్టివాడు వీరి కనులకు జడునిగా, ఎరుక లేనివాడిగా, ఉన్మాదిగా కనిపిస్తాడని పేర్కొన్నారు. ఎప్పుడూ మాట్లాడి ఎరుగని జడ భరతుడు రహూగణుడితో ఎందుకు మాట్లాడాడనే విషయం వివేకంతో పరిశీలించాలన్నారు. జడభరత, రహూగణుల సంభాషణ ఆత్మతత్వ విచారానికి అద్దం పడుతుందని చెప్పారు. రాజు పల్లకి మోసేందుకు బోయీగా నియోగింపబడిన జడభరతుడు నెమ్మదిగా నడవడంపై ఆగ్రహించిన రాజు అతడిని అవహేళన చేస్తూ మందలింపుగా మాట్లాడతాడు.. ఎన్నడూ దేనికీ స్పందించని జడభరతుడు ఈ మాటలకు స్పందించి జవాబిస్తాడు. "నీవు వికారాలను అంటగడుతున్న ఈ శరీరం నేను కాదు.. అలాగే పల్లకిని మోస్తున్నదీ నేను కాదు... శారీరక, మానసిక, లోక వికారాలేవీ నన్ను తాకవు.. అవి దేహాలకే వర్తిస్తాయి! నేను ఎవరిని? నీవు రాజు అనుకుంటున్నావు. ఒక పార్థివ వికారం రాజుగా పైన కూర్చుంటే.. మరో పార్థివ వికారం బోయీలుగా మోస్తున్నది.. నీ స్వరూపమేమి? నన్ను మత్తుడు, జడుడు అని మీరనుకుంటారు.. కానీ నేను బ్రహ్మనిష్ఠుడిని.. నన్ను శిక్షిస్తానంటున్నావు.. సరే శిక్షించి నువ్వేం చేయగలవు.. పిండిని తిరిగి పిండి చేస్తే మార్పు ఏమి వస్తుంద"ని రాజును ప్రశ్నించాడు జడభరతుడు. జడభరతుని ఈ మాటల్లో తాత్వికత మాత్రమే కాకుండా సామ్యవాదం కూడా ఉందని సామవేదం సూత్రీకరించారు. జ్ఞానులంటే భయభక్తులు కలిగిన రహూగణుడు శాస్త్ర ప్రమాణంతో భాసిస్తున్న ఈ మాటలు విన్నంతనే భయపడిపోయి.. పల్లకి దిగి భక్తితో నమస్కరించాడు. ధర్మంపై శ్రద్ధ, తగినంత శాస్త్ర విజ్ఞానం కలిగిన ఆ రాజు తత్వ జిజ్ఞాసతో... అందుకు తగిన అధికార సముపార్జన కోసమై కపిల మహర్షి ఆశ్రమానికి వెళుతున్నాడని... అయితే అక్కడి వరకు వెళ్లకుండానే జడభరతుని రూపములో జ్ఞానం ఆయనకు ఎదురైందని సద్గురువులు సామవేదం తెలిపారు. ఇది ఈశ్వర ప్రణాళిక అన్నారు. జిజ్ఞాస రూపంలోని రహూగణుడి అర్హతే అతడికి సద్గురువు ఎదురుపడేలా చేసిందన్నారు. జిజ్ఞాస సాధన అయితే, జ్ఞానం సిద్ధి అవుతుందని ఇక్కడ ప్రతిపాదన చేసారు. నిత్యానిత్య వివేచన, వైరాగ్య పటుత్వం, ఇంద్రియ నిగ్రహం, సుఖమా, ముముక్షుత్వం ఉంటేనే బ్రహ్మజ్ఞానం లభిస్తుందన్నారు. జడభరతుని జ్ఞాన వచనాల వలన రాజు హృదయములోని చిత్ జడ గ్రంధి (అజ్ఞానపు ముడి) విడిపోయి జ్ఞానం భాసించిందని చెబుతూ ఇది గొప్ప అనుగ్రహమని.. దైవం మానుష రూపేణా అంటే ఇదేనని ప్రతిపాదన చేసారు. గురువు అంటే దేహం కాదని.. ఒకానొక పరంపరాగత విజ్ఞానానికి గురువు వాహిక అని గుర్తించాలన్నారు. శుభ్రమైన పాత్రలోనే గంగాతీర్థాన్ని భద్రపరుస్తామని.. అట్లే జ్ఞానపాత్ర, జ్ఞానప్రదాత అయిన గురువు కూడా అహంకారరహితుడై చిత్తశుద్ధిని పొందినవాడై ఉండాలని తెలిపారు. అద్దంలోపలి చిత్రపటంలోని విష్ణువుకి నమస్కరిస్తున్నట్లే గురువు దేహానికి శిష్యుడు చేసే నమస్కారం విష్ణువుకే చెందుతుందన్నారు. శిష్యుడు తనకు నమస్కరిస్తే గురువు అహంకారానికి లోను కాడని, దానిని తన గురువుకు అర్పించి నిర్వికార నిరాడంబరంగా ఉంటాడన్నారు. ఇందుకు విరుద్ధంగా నేడు గురువుల పేర్లతో అభయహస్తాలు, చిత్రపటాలు, పూజలతో వెలుస్తున్న సమూహాల కారణంగా సనాతన ధర్మం వికృత రూపం దాలుస్తున్నదని విచారం వ్యక్తం చేసారు. జ్ఞాన విషయమై గురువును ప్రశ్నించే శిష్యుడు ఎలా ఉండాలి అనేది శాస్త్రం స్పష్టంగా చెప్పిందన్నారు. శాస్త్రంపై గల పరిపూర్ణ విశ్వాసం చేత శిష్యుడు గురువును పరిప్రశ్న వేసి జ్ఞానాన్నిఆర్జించాలన్నారు. ప్రశ్నకి, సందేహానికి చాలా తేడా ఉన్నదంటూ, సందేహం వ్యక్తం చేయడం అంటేనే శాస్త్రంపై నమ్మకం లేదనే విషయం రుజువు అవుతున్నదన్నారు. సందేహగతులకు జ్ఞానం ఎన్నటికీ లభ్యం కాదని స్పష్టం చేసారు. జిజ్ఞాసువులు పరిప్రశ్న ద్వారా తరిస్తారని, ఇది అడగడానికి జిజ్ఞాసతో పాటు శాస్త్ర విజ్ఞానం ద్వారా లభించిన అధికారం కూడా ఉండాలని అన్నారు. నేడు దీపం ఒత్తుల విషయం, కొబ్బరికాయ కొట్టుట ఎలా.. ఇత్యాది విషయాలు కూడా ధర్మ సందేహాలుగా చలామణీ అవుతున్నాయని .. వీటిలో ధర్మమూ లేదు జ్ఞానమూ లేదు కనుక వాటి విషయంలో చింత అవసరం లేదని చమత్కరించారు. కుండ లో మట్టి శాశ్వతం.. ఆ ఉపాధి మిధ్య అని చెప్పడాన్ని రహూగణుడు ప్రస్తావిస్తూ.. కుండ ద్వారా చేస్తున్న పనులు ఉన్నప్పుడు అది మిధ్య ఎలా అవుతుందని జిజ్ఞాసతో ప్రశ్నించాడన్నారు. దీనికి జడభరతుడు గురువుగా చెప్పిన సమాధానాన్నివివరిస్తూ అవివేకివైన నీవు వివేకిలా ప్రశ్నిస్తున్నావు. వ్యవహారాన్ని నీవు పరమార్ధంతో ముడి పెడుతున్నావు అని గురువు మందలించాడన్నారు. శాశ్వతమైన చిత్ ను జడ మైన ప్రకృతిని ముడి వేసుకోవడమే మానవుల విచారానికి కారణమని వివిధ శాస్త్ర సమన్వయ సత్యాన్ని సద్గురువులు సామవేదం ఇక్కడ ప్రతిపాదించారు, ఏది శాశ్వతమో, ఏది ఆనందదాయకమో దానిని... ఏది అశాశ్వతమో. ఏది దుఃఖభాజనమో దానికి ముడి పెట్టుకుని.. ఏది ఏదో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. చావు అనే లక్షణం కలిగిన దానిని శాశ్వతం అని భ్రమించడం ఒక తప్పయితే.. అది దూరమైందని విచారించడం ఇంకో తప్పు అన్నారు. శాశ్వత సర్వవ్యాపక స్వస్వరూపాన్ని మరచిపోయి.. దాని ఛాయ వలన వెలుగుతున్నట్టు కనిపించే అశాశ్వత ప్రపంచాన్ని శాశ్వతం అనుకోవడమే అజ్ఞానమన్నారు. ఈ విషయాన్ని జడభరతుడి జ్ఞానబోధ ద్వారా రహూగణుడు గ్రహించి తరించాడని.. ఇది మనో విజయ వర్ణన అనే అధ్యాయంగా చెప్పబడింది అని బ్రహ్మశ్రీ సామవేదం వివరించారు. బాహ్యప్రపంచంలో ద్రవ్యం, వ్యక్తులు లేదా వస్తువులపై దృష్టి, వాటి స్వభావంపై ఆసక్తి, అనురక్తి, వాటి అనుభవం, ఆపైన వాటిపై రాగద్వేషాలు ఇలా మానవులు నిత్యం పలు వ్యాపకాలను పెంచుకుంటూ పోతుండడమే స్వస్వరూప జ్ఞానానికి అడ్డంకిగా మారుతున్నదని బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకం కలిగితే తప్ప ఉపాధిని, చైతన్యాన్ని విభజించుకుని నిజమైన ఆత్మ జ్ఞానం పొందడం సాధ్యం కాదన్నారు. పరమాత్మ వలన పని చేస్తున్న ఈ ఇంద్రియాలే ఆ పరమాత్మ ఉనికిని గ్రహించడానికి "మాయగా" అడ్డు పడుతున్నాయని.. అయితే ఆ ఇంద్రియాల ద్వారానే ఆ పరమాత్మ ఉనికి తెలియాల్సి ఉన్నది గనుక వీటిని ఆయన యందు లగ్నం చేయడమే శరణ్యమన్నారు. వ్యాపకాలను తగ్గించుకొని.. మనసును స్థిమితంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే అంతర్ముఖత్వం సాధ్యమన్నారు. బురదతో కలిసిన నీటిని కడవలో పట్టుకొని ఎంత తిప్పినా.. ఆ రెంటినీ వేరు చేయలేమని... అయితే కాసేపు ఆ కుండని కదపకుండా ఓచోట ఉంచితే బురద కిందికి వెళ్ళిపోయి నీరు పైకి తీరుతుందని ఇందుకు ఉదాహరణ చెప్పారు. ప్రాణం, మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కలిపి ఉపాధి అనబడతాయన్నారు. దీనిని చైతన్యవంతం చేస్తున్న స్వస్వరూప విచారణ చేయకపోవడమే భయాలకు కారణమన్నారు. క్షేత్రమైన అంతఃకరణ, క్షేత్రజ్ఞుడైన ఆత్మ మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమనబడుతుందని, అలాగే నిత్యమైన ఆత్మ, అనిత్యమైన ప్రకృతి మధ్య అంతరాన్ని గ్రహించడమే నిత్యానిత్య వివేచన అని సూత్రీకరిస్తూ వీటి ద్వారా మాత్రమే మానవుడు ఆత్మ జ్ఞానాన్ని పొందగలడన్నారు. బురద కలిసిన నీటిని కడవలో ఉంచి ఎంత తిప్పినా అవి వేరు కావని.. ఒకచోట కడవను స్థిమితంగా ఉంచితే బురద కిందికి దిగి నీరు పైకి తేరుతుందని దృష్టాంతం చెప్పారు. అలాగే వ్యాపకాలను విడిచి స్థిమితంగా ఉండి.. మౌనాన్ని ఆశ్రయించి.. స్వస్వరూపాన్ని ధ్యానించడం ద్వారా పరమాత్మ స్పృహ కలిగి జీవుడు జ్ఞానుడవుతాడన్నారు. క్షేత్రజ్ఞుడు ఎవరో వాడి గురించి తెలియజేయడానికే సర్వ దేవతా స్తోత్రాలు, శాస్త్రాలన్నీ వచ్చాయని తెలిపారు. ఆత్మ వలన అంతఃకరణంపై వెలుగు పడుతుంది. అది ప్రపంచంపై ప్రతిఫలిస్తుంది. ముందుకు చూస్తున్నజీవుడు ఆ ప్రపంచంపై వెలుగు చూసి ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నడు. ఇపుడు జీవుడు ఈ పార్క్ (బహిర్ముఖ) దృష్టిని వదిలి ప్రత్యక్ (అంతర్ముఖ) దృష్టిని ఆశ్రయించాలి. అప్పుడు అతడు తన జీవ చైతన్యాన్ని.. ఆ జీవుడికి చైతన్యం ప్రసాదిస్తున్న పరమాత్మను తెలుసుకోగలడని.. తన పరమాత్మ సంబంధాన్ని గ్రహించి జీవన్ముక్తుడు కాగలడని జడభరతుడి జ్ఞానబోధ తెలియజేస్తుందన్నారు. నిరంతరం విష్ణు కథలు వింటూ.. మననం చేసుకుంటూ ఉంటే అదే శృతి అనబడుతుందని.. దేహాంతంలో ఇదే స్మృతిగా మరి అనుస్మృతిగా ఆ జ్ఞానం తదుపరి జన్మకు చేరుతుందని అన్నారు. సద్వస్తువుతో ఉండేవారు సత్పురుషులు.. వారితో కూడితే అదే సత్సంగం అన్నాడు. సత్పురుషులతో కూడిన వారికి లభించే స్థితి ఎలాంటిదంటే జడభరతుడి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందిన రహూగణుడి స్థితి అని భాగవతకారుడు చెప్పాడన్నారు. సూదంటురాయికి అంటుకున్నఇనుపముక్కకి కూడా ఆ లక్షణాలు అబ్బుతాయని.. మరో ఇనుపముక్కని ఇది ఆకర్షిస్తుందని చెప్పారు. ఇనుముని అయస్కాంతానికి రాయగా రాయగా. ఆ సాంగత్యం చేత ఇనుము సైతం సూదంటురాయిగా మారిపోయినట్లే... భగవద్భక్తులు భగంతునిలోనే లీనమవుతున్నారని ప్రతిపాదన చేసారు. అనంతరం భాగవతమందలి స్థూల ప్రపంచ వర్ణనను పరీక్షిత్తుకు శుకుడు వివరించాడని సామవేదం వర్ణించారు. చతుర్దశ భువనాలు, అంతరిక్షం అశేష గ్రహ నక్షత్రాలు... శింశుమార చక్రం (ఇది మొసలి ఆకారంలో గ్రహ నక్షత్రాల పొందిక) .. భూమిపై సప్త ద్వీపాలు, భరత వర్షాది ఖండాలు.. ఇదీ భారతీయ ఋషుల అద్భుత జ్ఞానం అన్నారు. ఒక్కో దేశంలో నారాయణుడిని ఒక్కో తత్వంతో ఉపాసించడం విశేషమని.. దానిని ఈ వర్ణనలో శుకుడు ఇలా చెప్పాడన్నారు. ఇలావృత వర్షం (దేశం): అక్కడ శివుడు మాత్రమే పురుషుడు. ఆయన ధ్యానించే విష్ణువు పేరు సంకర్షణుడు. భద్రశ్రవ వర్షం : ఇక్కడ భద్రశ్రవసుడు పూజించే నారాయణ తత్వం పేరు ధర్ముడు., హరివర్షం : నరసింహ స్వామి, కేతుమాల వర్షం : లక్ష్మీదేవితో కూడి కామదేవుని రూపంలో ప్రద్యుమ్నునిగా ఉంటాడు విష్ణువు. రమ్యక వర్షం : మత్స్యావతార విష్ణువు. హిరణ్మయ వర్షం : కూర్మ రూప విష్ణువు. కురు వర్షం : యజ్ఞపురుషుడైన వరాహ స్వామి, కింపురుష వర్షం : హనుమ ఇక్కడ ఉంటాడు. ఆయన కీర్తించే రామునిగా ఇక్కడ విష్ణువుని ఉపాసిస్తారు. భరత వర్షం : ఇక్కడ విష్ణు తత్వాన్ని నరనారాయణ ఏక రూపంలో ఉపాసించాలి. విశ్వం అంతా దర్శించిన మహర్షి జంబూ ద్వీపాన్ని, అందు భరత వర్షాన్ని గొప్పవని చెప్పాడంటే అది సంకుచితత్వం కాదనీ... అది ఈ భూమి గొప్పతనం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రతి నీటి బిందువులో.. రాయిలో మహత్తు ఇమిడి ఉన్న ఉత్కృష్ట దేశం ఇదన్నారు. ఉపగ్రహం తీసిన మట్టి, మశానం ఫోటోలు చూపి ప్రపంచంలోని దేశాలు అహంకరిస్తున్న ఈ తరుణంలో వేల ఏళ్ళ నాడే అంతరిక్ష ప్రపంచాన్ని.. వివిధ లోకాలను దర్శించి... అక్కడి సూక్ష్మ విశేషాలను కూడా మన ఋషులు చెప్పారన్నారు. ఇది అప్పటి వారు ఉహించారనుకోవద్దు అని... అది సంపూర్ణ జ్ఞానం అని సామవేదం ప్రతిపాదించారు. మనం తీవ్ర పరిశోధన చేస్తే ఆ నిజాలు మళ్ళీ బయటికి వస్తాయన్నారు. ఆ బంధం నుంచి ప్రాచీన విజ్ఞానం నుంచి ఎంతో దూరం వచ్చేసామన్నారు. సెక్యులర్ పేరుతో ఇప్పటి రాక్షస జాతి ఆ బంధాన్ని మరింత దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దేవతలు కూడా ఈ భరత వర్షాన్ని మోక్షభూమిగా గుర్తించి పైనుంచి నమస్కరిస్తుంటాయన్నారు. భోగ లోకాల్లో కల్పాంతం జీవించేకంటే భూమిపై అల్పాయువు తో జీవించినా చాలని దేవతలు అనుకుంటారన్నారు. ఇంత గొప్ప చరిత్రను తనకు తానే కప్పి వేసుకొని పతనమైపోయే దుర్మార్గ జాతి భారత జాతి మాత్రమే అని ఈ సందర్భంగా సామవేదం వారు ఆవేదనతో వ్యాఖ్యానించారు. భవ్యము, దివ్యము అయిన గత చరిత్ర కళ్ళముందే నాశనం అవుతున్నా ఏ పట్టింపు లేకుండా. భౌతిక సుఖాల కోసం, అల్ప ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న ఈ జాతిని చూసి అమిత వేదన కలుగుతున్నదన్నారు. దేశ భక్తి లేని దైవ భక్తి సార్థకం కాదన్నారు. అది ఎందుకంటే.. మళ్ళీ మానవ జన్మ వచ్చినా కూడా ఈ భూమిపై.. ఈ ధర్మంలో పుడితేనే మోక్షం వస్తుందన్నారు. భారతదేశం గొప్పతనం అంతా ప్రాచీనతలో ఉందని ప్రతి మట్టి కణం పవిత్రం అని వివేకానంద అంటే... భారతదేశం అనే వృక్షం వేళ్ళు హిందూ ధర్మం అనే మట్టిలో ఉన్నాయి అని.. ఆ వేళ్ళు బయటికి తీసేస్తే ఈ దేశం మరణిస్తుంది అని అనీబిసెంట్ చెప్పారన్నారు. కాశీ వస్తున్న విదేశీయుల్లో అనేకమంది పలు పర్యాయాలు వస్తున్నారని... వారంతా అక్కడ శివుని కోసం వస్తున్నారని ఇటీవల సర్వేలో వెల్లడైందని కూడా సామవేదం చెప్పారు! జ్ఞానవిషయాల్లో ఎవరేది చెబితే అది ప్రమాణము అనుకొని సాధకులు పొరబడరాదని కూడా సామవేదం తెలిపారు. గొప్ప మాటగా అనిపించినా ఆ ప్రతిపాదన శాస్త్ర ప్రమాణమా కాదా అనే విషయాన్నిముందుగా పరీక్షించుకోవాలని.. లేకుంటే శాస్త్ర విరుద్ధమైన కొత్త ధర్మాలు వ్యాప్తి చెంది పతన హేతువులు కాగలవని హెచ్చరించారు. మనిషి నూతన ప్రియుడు గనుక కొత్త ధర్మాలు అతడిని ఆకర్షిస్తాయంటూ... అట్టి మాయలో పడరాదన్నారు. కొత్తలో గాడిద పిల్లా కోమలంగానే కనిపిస్తుందని వేయిపడగలు గ్రంథంలో విశ్వనాథవారన్న మాటని ఈ సందర్భంగా శ్రీ సామవేదం ప్రస్తావించారు. ఏ ప్రాంతం వారినైనా సరే తరింపజేసే ధర్మం సనాతన ధర్మం మాత్రమే అని నిర్ద్వంద్వముగా గుర్తెరగాలని ఆయన ఉద్బోధించారు. అద్వైతమే పరమ ధర్మమని.. ప్రపంచానికి ఇదే ఆదర్శమని స్వామి వివేకానంద చెప్పిన సంగతిని ఈ తరం గుర్తుంచుకోవాలన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు