ఏప్రియల్ 8న సుపథ సాంస్కృతిక పత్రిక 20వసంతాల వేడుక


సద్గురు శ్రీ కందుకూరి శివానంద మూర్తి దివ్య ఆశీస్సులతో 1998లో ఆవిర్భవించిన సుపథ సాంస్కృతిక పత్రిక 20వసంతాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఏప్రియల్ 8న రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరిహాలులో ఘనంగా వేడుకలు నిర్వహించడానికి శివానంద సుపథ ఫౌండేషన్ నిర్ణయించిందని ఫౌండేషన్ చైర్మన్ ఎన్ వి డి ఎస్ రాజు చెప్పారు. వాడ్రేవు బిల్డింగ్స్ లో సుపథ సాంస్కృతిక పత్రిక సంపాదకులు డాక్టర్ వివి హనుమంతరావు, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారి ఎన్ రాధాకుమారి, ఆహ్వాన సంఘ అధ్యక్షులు వాడ్రేవు మల్లపరాజు, వాడ్రేవు వేణు గోపాలరావు,సభ్యులు డాక్టర్ కెవిఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ పివిబి సంజీవరావు, సుపథ అసిస్టెంట్ ఎడిటర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్న విలేకరుల సమావేశంలో మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. ఏప్రియల్ 8వ తేదీ ఉదయం 9.15గంటలకు కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. సద్గురు శివానంద మూర్తి స్పూర్తితో ఏర్పడిన శివానంద సుపథ ఫౌండేషన్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక,సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. ఈసందర్బంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.

సుపథ సంపాదకులు డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ శివానంద సుపథ ఫౌండేషన్ పక్షాన సుపథ పత్రిక నిర్వహించడమే కాకుండా, భారతీయ సంస్కృతి, దేశభక్తి కి సంబంధించిన రచనలను ముద్రించడం, రచయితలకు ఊతమివ్వడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, కరావలంబమ్ పేరిట భోజన వసతి, గో పోషణ, గోశాలలకు చేయూత వంటి ఎన్నో సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. సుపథ పత్రిక నెలవారీ పత్రికగా ప్రారంభమై, ఆతర్వాత రెండు నెలలకోసారి ద్వైమాసిక పత్రికగా కొనసాగుతున్నదని, 20వసంతాల వేడుక సందర్బంగా తిరిగి మాస పత్రికగా తీసుకువస్తున్నామని చెప్పారు. రాజమండ్రిలోనే జన్మించిన సద్గురు శివానంద మూర్తి గారి బాల్యం రాజమండ్రి, కొవ్వూరులలో గడించిందని అందుచేత ఈప్రాంతంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. ఎక్కువమంది వారి శిష్య గణం కూడా ఈప్రాంతంలో వున్నారని వివరించారు. సద్గురు శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాలే కాకుండా దేశభక్తి, భారతీయత, పలు సమస్యలకు భారతీయతతో కూడిన పరిష్కారాలు... ఇలా ఎన్నో విషయాలు బోధించేవారని ఆయన అన్నారు.

ఏప్రియల్ 8న జరిగే కార్యక్రమానికి మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాక రఘునాథ శర్మ అధ్యక్షత వహిస్తారని,ఆంధ్రభూమి పూర్వ సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరవుతారని డాక్టర్ హనుమంతరావు చెప్పారు. బలుసుపాడు గురుధామం నిర్వాహకులు శ్రీ గెంటేల వెంకట రమణ గారు సభా ప్రారంభకులుగా హాజరవుతారన్నారు. ఎపి టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం,లేబర్ అండ్ ఎంప్లాయి మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె ఎస్ వి ప్రసాద్ గౌరవ అతిథులుగా, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఆర్ రాఘవేంద్రన్, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కందుకూరి బసవరాజు,సినీ నిర్మాత రాజ్ కందుకూరి ఆత్మీయ అతిథులుగా హాజరవుతారన్నారు. రెండు దశాబ్దాలుగా సుపథ పత్రికకు చేయూతనిచ్చి నిలిపిన వదాన్యులు వై ఆదినారాయణ మూర్తి (సుపథ తొలి ప్రచురణ కర్త),కందుకూరి బసవరాజు, ప్రఖ్యాత సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సి శ్రీరామశాస్త్రి, పి సీతాకుమారి, వై సత్యారావు మాస్టారు, బాదం మాధవరావు హాజరవుతారు. డాక్టర్ జి ప్రభాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.

ముఖ్యాంశాలు