రాహుల్ ఆరోపణలో పస లేదు ...   తేల్చేసిన దసో

దసో సంస్థ సిఈఓ ఎరిక్‌ ట్రేపియర్‌ రాఫెల్ ఒప్పందంలో అసలు నిజాన్ని, రాహుల్ గాంధీ ఆడుతున్న అబద్ధాన్ని కుండబద్దలు కొట్టినట్టు బహిర్గతం చేసారు. ‘వినియోగానికి సిద్ధమైన దశ’లో ఉన్న యుద్ధవిమానాల ధర విషయంలో యూపీఏతో పోలిస్తే ఎన్‌డీఏ ఒప్పందమే చౌకైందని ట్రేపియర్‌ తెలిపారు. ‘‘యూపీఏ హయాంలో నేరుగా కొనుగోలు చేయాలనుకున్న 18 విమానాల ధరతో పోల్చినప్పుడు రెండో ఒప్పందంలోని 36 విమానాల ధర ఒకేలా ఉంది. నిజానికి 36 అనేది 18కి రెట్టింపు సంఖ్య. ఈ లెక్కన ధర రెట్టింపై ఉండాలి. కానీ అది రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కావడం, విస్తృత చర్చలు జరగడం వంటి కారణాల వల్ల ధరను మేం తగ్గించాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రక్షించడానికి తాను అబద్ధాలాడుతున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. ‘‘సీఈవో హోదాలో నేను అబద్ధాలాడను’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు సాగాయి. వీటిలో 18 యుద్ధవిమానాలను ‘వినియోగానికి సిద్ధమైన దశ’లో దసో సరఫరా చేయాలి. మిగతావాటిని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) భారత్‌లో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కారు దీన్ని పక్కనపెట్టేసింది. 36 రఫేల్‌ యుద్ధవిమానాలను ‘వినియోగానికి సిద్ధమైన దశ’లో నేరుగా దసో నుంచి కొనుగోలుకు నిర్ణయించింది. 
ఒప్పందంలోని ‘ఆఫ్‌సెట్‌’ నిబంధనలను అందుకోవడానికి తాము భాగస్వామ్యాలు కుదుర్చుకున్న అనేక సంస్థల్లో రిలయన్స్‌ డిఫెన్స్‌’ కూడా ఒకటని ట్రేపియర్‌ చెప్పారు. ‘‘ఇప్పటికే 30 కంపెనీలతో ఒప్పందం చేసుకొని, పనిని సర్దుబాటు చేసుకున్నాం. ఆఫ్‌సెట్‌ కింద భారత్‌లో పెట్టుబడిగా పెట్టాల్సిన మొత్తంలో ఇది 40 శాతం మేర ఉంటుంది. ఇందులో రిలయన్స్‌ వాటా 10 శాతమే’’ అని పేర్కొన్నారు.