యురి సెక్టార్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతం


జమ్ముకశ్మీర్‌లోని యురీ సరిహద్దు వద్ద సోమవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. సరిహద్దుల్లో చొరబడి ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల దుశ్చర్యలను మన జవాన్లు తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే ఈ మొహ్మద్‌(జేఈఎం)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు వైద్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయని వెల్లడించారు. 2016 సెప్టెంబరు 18న పాక్‌ ఉగ్రవాదులు యురీ సైనిక స్థావరంపై దాడులు చేసి 19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే భారత్‌ పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. ఆ దాడుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్‌ ఉగ్రవాద స్థావరాలను రాత్రికి రాత్రి ధ్వంసం చేసింది.

ముఖ్యాంశాలు