లక్ష్యం దిశగా ఆపరేషన్ ఆలౌట్


కశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు సైన్యం, పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ ఆలౌట్‌ ఘన విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో జైషే ఈ మొహ్మద్‌ ఉగ్రసంస్థకు భారీగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ సంస్థ లోగడ అనేక విద్రోహ చర్యలకు పాల్పడింది. సోమవారం తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ఇదే ఉగ్రసంస్థకు చెందిన సభ్యులు మృతి చెందారు.ఈ ఆపరేషన్ కింద ఇంతవరకూ 200 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సోమవారం మరో ఆరుగురు ఉగ్రవాదుల ను నేలకూల్చాయి. మృతి చెందిన వారంతా జైషే ఈ మొహ్మద్‌ ఉగ్రసంస్థలోని ఆత్మాహుతి దళానికి చెందిన వారిగా భావిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చొరబాట్లు జరగవచ్చని సైన్యానికి పకడ్బందీ సమాచారం ఉంది. దీంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, సైన్యం కీలక ప్రదేశాల్లో నిఘాను పెంచాయి. శ్రీనగర్‌కు 108 కిలోమీటర్ల దూరంలో ఉగ్రకదలికలను గుర్తించిన సైన్యం అప్రమత్తమైంది. స్థావరాన్ని చుట్టుముట్టిన దళాలు అనుమానాస్పద వ్యక్తులను లొంగిపోవాలని కోరాయి. కానీ వారు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి ఆరుగురు ఉగ్రవాదులను చంపాయి. ఐదు మృతదేహాలను ఇంతవరకూ సైన్యం స్వాధీనం చేసుకుంది. మరో మృతదేహం దొరకాల్సి ఉంది. స్థావరం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం