సరిహద్దుల్లో మరణ మృదంగం

భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే పాకిస్థాన్‌కు గట్టిగా జవాబిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటన.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సైన్యం దానికి ఆచరణ రూపం ఇచ్చిన వైనం! పూంఛ్ సెక్టార్లో భారత దళాలపై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 801 బెటాలియన్‌కు చెందిన 3-పీవోకే బ్రిగేడ్ సైనికులు జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన చర్యలు నిజంగానే పాక్ కి గట్టి పాఠం చెప్పాయి. ఆదివారం కూడా పాక్ కాల్పుల్లో రాజౌరీ సెక్టార్లో ఒక భారత జవాన్ మృతి చెందడంతో మన సైన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. ఆపైన పాక్ కవ్వింపు చర్యలు ఇంకా చిర్రెత్తించాయి. దీంతో భారత దళాలు ఎదురు దాడిని భీకరంగా ప్రారంభించాయి. సరిహద్దుల వెంట మోర్టార్లు దారుణంగా గర్జించాయి. ఆతర్వాత కొద్దిసేపటికే పాక్ వైపు మోర్టార్లు మౌనం వహించాయి, ఈ పరిమిత యుద్ధంలో ఏడుగురు పాక్ సైనికులను హతమార్చినట్టు భారత సైన్యం ప్రకటించింది. అయితే పాకిస్థాన్ దీనిని ఖండిస్తూ.. ఈ ఘటనలో తమ జవాన్లు నలుగురే మరణించినట్లు ప్రకటించింది. పాక్ ఇంటిలిజెన్స్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ దీనిపై మాట్లాడుతూ ఆ మిగిలిన ముగ్గురు జవాన్లు భారతీయులే అంది. ఈ ప్రకటనను లోతుగా శోధించిన భారత సైనికాధి కారులు ఒక అంచనాకి వచ్చారు. మృతుల్లో మిగిలిన ముగ్గురు పాక్ సైనికులు కాకపోయి ఉంటే పాక్ ఆర్మీ సాయం తో భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించే టెర్రరిస్టులు అయి ఉండవచ్చని నిర్ధారిస్తున్నారు. నిజానికి అకారణంగా పాక్ దళాలు సరిహద్దుల్లో కాల్పులు జరిపాయంటే లోగుట్టు వేరే ఉంటుంది. ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటి ఇండియాలో చొరబడడానికి వీలుగా పాక్ సైన్యం మన సైనికుల్ని దృష్టి మళ్లించేందుకే ఈ కాల్పులు జరుపుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కాల్పుల అజెండా అదే కావచ్చు... కానీ భారత్ సైన్యం ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉండడంతో పాక్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా తయారైంది.