భక్తి లేని ప్రాయశ్చిత్త కర్మలు ఫలించవు : బ్రహ్మశ్రీ సామవేదం


మనసులో భక్తి లేనివాడు పాపాలను తొలగించుకునేందుకు ప్రాయశ్చిత్త కర్మలు ఎన్ని చేసినా అవి పూర్ణ ఫలితాన్ని ఇవ్వజాలవని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన 13వ ప్రసంగం చేస్తూ కల్లు కుండకు గంగాజలంతో అభిషేకం చేసినంతమాత్రాన అది శుద్ధం కానట్లే, అంత:కరణ శుద్ధిలేని జీవుడు కేవల ప్రాయశ్చిత్త కర్మతో సిద్ధుడు కాలేడన్నారు. సరోవరంలో స్నానం చేసిన ఏనుగు ఒడ్డుకు రాగానే ఒంటిపై దుమ్ము పోసుకున్నట్లుగా మానవుడు ఒక పాపం తొలగించుకున్నా, మరిన్ని పాపాలు చేస్తూనే ఉంటాడన్నారు. పైగా ప్రాయశ్చిత్త విధులు కూడా కర్మలే గావున వాటి ఫలితాలను కూడా జీవుడు అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి వారికి నిష్కృతి లభించే తరుణోపాయం చెప్పమని పరీక్షిత్తు మహారాజు కోరగా శుకమహర్షి చెప్పిన మార్గాన్ని నామయోగంగా పేర్కొంటూ భగవన్నామ మహిమను సామవేదం వారు సవిస్తరంగా తెలిపారు. భగవన్నామం అత్యంత మహిమాన్వితమని, అది సాక్షాత్‌ భగవంతుని శబ్దరూప అవతారమని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. అంతఃకరణ శుద్ధికి భగవన్నామ స్మరణే శరణ్యమన్నారు. తెలిసి పిలిచినా, తెలియక పిలిచినా కూడా నామస్మరణ వన భగవానుడు ఉద్ధరిస్తాడన్నారు. నామం ఋషిప్రోక్తం గనుక అది మంత్రశక్తిని సంతరించుకుందన్నారు. దైవ నామానికి శక్తి లేదనేవాడు ఎటువంటి వాడంటే... నామానికి ఎంత శక్తి ఉందో తెలియనివాడని మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన సంగతిని సామవేదం ప్రస్తావించారు. అడవిలో పుట్టిన అగ్ని దావానలంగా మారి ఆ అడవి సమస్తాన్ని దహించివేసినట్లే మనలో పుట్టిన నామస్మరణాగ్నికి పాపరాశి మొత్తం భస్మీపటలమవుతుందని సూత్రీకరించారు. నామం యొక్క శక్తిని అనుమానించినా, నామానికి మహిమ లేదని పొరబడినా నామాపచార దోషం సంప్రాప్తిస్తుందని హెచ్చరించారు. భగవంతునిపై అఖండ ప్రేమతో, కృష్ణార్పిత ప్రాణులుగా మసలేవారికి మాత్రమే పాపరాహిత్య స్థితి సంభవమని, వారికి తక్షణ ముక్తి నిశ్చయమని చెబుతూ అట్టి ఉన్నత స్థితి నామాన్ని పట్టుకుని స్మరించేవారికి కూడా భిస్తుందన్నారు. ఎన్నో జన్మల అనంతరం లభించిన ఈ మానవదేహంతోనే సాధన చేత జీవుడు ముక్తిని పొందాలన్నారు. ఈ జన్మను దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఎప్పటికి మోక్షార్హత కలిగిన మానవదేహాన్ని, అందునా భరతభూమిలో పుట్టే అదృష్టాన్ని పొందగలమో తెలియదన్నారు. క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు కేవలం ప్రారబ్ధాన్ని అనుభవించడానికే ఆ జన్మను పొందుతాయి కనుక వాటికి క్రమంగా జన్మోన్నతి భిస్తుందని, కానీ ఆలోచన చేత జీవితాన్ని సంస్కరించుకొని, స్మరణచేత ముక్తిని కూడా పొందగల అవకాశం ఉన్న మానవుడు అది జారవిడుచుకుంటే రౌరవాది నరకాలు అనుభవించడమే కాకుండా, నీచజన్మలో పుట్టక తప్పదన్నారు. కేవల ఐహిక ప్రయోజనాల కోసం భగవంతుని ఆశ్రయించేవారు భక్తులు కారని, వారు నారాయణ పరాన్ముఖులని సామవేదం వారు అన్నారు. వీరు కోరికను అడిగేందుకు దైవదర్శనం కోసం రోజుల తరబడి క్యూలో నిలుచుంటారు గానీ.. పది నిమిషాల జ్ఞానబోధను (లాభం కనిపించదు కాబట్టి) కూడా వినరన్నారు. అయితే వాంఛ ఏదైనప్పటికీ పరమాత్మను ఆశ్రయించడం చేత వారు సద్గతులను పొందకపోయినా కనీసం నరకం నుంచి రక్షింపబడతారని స్పష్టం చేశారు. కానీ ఏ విధంగానూ భగవత్‌ స్పర్శ, స్పృహ లేకుండా బతికేవారు సర్వభ్రష్టులన్నారు. పాపం వెంట పాపం చేస్తూనే పోయే ఇలాంటివారు కేవల దేహాత్మ భావనతో ఇంద్రియాలను సుఖపెట్టడమే లక్ష్యంగా జీవించే లంపటులని నిర్వచించారు. పశుప్రాయులుగా జీవించడానికి మానవజన్మ ఎందుకనే ప్రశ్న వేసుకోవాన్నారు. కొందరైతే జీవితమంతా అక్రమాలు, పాపాలు చేసి తరగని సంపద కూడబెట్టుకున్న తర్వాత తీరికగా భక్తిమార్గంలోకి రావాలని అనుకుంటారని, అయితే అటువంటి పాపపు కూడు తిన్నవారికి భక్తి వైపు బుద్ధి మరలే అవకాశమే ఉండదని తీర్మానించారు. పైగా ఆయువు, సత్తువ రెండూ ఉంటాయన్న నమ్మకం కూడా లేదన్నారు. మానవుని కర్మల్లో మంచి చెడులను వర్గీకరించే దైవిక సాక్షుల వ్యవస్థను భాగవతం తెలిపిందన్నారు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, ఇంద్రియాలు, మరుత్తులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్లు, రాత్రులు, దిక్కులు, కాలం, భూమి, జలం, ధర్మదేవత మానవుల సకల కర్మలకు సాక్షులన్నారు. భక్తి రెండు విధాలని వాటిలో మొదటిది వ్రతాలు, పూజలు, యాత్రలు ఇంకా నియమబద్ధ జీవన విధానంతో, భగవద్‌ చింతనతో గడిపేవారి మార్గమన్నారు. దీనిని స్థూల భక్తిగా చెబుతారన్నారు. మితాహారం, వ్యాయామం ద్వారా శరీరాన్ని రక్షించుకుంటూ బ్రహ్మచర్యం, శమదమాదులు, ఇంద్రియ నియంత్రణ, త్యాగం, యమనియమాల పాలన, ఆత్మస్థయిర్యం, స్థితప్రజ్ఞత కలిగి ఉంటే చిత్తశుద్ధి కలిగి పాపాలు క్షయమవుతాయన్నారు. మమ ఉపాత్త దురితక్షయార్థం అనే సంకల్పం చెప్పుకోవడం వెనుక అంతరార్థం ఇదేనన్నారు. రోగాక్రమణకు ముందే, ఇంద్రియ పటుత్వం ఉండగానే ఈ సాధన చేపట్టాలని ఉపదేశించారు. దీనివల్ల ప్రయత్నము చేత వెదురుపొద మొదట్లో నిప్పుపెడితే ఎలా అవి భస్మమవుతాయో అలా పాపరాశి నశిస్తుందన్నారు. పాపరాశి ఎంత ఉన్నప్పటికీ అనుగ్రహవశాన భగవత్‌ ప్రీతి కల్పించుకునేవారు కొందరు ఉంటారని, వారు వాసుదేవపరాయణులుగా మెలగినందున పాపాలు వారి దరిచేరవన్నారు. ఏదో పూర్వపుణ్యం ఉన్నందున భగవదనుగ్రహంగా వీరికి నారాయణప్రీతి కలుగుతుందని, ఇందులో మానవ ప్రయత్న రహితంగానే... సూర్యకిరణాలచే పొగమంచు ఛేదింపబడినట్లుగా పాపరాశి తొలగిపోతుందన్నారు. అనన్యభక్తి ఉన్నవాడిని పాపరాశి దరిచేరలేదన్నారు. తెలిసీ తెలియక చేసే పాపాలను నిత్యానుష్ఠానం దగ్ధం చేస్తుందని... అయితే పాపభావన కలిగితే మాత్రం ఆ పాపం అలాగే ఉంటుందనే రహస్యం తెలుసుకోవాలన్నారు. నిరంతర భగవన్నామ స్మరణే జన్మతారణానికి అంతిమ తరుణోపాయమని చెప్పిన శుక మహర్షి దీని ప్రశస్తిని తెలియజేస్తూ, తాను అగస్త్యుని ద్వారా విన్న అజామిళుని కథను పరీక్షిత్తుకు తెలిపాడన్నారు. అయితే అజామిళుని కథను చాలామంది పూర్తిగా తెలుసుకోవడంలేదని, భాగవతంలో ఉన్న పూర్తికథను చదివితే.. పూర్వపుణ్యం వ్లనే అంతిమకాలంలో అతడికి నారాయణ స్మరణ సాధ్యమైందనే అసలు రహస్యం తెలుస్తుందని పేర్కొన్నారు. అంతిమ సమయంలో నామస్మరణకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కారణంగానే మన సంస్కృతిలో తిట్టుకి, ఊతపదానికి, పకరింపుకి, పిలుపుకి, నిట్టూర్పుకి... ఇలా అన్నిటికీ దైవం పేరునే తలవడం అవాటుగా ఉండేదన్నారు. చివరికి తుమ్మినా, దగ్గినా, దెబ్బ తగిలినా కూడా దేవుడి పేరునే తలచుకోవడం పరిపాటి అని గుర్తు చేశారు. పిల్లల పేర్లు కూడా దైవానివే పెట్టడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే అన్నారు. ఏదోవిధంగా దేవుడి పేరు అవాటుగా మారితే... ఆఖరి నిమిషంలో అది గుర్తు వచ్చి తరింపజేస్తుందనే ఆలోచనే ఇందుకు స్ఫూర్తి అని వివరించారు. దేహ ఇంద్రియాలు స్వాధీనరహిత స్థితిలో ఉండగా స్మతి ఏదైతే వచ్చిందో జీవుడు అదే అవుతాడని ఉపనిషద్‌ వచనం ప్రాతిపదికగా తెలిపారు. దేహాత్మ భావనతో జీవించేవారికి ఎట్టి సాధనా, పురాకృత సుకృతం లేకుండా అంతిమ స్మరణ స్ఫురించే అవకాశమే లేదన్నారు. వేయి మండ్రగబ్బలు ఒకేసారి కరిస్తే ఎంతటి బాధ కలుగుతుందో... అంతకుమించిన బాధను మరణయాతన అంటారన్నారు. దేహాత్మ భావన చేత నరనరాన, సర్వనాడుల్లోనూ ప్రాణశక్తి వ్యాపించిపోవడంతో జీవుడు మరణయాతనతో సతమతమవుతాడని, ఆ పరిస్థితిలో కూడా దేహం కోసమే ఏడుస్తాడు తప్ప ముక్తి వైపు దృష్టి వెళ్ళదన్నారు. దేహ భ్రాంతిని వదిలించుకొని, ఆత్మజ్ఞాన సాధన చేసినవాడు ప్రాణాయామ సాధనతో ప్రాణశక్తిని నాడుల నుంచి లాగి శీఘ్రనిష్క్రమణకు సిద్ధం చేయగలడని, "ఉర్వారుక మివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయమామృతాత్‌" అనే మృత్యుంజయ మంత్ర ఆంతర్యం ఇదేనని వక్కాణించారు. ధనం, యవ్వనం, విద్య, అధికారం ఈ నాలుగూ అహంకార కారణాలని పేర్కొంటూ శుకయోగీంద్రుడు చెప్పిన మరోకథను ప్రస్తావించారు. ఒకనాడు కొలువుదీరి ఉన్న ఇంద్రుడు గురువైన బృహస్పతిపై చులకనభావాన్ని ప్రదర్శించడంతో ఆయన ఆగ్రహించి అవ్యక్తుడవుతాడన్నారు. అపుడు గురు అనుగ్రహలోపం కారణంగా ఇంద్రుడి శక్తి సన్నగిల్లి దానవుల చేత ఓటమి చవిచూశాడని తెలిపారు. ఆ క్రమంలో బ్రహ్మదేవుని శరణు వేడిన ఇంద్రునికి విశ్వరూపుడనే ఒక ప్రజాపతిపుత్రుడ్ని ఆశ్రయించమని బ్రహ్మ ఉపదేశిస్తాడు. అంతట ఇంద్రుడు విశ్వరూపుని వలన నారాయణకవచ ఉపదేశం పొంది.. ఆ కవచ ప్రభావం చేత దానవులను ఓడిస్తాడు. అయితే విశ్వరూపుడి తల్లివైపు బంధువులు దానవులు కావడంతో... అతడు హవిస్సులను రాక్షసుల క్షేమం కోసం మళ్ళిస్తున్నాడని గమనించిన ఇంద్రుడు లోకక్షేమార్థం అతడిని వధిస్తాడు. అప్పుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడంతో ఇంద్రుడు పాలనకు అనర్హుడవుతాడు. అప్పుడు విజ్ఞుల సలహా మేరకు తన పాపాన్ని పంచుకునేవారి కోసం దేవేంద్రుడు అర్థిస్తాడు. లోకక్షేమం కోసం ఇంద్రుడు చేసిన ఈ పాపాన్ని పంచుకునేందుకు పెద్దమనసుతో భూమి, నీరు, చెట్టు, స్త్రీ ముందుకు వచ్చారని వివరించారు. ఆ పాపదోషం నిర్దేశిత సమయాల్లో నీటిలో నురుగు రూపంలో, చెట్టుకు జిగురుగా, భూమిలో చవిటి నేలగా, స్త్రీలో ప్రతినెలా రజస్వలాదోషంగా వ్యక్తమవుతుందన్నారు. దోషయుతం అయినందున ఆయా సమయాల్లో వాటిని నిర్జించాని శాస్త్రం చెబుతున్నదని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల కిందటివరకూ అన్ని వర్ణాల వారూ ఈ దోషనియమాన్ని స్వాభావికంగానే పాటించారని, అయితే నేడు వైజ్ఞానికత, నాగరికత ముసుగులో రజస్వలాదోషాన్ని గృహకార్యాల్లో కలుపుకొంటున్నారని, ఇది అరిష్ఠమని ఆయన స్పష్టం చేశారు. యజుర్వేద బ్రాహ్మణంలో రజస్వలాదోష విషయం ప్రముఖంగా చెప్పబడిరదన్నారు. మనం చూస్తున్న ప్రపంచానికంటే మూడురెట్ల పెద్దదైన సూక్ష్మప్రపంచం మనచుట్టూ ఆవరించి ఉందనే విషయాన్ని విస్మరించరాదన్నారు. ఆ సూక్ష్మప్రపంచంలో అనేక దుష్ట, శిష్ట శక్తులు పరిభ్రమిస్తుంటాయని, దోషయుత పరిస్థితులు ఉంటే దుష్టశక్తులు బలం పుంజుకొని హాని కలుగజేస్తాయని పేర్కొన్నారు. దోషపూరిత సమయంలో దేహం, మనసు పిశాచగ్రస్తమై ఉంటాయని ఆయన హెచ్చరించారు. రజస్వలదోషాన్ని ధార్మిక, గృహ కార్యాల్లో కలుపుకోవడం వలన బుద్ధిలో, సంతానంలో, గృహశాంతిలో రుగ్మతలు తలెత్తగలవన్నారు. శాస్త్రం చెప్పినదే ధర్మమవుతుంది తప్ప బుద్ధికి తోచినది కాదన్నారు. ఏ విషయం ప్రతిపాదించినా శాస్త్రమే గీటురాయిగా ఉండాలన్నారు. పుణ్యకార్యాలు చేయకపోయినా క్షంతవ్యమే కానీ, దురాచారాలు పాటించడం మాత్రం క్షమార్హం కాదన్నారు. లోకోద్ధరణకు ఆనాడు దయతో ముందుకు వచ్చిన నుగురికీ దేవేంద్రుడు వరాలు కూడా ఇచ్చాడన్నారు. తవ్వినా పూడుకుపోయే లక్షణాన్ని భూమికి, పాతనీరు పోయినా కొత్తది వచ్చే వరాన్ని నదులకు, నరికినా మొలిచే వరాన్ని వృక్షానికి ఇచ్చిన ఇంద్రుడు స్త్రీ శరీరాన్ని పుట్టుక మొదలు మరణం వరకూ పూజార్హమని దీవించాడన్నారు. శాస్త్రం చెప్పిన విషయం లోతుపాతు తెలియనంత మాత్రాన దానిని కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. అజ్ఞానంతో ఆచరించినా ఆ నియమం ఫలితాన్ని ఇస్తుందని, మిడిమిడి జ్ఞానంతో కాదంటే మాత్రం దుష్ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. ప్రచేతసులకు రుద్రగీత బోధించిన పరమేశ్వరుడు భాగవత మార్గ ప్రబోధకులో ప్రథముడని చెప్పారు. విష్ణుతత్వానికి శివుడు, శివతత్వానికి విష్ణువు అన్యోన్య గురువులని, వారిద్దరిదీ అవిభాజ్యమైన శివకేశవతత్వమని సద్గురువులు పునరుద్ఘాటించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం