కాటన్ స్ఫూర్తికి సీఎం బాబు నివాళి

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో నివాళులర్పించారు. ప్రజలు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్న మహనీయుడు కాటన్‌ అని కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన వ్యక్తి కాటన్ అని, ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాటన్‌ తీర్చిదిద్దారన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావది నదిపై ఆనకట్ట నిర్మించి కాటన్‌ చరితార్థుడయ్యాడని వెల్లడించారు. ఆయన స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు. జులై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందిస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే ఏపీ దశ, దిశ మారిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధాన కల నిజం చేశామని.. కృష్ణా డెల్టాలో కరవు ఛాయలను తరిమికొట్టామని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏపీలో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేశామని వెల్లడించారు.
కాటన్‌ ఆశయాలే పోలవరం నిర్మాణంలో మనకు స్ఫూర్తి కావాలలని మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని.. ఆనకట్ట, కాల్వ నిర్మాణం కేవలం ఐదేళ్లలోనే పూర్తిచేశారని పేర్కొన్నారు.  కాటన్‌ మానవతావాది అని కొనియాడారు.

Facebook
Twitter