భగవత్‌ ప్రేరణే బిజెపిలో చేర్చింది


ఇస్కాన్‌ పూర్వ ఆచార్యులు సత్యగోపీనాథ్‌ దాస్‌ ఇంటర్వ్యూ తాను ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి రాజకీయ క్షేత్రంలోకి రావడానికి, అందుకు వేదికగా భారతీయజనతాపార్టీని ఎంచుకోవడానికి భగవత్‌ ప్రేరణే కారణమని ఇస్కాన్‌ పూర్వ ఆచార్యులు సత్యగోపీనాథ్‌ దాస్‌ అన్నారు. ఇస్కాన్‌లో బాధ్యతకు రాజీనామా చేసిన గోపీనాథ్‌ దాస్‌ బిజెపిలో చేరిన అనంతరం ‘ఇరా న్యూస్‌’తో మాట్లాడుతూ స్వచ్ఛమైన, నిష్కల్మషమైన రాజకీయాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల ప్రక్షాళన జరగాంటే రాజకీయరంగంలోకి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన, విలువలు పాటించే వ్యక్తులు రావడం తప్ప మరోదారి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరితో నమస్కారాలు అందుకునే ఆధ్యాత్మిక రంగాన్ని విడిచిపెట్టి విమర్శలు, ఆరోపణలకు నిలయమైన రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో స్పందించారు. సద్బుద్ధి, సత్‌ప్రవర్తన కలిగిన వారందరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ... రాజకీయాలు పాడైపోతున్నాయని అనుకోవడం నిరర్థకమని చెప్పారు. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టకపోతే పరిస్థితి ఎలా మారుతుందని ప్రశ్నించారు. మంచివారు మౌనంగా ఉండిపోవడం, ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వన రాజకీయాల్లో ఎక్కువమంది అవినీతిపరులు, స్వార్థపరులు కనిపిస్తున్నారన్నారు. అంతమాత్రం చేత రాజకీయాల్లో అందరూ అవినీతిపరులు కాదని, ఆ రంగం చెడ్డవారికి మాత్రమే పరిమితం కాదని అంటూ రాజకీయ నాయకుల్లోనూ చాలామంది గొప్పవారు ఉన్నారన్నారు. అందరు నాయకులనూ ఒకే గాటన కట్టడం వివేకం అనిపించుకోదని చెప్పారు. సమాజంలో మార్పుతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అయితే ఆ సమాజం మనకంటే వేరుగా ఎక్కడో లేదని, చుట్టూ ఉన్న వ్యక్తుల సమూహమే సమాజం కనుక ఆ వ్యక్తుల్లో మార్పు తేవడమే నిజమైన సామాజిక సంస్కరణ అని భావించారు. బిజెపి పట్ల రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్న ఈ తరుణంలో మీరు బిజెపిలో చేరడం వెనుక ఉద్దేశం ఏమిటి అని అడిగితే, సత్యం ఎప్పటికైనా జయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రజల్లో వివిధ పరిస్థితుల కారణంగా అపోహలు, అసత్యాలు ప్రచారంలో ఉన్నమాట నిజమేనని, అయితే ఈ పరిస్థితి తప్పక మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక దుష్ప్రచారాల కారణంగా ప్రజలు ఇవాళ బిజెపి విషయంలో పెంచుకున్న అనుమానాలు త్వరలో పటాపంచలు కాక తప్పదన్నారు. ఈ ధీమాకు కారణం, ప్రాతిపదిక ఏమిటని అడిగితే... ఒక్కడ్ని కొన్ని సార్లు మోసగించవచ్చు... అందరినీ ఒక్కసారి మోసం చేయవచ్చు... కానీ అందరినీ ఎల్లవేళలా మోసం చేయలేరనే నానుడిని గుర్తు చేస్తూ... త్వరలోనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సమయ సందర్భాలను బట్టి, సమన్వయంతో మెలుగుతూ, ప్రజకు వాస్తవాలను చెప్పగలిగితే ఒకనాటికి అందరికీ తప్పక అర్థమవుతుందని తెలిపారు. విషయం అర్థం కానంతవరకూ ఊహాగానాలే రాజ్యమేలుతాయని, కానీ నిజం తెలిసాకా వాటి ప్రభావం ఏమాత్రం పనిచేయదని స్పష్టం చేశారు. రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే పిలుపు లేదా సలహా ఏమిటి అని అడిగితే... ప్రజలు తమ ఓటు విలువను ముందు తెలుసుకోవాలన్నారు. నాయకుడికంటే, పార్టీ కంటే ఓటు విలువైనదని, అది దేశభవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలుసుకుంటే ఓటర్ల దృక్పథం మారుతుందన్నారు. దేశసేవాదృక్పథం, నిజాయితీ, నిస్వార్థ తత్పరత ఉన్నవారిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందన్నారు. స్వచ్ఛరాజకీయాల కోసం కొన్నివర్గాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. అటువంటి వారు నిజాలు చెబితే తప్పక అర్థం చేసుకొని ఆదరిస్తారని ధీమాగా చెప్పారు. దేశాభ్యుదయం కోసం త్యాగనిరతితో పాటుపడుతున్న నరేంద్రమోదీ నాయకత్వం, పాలనావిధానాలు తనను ప్రభావితం చేశాయన్నారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం తగిన సహకారం అందజేయడంలేదనే ఆరోపణలు నిరాధారమని సత్యగోపీనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు. దీనిపై నిర్మాణాత్మక విధానంలో, ప్రభావవంతంగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బిజెపిపై ఉందన్నారు. తాను ప్రజలకు ఈ వాస్తవాలను వివరించి, బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా నిర్మాణాత్మక కృషి సాగిస్తానని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీలో తన పాత్ర ఎలా ఉండబోతున్నదనే ప్రశ్నకు స్పందిస్తూ అది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజకు మరింత అందుబాటులో ఉండాలని, మరింత మెరుగైన సేవలు అందించాలని మాత్రమే తాను రాజకీయరంగ ప్రవేశం చేశానని అన్నారు. ఎమ్మెల్యే, లేదా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఏదీ ఆలోచించలేదని, అటువంటి అంచనాతోగాని, పదవులపై ఆశతో కాని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. పార్టీ ఆదేశానుసారం, ప్రజల అభీష్టానుసారం నడుచుకుంటానని చెప్పారు. ఉన్నత వ్యక్తిత్వం, నైతిక విలువలు, నీతినిజాయితీలు కలిగిన స్వచ్ఛమైన వ్యక్తులు రాజకీయ రంగంలోకి వస్తే ప్రజలు తప్పక ఆదరిస్తారని తాను నమ్ముతున్నానన్నారు. పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా త్రికరణశుద్ధిగా చేపట్టి, రాష్ట్రప్రజల సంక్షేమంకోసం పాటుపడతానన్నారు. పార్టీలోకి తన రాకను స్వాగతించడానికి ప్రత్యేకంగావచ్చిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర రాష్ట్ర నేతలకు, ప్రముఖులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యాంశాలు