ఎన్డీఏ ను చీల్చడమే బాబు అసలు వ్యూహం


చంద్రబాబు కాంగ్రెస్ లో కలిసిపోయాడు... ఊరూరూ తిరుగుతూ అని పార్టీల నాయకులకీ శాలువాలు కప్పి సంబరపడుతున్నాడని అనుకుంటే పొరపాటే. బాబు స్కెచ్ చాలా విస్తృతమైనది. బిజెపి పైన, మోదీ పైన వ్యక్తిగతంగా కూడా అక్కసు పెంచేసుకున్న బాబు ఇప్పుడు మూడంచెల వ్యూహంలో పని చేస్తున్నారు. ఒకటి రాష్ట్రంలో తాను గెలవడం, రెండు కేంద్రంలో బిజెపి ఓడిపోయేలా చేయడం.. మూడు ఫలితాల తర్వాత తాను చక్రం తిప్పడం! భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరుగుతున్న చంద్రబాబు మదిలో పెద్ద వ్యూహమే ఉంది. జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తేవాలి అని ఆయన యోచిస్తున్నారు. ముఖ్యంగా బిజెపికి పెద్ద దన్నుగా ఉన్న ఏన్‌డీఏలో చీలికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ఇప్పటికే బాబు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల నేతలతో రానున్న రోజుల్లో పలు దఫాలు చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22 తరువాత బాబు ఈ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తారని టీడీపీ నేత ఒకరు తెలిపారు. చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై పర్యటనాలు జరిపి సుమారు 15 రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇవన్నీ బిజెపి వ్యతిరేక పక్షాలే అయినప్పటికీ వీటన్నిటినీ ఒకే తాటిపైకి తేవడం బాబు ఉద్దేశం. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఈ వర్గాలన్నీ ఉమ్మడి నాయకత్వం దిశగా పయనించేందుకు బాబు మద్దతు కూడగట్టగలిగారు. యూపీఏలో ఉన్న మరికొన్ని పార్టీలు కూడా బిజెపిపై వ్యతిరేకతతో ఉన్నా వారు కాంగ్రెస్ ఆధిక్యతను అంగీకరించే పరిస్థితిలో లేరు. వీటన్నిటినీ కూడా బాబు ఇపుడు టచ్ లోకి తీసుకుంటున్నారు. ఇదొక ఎత్తయితే ఇపుడు బాబు కన్ను ఎన్‌డీఏ కూటమిలోని పార్టీలపై కూడా పడింది. కొన్ని పార్టీలను కూటమి నుంచి బయటకు తీసుకువచ్చి బిజెపిని బలహీనపరచాలని ఎత్తు వేశారని భోగట్టా. తన చొరవ, ప్రయత్నాలక ఫలితంగా బిజెపి వ్యతిరేక కూటమిలోకి వచ్చే వారితో బాబు ఒక ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్గం కూడా కొత్తగా ఏర్పడే కూటమిలో భాగస్వామి అవుతుందని అంటున్నారు. ఒకవేళ హంగ్ పార్లమెంట్ వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు తెదేపా తరఫున ఈ కూటమిని అడ్డు పెట్టుకొని చక్రం తిప్పాలనేది ఆయన మనసులో ఉన్న అసలు ఆలోచన. ఎన్‌డీఏలో ప్రస్తుతం 45 పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. వాటిలో 11 పార్టీలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఇప్పటికే రెండు పార్టీల నేతలను బాబు దువ్వారని తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు బాబుతో చర్చించారని, కొత్త కూటమిలో చేరడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు మరిన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 20న నెల్లూరు, 27న విజయనగరంలో సభలు నిర్వహించనున్నారు. అనంతపురంలో సభ నిర్వహిస్తారని చెబుతున్నారు. అమరావతిలో డిసెంబర్ 22న ధర్మ పోరాట దీక్ష చేపట్టి ఆ దీక్షకు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను పిలుద్దామని బాబు పార్టీ నేతలకు చెప్పారు. అదేరోజు కొత్త కూటమిలో భాగస్వాములయ్యే పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తారని భోగట్టా. ఇదిలా ఉంటే తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసిన సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌తో సైతం చంద్రబాబు మాట్లాడారట. ఇందుకోసం తన బావమరిది బాలక్రిష్ణ సహాయాన్ని కూడా తీసుకున్నారని వినిపిస్తోంది. డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఎన్డీయేలో చీలిక తేవాలన్న బాబు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఎన్ డి ఏ ని చీల్చడం వలన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమని బాబు నమ్ముతున్నారు. అలాగే అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండే కొన్ని పార్టీలను తన గ్రిప్ లో పెట్టుకోవడం ద్వారా.. ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త గేమ్ ఆడాలని ఆయన ప్రణాళిక! చూడాలి మరి బాబు ప్రయాస ఎంతవరకూ సఫలమవుతుందో.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం