మాతృభూమిపై ప్రేమతో ఐదు దశాబ్దాల పో(ఆ)రాటం!

దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ సన్నివేశం ఆ తర్వాతి పరిణామాలు ఒక అతి సాధారణ వ్యక్తిలో మాతృదేశంపై ఉన్న ప్రేమావేశాన్ని చెబుతాయి. భారత్, పాక్ ఇంకా విడిపోని క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా ప్రాంతంలో ఓ పేదకుటుంబంలో జన్మించిన నందకిశోర్ ఒక సామాన్యుడు. కానీ దేశంపట్ల ఆపేక్షలో, భక్తిలో అతడు ఆదర్శప్రాయుడే! కుటుంబం గడవడం కష్టం కావడంతో నందకిశోర్‌ను ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన తల్లి ఓ ఇంట్లో పని కోసం 1946 సంవత్సరంలో కరాచీ (అప్పటికి భారత్‌లోనే ఉంది) పంపించారు. అప్పుడు ఆయన వయసు 8ఏళ్లు. నందకిశోర్ అక్కడికి వెళ్లిన ఏడాది తర్వాత భారత్, పాక్ విడిపోయాయి. నందకిశోర్ కరాచీలో పని చేస్తున్నప్పుడు అతడి యజమానులు పేరును హస్మత్ అలీగా మార్చి పాకిస్థాన్ పౌరసత్వం ఇప్పించారు. అయితే నందకిషోర్ పేరు.. పౌరసత్వం పాకిస్థాన్ కి మారిపోయినా... అతడి హృదయం ఇక్కడే ఇండియాలోనే ఉంది. 19ఏళ్ల తర్వాత పాకిస్థానీ పాస్పోర్టుతో, హస్మత్ పేరుతోనే నందకిశోర్ భారత్ కి తిరిగొచ్చారు. వీసా గడువు పూర్తయిన పిదప 1974 నుంచి 1998 మధ్య ఏడాదికోసారి దానిని పొడిగిస్తూ ఇక్కడే ఉన్నారు... ఆ సమయంలోనే ఇక్కడి మహిళను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దేవరియా (ఉత్తరాఖండ్) లోనే నివసిస్తున్నారు. అయితే 1998 తర్వాత వీసా గడువు పొడిగించేందుకు నిబంధనలు అడ్డుపడ్డాయి. ఇక పొడిగింపు సాధ్యం కాదని అతడు దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. ఒకసారి అట్టారీ సరిహద్దు దాకా దిగబెట్టారు కూడా. కానీ అప్పటి విదేశాంగ మంత్రి చొరవతో నందకిషోర్ అలియాస్ హస్మత్ తిరిగి వెనక్కివచ్చారు. 2000 సంవత్సరంలో మరోసారి ఆయనను వెళ్లిపోవాలని గట్టిగా ఆదేశించారు. ఆ తర్వాత మానవతా దృక్పథం కింద ఆ ఆదేశాలను ఆపుచేసారు. 2008లో ఆయన కేసు ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. ప్రస్తుతం దీనిపై చర్చలు సాగుతున్నాయి. నందకిశోర్ వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలు. తనకు పాకిస్థాన్ వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని.. హిందుస్థానే తన మాతృభూమి అని చెబుతున్నారు. తన జీవితం యాభై ఏళ్లకు పైగా భారత గడ్డ పైనే గడిచినదని ... ఇపుడు తాను భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నానని ఈ వృద్ధుడు పేర్కొంటున్నారు. హిందుస్థాన్ నా స్వదేశం... ఇక్కడే నాకు సౌకర్యంగా, సుభద్రంగా ఉంటుందని అంటున్నారు! విదేశీ పౌరసత్వం తో స్వదేశంలో అడుగుపెట్టిన ఇతడిని... పదేపదే చట్టం వెళ్లిపొమ్మంటున్నా ఆయన ఇక్కడే నివసించడానికి పోరాడుతున్నాడు... తాను భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నాడు.