హీరో.. ఎంపీ... అయినా ఇదేం కక్కుర్తి?!


బిచ్చగాడు సినిమాలో హీరో ఆడి కార్ ఓనర్ తో చెప్పే డైలాగులు గుర్తున్నాయిగా! కేవలం మూడు లక్షలు కలిసొస్తుందని పాండిచ్చేరి లో కారు కొని మరో రాష్ట్రంలో తిరుగుతున్నావు.. నువ్వు రాయల్ ఫ్యామిలీనా? అని ఆడుకున్న సీన్ అది..! థియేటర్ లో క్లాప్స్ కొట్టించిన ఆ సీన్ మర్చిపోలేం! అయితే అలాంటి బోగస్ రాయల్స్ చాలామందే ఉన్నారు. కార్లు కొట్టారు కానీ.. పన్నుల విషయంలో కక్కుర్తి పడే నైజం వీరిది. వారిలో సినిమా హీరోయిన్ అమలాపాల్, ప్రముఖ హీరో, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి ఇంకా మలయాళ దర్శకుడు ఫాసిల్ కూడా ఉన్నారు. తాజాగా ఈ అక్రమ వ్యవహారంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నటుడు సురేష్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. పుదుచ్చేరిలో నివాసం పేరిట తప్పుడు ధృవపత్రాలతో తన కారును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించు కున్నట్లు సురేష్‌ గోపిపై ఆరోపణలు వచ్చాయి. అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా ఆయనగారు ఏకంగా రూ. 30 లక్షల మేర పన్ను ఎగ్గొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. తిరువనంతపురం కోర్టు ఆయనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. అరెస్ట్‌కు మూడువారాల గడువునిస్తూ విచారణకు సహకరించాల్సిందిగా సూచించింది. సోమవారం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, రూ. లక్ష బాండ్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో సురేష్‌ గోపికి బెయిల్ లభించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీకి సురేష్ గోపీ స్టార్ క్యాంపైనర్. అవినీతికి వ్యతిరేకంగా నూతన భారతాన్ని నిర్మించడానికి ఒకపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాటుపడుతుంటే.. ఇలాంటి కొన్ని చీడపురుగులా వలన వారికి వత్తాసు పలికే బిజెపి నాయకుల వలన మొత్తం పార్టీకి చెడ్డపేరు వస్తోంది. ఈ విషయం లో బిజెపి దృష్టి సారించి పార్టీ నాయకులూ, మద్దతుదారుల్లో అవినీతి, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముఖ్యాంశాలు