భాగవతుల వీనుల తేనె.. వృత్రాసుర వీరవాణి


(ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో 14వ రోజు ప్రసంగం)

దేవ దానవ సమరం.. దేవేంద్రునిచే వృత్రాసుర సంహార ఘట్టం సభికుల్లో కదనోత్సాహాన్నికాక... విష్ణు భక్తి సుధారసాన్ని ఒలికించిన విలక్షణ సన్నివేశం శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞ ప్రాంగణంలో గురువారం రాత్రి మహాద్విగ్నభరితంగా ఆవిష్కృతం అయింది. భాగవత మోక్ష శాస్త్రాన్ని సమగ్ర పరిశీలన దృక్పథంతో భక్తజన తారకంగా.. సాధు సాధకులకు ప్రయోజనకర పాఠ్యాంశంగా.. భక్తిశాస్త్రంగా సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ బోధిస్తున్నారు. ఆయన ఈ వృత్రాసుర సంహార ఘట్టాన్ని ముందెన్నడూ.. పండితులు చూడని.. పరిశీలించని కోణం నుంచి ఆవిష్కరించారు. సాధారణంగా రాక్షసులు శివభక్తులవుతారు... వారు విష్ణువుపై కక్షబూని దేవతలతో యుద్ధాలు చేస్తారు..! కానీ ఈ వృత్రాసుర ఇంద్ర సమరం తీరే వేరు. వృత్రుడు పరమ వైష్ణవుడు. మహా విష్ణు భక్తుడు. ఇక ఇంద్రుడు ఆ విష్ణువునే ఆశ్రయించి ఆ మహాత్ముని ఆనతి మేరకే వజ్రాయుధాన్ని చేకొని యుద్ధానికి వచ్చినవాడు! ఈ అద్భుతమైన, అరుదైన ఘట్టం శ్రీమద్భాగవతంలో చాలా ప్రసిద్ధమని, పట్టుకోవలసిన అంశమని చెప్పిన సామవేదం వారు వృత్రాసుర ఆవిర్భావం నుంచి ముక్తి వరకూ ఇలా వివరించారు. ఇంద్ర వృత్రాసుర మహాయుధ్ధ సందర్భంగా సాగిన సంవాదమే వృత్రాసుర వీరవాణి గా ప్రసిద్ధి పొందినదని చెప్పారు. ఈ ప్రవచనంలో త్వష్ట ప్రజాపతి చేసిన హోమం, వృత్రాసుర జననం, మహావిష్ణువుకు ఇంద్రాదుల మొర, దధీచి త్యాగం, ఇంద్ర వృత్రాసురుల యుద్ధం, వృత్రాసురుని మరణం, వృత్రాసుర పూర్వజన్మలు, దేవదానవులపై విష్ణువు అనుగ్రహ ఆగ్రహాల ఆంతర్యం.. ఇత్యాది విషయాల వివరణగా సాగింది. అదంతా ఒక సంక్షిప్త కథా రూపంలో...

విశ్వరూపుడిని ఇంద్రుడు సంహరించగా.. అతడికి బ్రహ్మహత్యా పాతకం రావడం.. దానిని నది, చెట్టు, భూమి స్త్రీ పంచుకొని ఇంద్రుడిని దోషరహితుడ్ని చేయడం జరిగాయి. విశ్వరూప వధ అతడి తండ్రి త్వష్ట ప్రజాపతికి ఆగ్రహం కలిగించినా... ఇంద్రుడు చేసింది ధర్మమే కావడంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ పుత్రశోకానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం అభిచార హోమం చేసాడు. ఇంద్రుడిని చంపగల వరపుత్రుడు కావాలని అతడు సంకల్పించగా.. ఈశ్వర సంకల్పానుసారం వేదమంత్రాల స్వరం మారిపోయి.. ఇంద్రుని చేత మరణించే వాడు దక్షిణాగ్ని నుంచి ఆవిర్భవించాడు. అతడే వృత్రాసురుడు. యితడు మహా విష్ణు భక్తుడు. అయితే ఇతడి పుట్టుకే ఇంద్రునితో వైరం కోసం కావడంతో సర్వ శక్తులూ సముపార్జించుకొని ఇంద్రునిపై దండయాత్రకు సిద్దమయ్యాడు. అపుడు ఇంద్రాది దేవతలు భగవానుడైన శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. ఈ సందర్భంగా ఇంద్రాదులు చేసిన విష్ణు స్తుతి అత్యద్భుత అర్థాలను ఇముడ్చుకొన్నదని సద్గురువులు తెలిపారు. ఆ సమయాన మహావిష్ణువు శంఖుచక్ర గదాపద్మధారియై శ్రీవత్స కౌస్తుభాలతో ప్రకాశిస్తూ ఉండగా.. చుట్టూ పదహారుమంది సారూప్య మూర్తులు శోభిస్తూ ఉండగా.. ఇంద్రాదులు అద్భుత స్తుతి చేసారు. పురుహూత, యజ్ఞ వీర్య, అపరిమిత గుణగణనే, అనవగాహ్య మాహాత్మ్యే, వయసే, ఉపరత సమస్త మాయామయే కేవలే, నితరాం, నిరంతరామ్. హంస ఇత్యాది నామాలతో అమరిన ఈ స్తుతి విశేషాలను.. ఇందలి వైదిక అంతరార్థాలను సామవేదం వివరించారు. సత్ చిత్, నిర్వికార, నిర్వికల్ప స్వరూపమైన శుద్ధ మహావిష్ణు స్వరూపం మొదటిది కాగా.. రెండవది తటస్థ స్వరూపంగా జగత్తుని పట్టుకొని ఉండే విష్ణువు నిత్యా లీలా స్వరూపం అని, లీలాస్వరూపంగా ప్రకటితమయ్యే అవతార వైభవం విష్ణువు మూడవ ప్రకటిత రూపమని.. ఇలా ఈ మూడు విధాలుగా విష్ణు స్తుతి చేయడమే సముచితమని చెప్పారు. పరమాత్మను నిజంగా కోరవలసినది పరమాత్మనే తప్ప అన్యం కాదని తెలుసుకోవడమే అత్యున్నత స్థాయి అన్నారు. దీనిని వైదిక పరిభాషలో ఏకాంత భక్తి అంటారన్నారు. అలా స్వామినే కోరినవారు ఆ సత్ చిత్ స్వరూపమే అవుతున్నారని... అదే సారూప్య మూర్తుల అంతరార్థమని వెల్లడించారు. ఇహసుఖాలను అడిగితే భగవానుడు తన మాయనుంచే ఇస్తాడని... అదే విష్ణు మాయ అని... దానిని తెలుసుకొని ఆ వలయాన్ని దాటి వెళ్లగలగడమే మాయని దాటి ముక్తి పొందడమని పేర్కొన్నారు. జన్మల బాటలో గమ్యం తెలియని నడకతో అలసి సొలసిన భవపాంథుల నడకను అంతంలో ఆపేవాడని ఇంద్రాదులు ఇక్కడ స్తుతించాడని.. ఇక్కడ అంతం అంటే జన్మాంతం కాదని...మోహాంతం లేదా అజ్ఞానాంతం అని గ్రహించాలని ఉపదేశించారు. ఈ స్తుతి వలన ఆత్మస్వరూపుడిని అనే స్మృతి జీవుడికి కలిగి ఆ జ్ఞానం స్థిరంగా ఉంటుందని... భక్తి ఉదయిస్తుందని ఈ స్తుతికి శుక మహర్షి ఫలశ్రుతి చెప్పాడన్నారు.

ఈ స్తుతికి ప్రసన్నుడైన మహావిష్ణువు దేవతల అభీష్టాన్ని గ్రహించిన వాడై.. దధీచి మహర్షి ఎముకలతో చేసిన ఆయుధం మాత్రమే వృత్రాసురుని సంహరించగలదని చెప్పాడన్నారు. ఆ మహర్షిని ఆశ్రయించమని ఉపదేశించగా.. దేవతలంతా దధీచి వద్దకు వెళ్లారు. ఈ మహర్షి అంగిరసుడే అని... అధర్వ వేదం స్వరూపమని .. మంత్ర ద్రష్ట అని చెప్పబడిందన్నారు. విద్య వ్రత తపస్సారం గాత్రం.. కావున దధీచి శరీరం ఇందుకు అర్హమని చెప్పడంలో అంతరార్థం... మంత్ర తప వ్రత సాధనల ఫలితంగా దధీచి శరీరం మంత్రమయంగా మారిపోయిందని చెప్పడమే అని సామవేదం వివరణ ఇచ్చారు. పాత్రలో పాలు పోస్తే పాలు.. తారు పోస్తే తారు ఎలా నిండుతాయో అలాగే సాధన చేసిన మంత్రం గాత్రం(శరీరం) అంతా నిండిపోతుందని చెప్పారు. ఇక్కడే మరో విశేషాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంద్రుడు లోగడ విశ్వరూపుని ద్వారా నారాయణ కవచాన్ని ఉపదేశం పొంది ఆ ప్రభావంతో రాక్షసులపై జయం సాధించాడు. అయితే ఆ నారాయణ కవచ ద్రష్ట ఈ దధీచి మహర్షే. దధీచి ద్వారా త్వష్ట ప్రజాపతి నారాయణ కవచాన్ని పొంది.. దానిని తన కుమారుడు విశ్వరూపునికి ఉపదేశించగా ... దానిని అతడి ద్వారా ఇంద్రుడు గ్రహించాడు. ఇప్పుడు ఆ నారాయణ కవచ ఉపాసన, సాధన ఫలితంగా ఆ మంత్ర ద్రష్ట అయిన ఋషి దధీచి అనుగ్రహాన్ని ఇంద్రుడు పొందబోతున్నాడు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చని వివరించారు. దేవతలు దధీచిని శరీరత్యాగం చేసి అస్థికలు ఇవ్వవలసిందిగా అర్థించారు. అప్పుడు దధీచి..కోరి తీవ్ర మరణయాతనను ఎవరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా ఇంద్రాదులు జవాబిస్తూ.. దేహ తాదాత్మ్యత ఉన్నవారు ఈ పని చేయలేరని.. అయితే పరమాత్మపై స్థిర భక్తి కలిగిన మీకు దేహ భ్రాంతి ఉండునా! అన్నారు. ఈ ధర్మ వచనాలు మీనుంచి వినాలనే అలా అన్నాను నాయనా... అని చెప్పి, ఎప్పుడో అప్పుడు వదలాల్సిన ఈ దేహాన్ని ఇప్పుడు మీ ప్రీతి కోసం వదిలిపెడతానని దధీచి అంగీకరించాడన్నారు. అధృవమైన దేహం తో ధృవమైన ధర్మ కార్యం చేసే అవకాశం రావడం నారాయణుడి అనుగ్రహమని తెలిపాడన్నారు. ధనాన్ని, బంధువుల్ని, దేహాన్ని కూడబెట్టుకోవడం అల్పుల పని అని తెలిపిన దధీచి దేహం తనది కాదనే స్పృహతో.. సాక్షిమాత్రునిగా ఆ అస్థికల సేకరణను చూస్తూ... దేహాన్ని విడిచిపెట్టేసాడు. ఆ ఎముకలతో విశ్వకర్మ అద్భుతమైన వజ్రాయుధాన్ని తయారు చేసాడు. ఆ ఆయుధంతో యిడఁరుడు వృత్రాసురుని యుద్ధంలో ఎదుర్కొన్నాడు.. ఈ యుద్ధం మొదటి మహాయుగంలోని త్రేతాయుగంలో నర్మదా తీరంలో జరిగిందని శుకమహర్షి తెలిపాడన్నారు. ఈ యుద్ధం అద్వితీయంగా జరిగిందని.. ఇందు జరిగిన సంవాదం వృత్రాసురుని అనితర విష్ణు భక్తికి నిదర్శనమని సామవేదం సూత్రీకరించారు. యుద్ధంలో మొదట ఇంద్రుడు గదను విసురుతాడు.. దానిని ఒడిసి పట్టి విసిరేసిన వృత్రాసురుడు అంటాడు గదా... ఇంద్రా.. ఈ గదా నీ జన్మ సంబంధమైనది. దీనితో నేను చావను. దధీచి మహర్షి తపఃఫలంగా, నారాయణుడి అనుగ్రహంగా నీవు తెచ్చుకున్న ఆ వజ్రాయుధంతో రా... ! విష్ణువు అనుగ్రహం ఉన్న నీదే ఈ యుద్ధంలో విజయం.. ఆ స్వామి రక్షణలో ఉన్నవాడికి ఓటమి ఉండదన్నాడు. విష్ణువు రక్షణలో ఉన్నవాడిని ఎవరూ ఏమీచేయలేరని.. విజయం, సంపద, సద్గుణం విష్ణు పరివారానికి ఉంటాయని వృత్రుడు చెబుతాడన్నారు. ఇంతటి విష్ణు భక్తి హృదయంలో ఉన్నా.. విజయం ఇంద్రుడిదే అని తానే చెబుతున్నా కూడా స్వధర్మం ప్రకారం (దేహ సృజనే ఇంద్రుడితో యుద్ధానికి కాబట్టి) భీకర యుద్ధం చేశాడన్నారు. యోగసిద్ధి, అధికారం, స్వర్గాధిపత్యం, బ్రహ్మపదవి, మోక్షం కూడా వలదని... నీవే కావాలని వృత్రుడు పరమాత్మను వేడుకుంటాడని.. ఇది అతడి శుద్ధ భక్తిని తెలుపుతుందని సామవేదం వెల్లడించారు. తల్లి కోసం గూడులో ఎదురుచూసే గువ్వకూనల్లా... ప్రియ సమాగమానికి ఆర్తితో ఎదురు చూసే విరహితలా.. మాతృమూర్తి స్తన్యానికి వెదుకులాడే పసికందులా తీవ్రమైన విష్ణు విరహంతో వృత్రుడు తహతహలాడడం.. తనను దరి చేర్చుకోమని వేడుకోవడం ఇందలి విశేషమన్నారు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రుడి కుడి చేతిని ఖండించగా. ఎడమచేతితో కొట్టగా ఆ వజ్రాయుధం కిందపడిపోతుంది. అప్పుడు .. ఇంద్రా వజ్రాయుధం తీసుకో. నారాయణ పక్షం నీది. నీవు గెలవాలి.. అలాగని నేను యుద్ధం ఆపను.. ఇది నా స్వధర్మం అని చెప్పాడన్నారు. వృత్రుడి కర్మ విధానాన్ని, భక్తి భావనను సామవేదం వారు భగవద్గీతతో సమన్వయించిన తీరు ఆకట్టుకుంది. ఇక్కడ విజయం, అపజయం రెండూ ప్రధానం కాదని కర్మ ఫలాన్ని భగవంతుడు ఇచ్చే విధానమే కాలం అని వృత్రుడు చెబుతాడన్నారు. ఒకపక్క స్వధర్మాన్ని పాటిస్తూ మరోపక్క పరమాత్మపై పరిపూర్ణ భక్తి విశ్వాసాలను ప్రకటించిన వృత్రుడికి ఇంద్రుడు మనసారా నమస్కరించాడని.. మాయను జయించిన ఇతడు మహాపురుషుడే తప్ప అసురుడు కాదని శ్లాఘించాడని పేర్కొన్నారు. భగవన్నామ కృపాసాగరంలో ఈదులాడే వాడికి స్వర్గమనే చిన్న ఉపాధి సముద్రం ముందు నీటిగుంతలాగే కనిపిస్తుందని అన్నారు. నిజమైన భక్తుడు అమిత స్వార్థపరుడని.. అల్పమైన, అశాశ్వత సుఖాలు వదిలి... శాశ్వతమైన మహాసుఖాన్ని అతడు పొందుతాడని ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం చమత్కరించారు.

నారాయణ భక్తిని వర్ధిల్ల జేసి, పాపాన్ని నశింప జేయడమే గాక, సంపదలను పెంచుతుందని ఈ కథకు ఫలశ్రుతి చెప్పారు. కాగా వృత్రుడు పూర్వజన్మలను సూతుడు వివరిస్తూ అతడు ఒకజన్మలో చిత్రకేతువనే రాజు కాగా అతడి ఒక భార్య పేరు కృతద్యుతి అన్నారు. సంతానం లేని ఆ రాజు ఒక యజ్ఞం చేసి అంగీరస మహర్షి కృపతో ఒక పుత్రుడిని పొందాడు. అయితే సవతులు అసూయతో ఈ బాలుడ్ని చంపేయడంతో ఆ రాజదంపతులు విషాదంలో పడి దీనులయ్యారు. అంగీరసుడు, నారదుడు అక్కడికి వస్తారు. పుత్రవ్యామోహంతో విచలితుడైన మహారాజుకి ఐహిక బంధాల అశాశ్వతను తెలియజేయడం కోసం.. మహర్షి తన మాయతో ఆ బాలుడి శరీరం నుంచి వెలికిపోయిన సూక్ష్మ శరీరాన్ని దర్షింపజేస్తారు. నాయన.. మీ అమ్మ, నాన్న నీకోసం బెంగటిల్లుతున్నారు.. కావున నీవు తిరిగి నీ శరీరంలో ప్రవేశించే ఏరాటు చేస్తాను.. రమ్మని మహర్షి పిలుస్తాడు. అప్పుడా జీవుడు ఏ జన్మలో వీళ్ళు నాకు అమ్మ, నాన్న? అని అడుగుతాడు. చేతులు మారిన బంగారం లాగే నేను ఎవరికీ చెందను అని చెబుతాడా జీవుడు. ప్రారబ్ధం ఈ దేహంతో పోయిందని.. తనను మళ్ళీ ఆ మోహంలో పడవేయవద్దని మహర్షిని జీవుడు కోరగా విన్న రాజు అజ్ఞానం నశిస్తుంది. తనకు తరించే ఉపాయం చెప్పమని మహర్షి కాళ్లపై పడతాడు రాజు. అప్పుడు మహర్షి అతడికి సంకర్షణ యోగాన్ని ఉపదేశిస్తాడు. ఆ యోగాన్ని సాధన చేసిన రాజు జన్మాంతం తర్వాత విద్యాధర మహారాజుగా జన్మిస్తాడు. నారాయణ నామ సంకీర్తనతో.. ధార్మిక పరిపాలనతో ఆ రాజు అందరిమన్ననలూ అందుకుంటున్నాడు. ఒకసారి తన విమానంలో అతడు హిమాలయాల మీదుగా వెళుతూ కైలాస శిఖరంపై శివపార్వతులను చూస్తాడు. మహర్షి సమూహం మధ్య ఉన్న శివుడు పార్వతీ దేవిని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్న దృశ్యం చుసిన ఈ విద్యాధరుడు.. శివుడ్ని కాముకుడని నిందిస్తాడు. ఈ నిందను శివుడు ఏమీ పట్టించుకోకపోయినా పార్వతీదేవి కోపిస్తుంది. మహాత్ములను పరిహసించే ఇట్టివాడు నారాయణ భక్తుడు కాలేడని... అసుర సమానుడని.. ఇతడికి నారాయణ పదాలు దక్కవని శపిస్తుంది. విష్ణుభక్తి పేరుతో శివనింద చేసే అల్పులకు ఇది గుణపాఠమని ఈ సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. పార్వతీదేవి శాపవచనలు విన్నంతనే విద్యాధరుడు తన తప్పు తెలుసుకొని ఆమె కాళ్లపై పడి క్షమార్పణ కోరుకుంటాడు. కానీ శాప విమోచనాన్ని అతడు కోరలేదు.. ఎందుకంటే తాను చేసిన తప్పు అతడు తెలుసుకున్నాడు. అందుకే ఈజన్మలో అతడు అసురునిగా జన్మించాడు. కానీ అనుస్మృతి కారణంగా జీవసంస్కారంలో విష్ణుభక్తి అలా అనుసరించింది. అసుర వృత్తి దేహం.. అంతఃశుద్ధి లో భక్తి ఉన్నందున అతడు తరించాడని తెలిపారు.