హై టెక్ తరహాలో మై టెక్ సిటీ అభివృద్ధి


హైదరాబాద్‌లో ఐటీ ప్రాంతం హైటెక్‌ సిటీ... అలాగే మంగళగిరిలో మైటెక్‌ సిటీగా ఐటీ అభివృద్ధికి ప్రణాళిక వేసి, మంగళగిరిని మైటెక్‌ సిటీగా తీర్చిదిద్దే పనుల్ని ప్రభుత్వం ప్రారంభించింది. మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కులో 13, ఆటోనగర్‌ ఐటీ పార్కులో 3 వెరసి 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి నారా లోకేష్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. వీటి ఏర్పాటుతో ఇప్పటికిపుడు 600 మందికి ఉద్యోగాలు వస్తాయని, మరో ఏడాదిలో ఇంకో 1600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఐటి పార్కులో ఇప్పటికే పని చేస్తున్న మూడు ఐటీ కంపెనీలలో 500 మంది పని చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు రవాణా సేవలకు ఐటీ పార్కు వద్ద బస్‌స్టాప్‌ ఏర్పాటు చేసారు. ఇక్కడ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం నిరంతరం గస్తీ తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, ఐటీ సంస్థల్లో శిక్షణకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి అపార్టుమెంట్లలో హాస్టల్‌ వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఐటీలో పరిశోధన అభివృద్ధికి మరో భారీ సంస్థను కూడా రాజధానిలో ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు విద్యానగర్‌లో వేద ఐఐటీ పేరుతో ఏర్పాటు చేసే ఈ సంస్థలో వీఎల్‌ఎస్‌ఐ, చిప్‌ డిజైనింగ్‌ వంటి పరిశోధనలు జరుగుతాయి. ఐటీకి అనుబంధంగా స్టేట్‌ సాఫ్ట్‌ ఫైనాన్స్‌ కామర్స్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్‌లో దీన్ని నెలకొల్పుతున్నారు. ఐటీ సంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్‌ఆర్‌టీ మంగళగిరిలో ప్రభుత్వం సుమారు 2వేల మంది విద్యార్థులతో వర్క్‌షాపును నిర్వహిస్తోంది. ఐటీ అభివృద్ధి, శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఐటీ రిసెర్చ్‌, వెంచర్‌ క్యాపిటల్‌ వంటి అంశాలపై మంత్రి లోకేష్‌ తదితరులు ఇందులో విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేస్తారు.

ముఖ్యాంశాలు