చైనా నయవంచన... యుద్ధం తప్పదా?


చైనా అంటేనే నయవంచన... పైకి నవ్వుతూ మాట్లాడుతూనే పొడిచేయడం ఆ దేశానికి బాగా చేతనైన విద్య. అందుకే రక్షణ నిపుణులు ఏనాడో చెప్పారు.. ఎప్పటికైనా భారత్ సమస్యలు ఎదుర్కొనేది చైనాతోనే తప్ప పాకిస్థాన్ తో కూడా కాదని. తాజా పరిణామా లు చూస్తుంటే ఇదెంత నిజమో ఇట్టే అర్థం అవుతున్నది. ఈ పరిణామాల రీత్యా చైనాతో భారత్ కి మరో యుద్ధం తప్పేటట్టు కనిపించడం లేదు కూడా. ఎందుకంటే చైనాతో సర్దుకుపోవడం అంటే మన జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టాల్సి రావడమే అనిపిస్తున్నది. డోక్లాం అంశంలో 70 రోజుల తర్వాత వెనక్కి తగ్గిన చైనా ఆ తర్వాతా కుయుక్తులు ఆపడం లేదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమ తమ సరిహద్దులకు ఇరుదేశాల భద్రతాదళాలు వెళ్లిపోవాలి. అయితే ఒప్పందాన్ని గౌరవించి భారత సైనికులు మాత్రమే వెనక్కి వచ్చారు. తొలుత వెనక్కు వెళ్లిన చైనా సైనికులు మళ్ళీ ముందుకు వచ్చి డోక్లాం ఉత్తర ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుని తిష్ట వేశారని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారత ఆర్మీ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ డోక్లాం ఉత్తర ప్రాంతంలో చైనాదళాల సంచారంపై ఆందోళన వ్యక్తం చేసారు. దీనిని ఉపగ్రహ చిత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. డోక్లాం ఉత్తర ప్రాంతంలో చైనా భారీ నిర్మాణాలు జరుపుతున్న చిత్రాలను ఉపగ్రహం తీసింది. సిక్కిం, భూటాన్‌, చైనాల మధ్య ఉన్న ట్రైజంక్షన్‌లో భారత్‌-చైనా మధ్య 72 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు 2 వేలమంది చైనా సైనికులు ఉత్తర డోక్లాంప్రాంతంలో ఉన్నట్టు సమాచారం. 100 సైనికవాహనాల మోహరింపుతో పాటు భారీగా బంకర్లను నిర్మించినట్టు తెలుస్తోంది. నిఘాకు వీలుగా టవర్లను కూడా నిర్మించినట్టు మన సైనికాధికారులు చెబుతున్నారు. చైనా సైన్యం ఇక్కడ శాశ్వతంగా బస చేసేందుకు వీలుగా నిర్మాణాలు జరుగుతున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సైనిక వాహనాలను భారీగా తరలించడంతో పాటు నిఘా టవర్‌ను రెండంతస్తుల ఎత్తులో నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలు బహిర్గతం చేసాయి. ఈ టవర్ ద్వారా భారత్‌ వైపు ఉన్న లోయను చైనా బలగాలు నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. ఉత్తర డోక్లాం పీఠభూమిలో ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధం జరిగితే దీటుగా ఎదుర్కొని బలమైన ఎదురుదెబ్బ తీసేందుకు వీలుగా చైనా ఈ నిర్మాణాలు చేసింది. అన్నిటికంటే దారుణం... ఏడు హెలిపాడ్లను కూడా ఈ ప్రాంతంలో చైనా నిర్మించింది. ఇక ఈ తర్వాత చైనా సైన్యం చేసేది ఏమిటో తెలిసిందే... అదే రహదారి నిర్మాణం! రోడ్డు నిర్మించేందుకు వీలుగా ఒక ప్రణాళికను ఇప్పటికే చైనా రూపొందించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది డోక్లామ్ వద్ద పరిస్థితి. మరో పక్క సియాచిన్ వద్ద కూడా తాజాగా చైనా ఇలాగే రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన విషయం వెలుగు చూసింది. ఇంకోపక్క అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూడా ఇదే పరిస్థితి. అసలు అరుణాచల్ ప్రదేశ్ ఉనికినే తాము గుర్తించడంలేదని వదరిన చైనా తెంపరితనం ఎంతని చెప్పేది? చైనాతో మన సరిహద్దు సమస్తాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నాలను ఆ దేశం నిత్యం సాగిస్తూనే ఉంది. మన దేశ పాలకులు మన దేశ భూభాగంలో పర్యటించినా కూడా చైనా కస్సుమంటున్నది. ఇవి ఇంతవరకూ వెలుగు చూసిన అంశాలు. ఇంకా మన నిఘా దృష్టికి రాని అక్రమాలను డ్రాగన్ దేశం ఎన్నెన్ని ఎక్కడెక్కడ చేసిందో చెప్పడం కష్టం. చైనా అంటేనే నయవంచన. కానీ ఇక్కడే ఇంకో బాధాకర విషయం ఉంది! చైనా చేపట్టిన, చేస్తున్న, చేసేసిన నిర్మాణాలేవీ ఒక్క రోజులోనో, రెండు రోజుల్లోనే అయినవి కావు. కనీసం కొన్ని వారాలపాటు మన నిఘా కళ్ళు గప్పి ఈ నిర్మాణాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అసలైన ఆందోళనకర పరిణామం. రోడ్లు వేసిన తర్వాత.. వేసిందని... స్థావరాలు నిర్మించాకా నిర్మించిందని గొడవ చేసినా ఫలితం ఉండదు! అదే ప్రథమ దశలోనే కనిపెట్టి ప్రతిఘటిస్తే ఆ ప్రయత్నాల ను ఆపగలం. అయితే మన పరంగా ఆ లోపం సుస్పష్టంగా కనిపిస్తోంది. పోనీ చైనా చర్చలతో.. లేదా మన ప్రకటనలతో ఆగే రాకమా అంటే.. కానే కాదు. ఆగినట్టు పైకి కనిపిస్తున్నది తప్ప అది ఒక లక్ష్యం మేరకు.. ఉద్దేశ పూర్వకంగా సరిహద్దులలో పొగ పెడుతోంది. ఇక రానురాను భారత్ ఆరోపణలు, ఫిర్యాదులపై కూడా విలువ లేకుండా చేసే కుట్ర ఇది. పది చోట్ల కన్నాలు పెడితే అన్నీ పూడ్చలేముగా.. ఒకటి రెండయినా ఉండిపోతాయి! అదే ధూర్త చైనా దుర్నీతి! ఈ పరిస్థితుల్లో ద్వైపాక్షిక చర్చలు, సానుకూల విధానాలకంటే చైనా తప్పుల్ని సాక్ష్యాలతో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం ఒక్కటే భారత్ ముందున్న ఉపాయం. అంతర్జాతీ యంగా ప్రతిష్టను ఇనుమడింపజేసుకున్న భారత్ ఆ పని ఇప్పుడే చేయడం శ్రేయస్కరం. లేదంటే మాత్రం మరోసారి చైనాతో యుద్ధం తప్పదు.