నదీజలాలపై సుప్రీం కీలక తీర్పు


తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదాలకు కారణమైన కావేరి జల వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. కర్ణాటక వాటాను 14.75 టీఎంసీలు పెంచింది. తమిళనాడు వాటాను తగ్గించిన కోర్టు 10 టీఎంసీల భూగర్భ జలాలను ఆ రాష్ట్రం తోడుకోవడానికి అనుమతించడం ద్వారా ఆ లోటును పూరించింది. నీటి కేటాయింపుల్లో తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని తీర్పులో స్పష్టం చేసింది. నది అనేది జాతీయ సంపద అని, ఏ రాష్ట్రమూ నదిపై ప్రత్యేక యాజమాన్యహక్కును ప్రకటించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రాన్ని, బెంగళూరు అంతర్జాతీయ స్థాయి నగరంగా అవతరించిందన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కర్ణాటకకు వాటా పెంచడాన్ని ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ అమితవ రాయ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది. కావేరి జలాలపై తాము ఇచ్చిన తీర్పు మరో 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పింది. 2007లో కావేరి జల వివాద ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపుల్లో కర్ణాటక, తమిళనాడు వాటాలను సవరించిన సుప్రీంకోర్టు.. కేరళ, పుదుచ్చేరి వాటాలను మాత్రం మార్చలేదు. కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు కేటాయింపులను అలాగే ఉంచింది. తాజా తీర్పు అమలయ్యేలా పథకాన్ని రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం 6 వారాల గడువు మంజూరు చేసింది. ఈ గడువును ఏ కారణంతోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. కావేరి ట్రైబ్యునల్‌ 2007లో జరిపిన కేటాయింపులను సవాల్‌ చేస్తూ కర్ణాటక, తమిళనాడు, కేరళ దాఖలు చేసిన విజ్ఞప్తులపై ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కావేరి జల వివాద ట్రైబ్యునల్‌ నిర్ణయమే తుది నిర్ణయమని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలయిన విజ్ఞప్తులను విచారించే పరిధి సుప్రీంకోర్టుకు లేదని కేంద్రం చేసిన వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు కాకుండా పది టీఎంసీల నీటిని పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించాలని ధర్మాసనం పేర్కొంది. సముద్రంలోకి అనివార్యంగా కలిసిపోయే నీటిని 4టీఎంసీలుగా లెక్కగట్టింది. కర్ణాటకకు అదనంగా ఇచ్చిన 14.75 టీఎంసీలలో 10 టీఎంసీలను తమిళనాడులో భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని పెంచింది. కావేరి పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాల గణాంకాలు ఉజ్జాయింపు లెక్కలేనన్న ట్రైబ్యునల్‌ అభిప్రాయంతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అనుభవపూర్వక పరిశీలనతో రూపొందించిన గణాంకాలను బట్టి తమిళనాడులోని కావేరి పరివాహక ప్రాంతంలో 20 టీఎంసీల భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. భూగర్భ జలాలను మితిమీరి తోడడం వల్ల కలిగే ముప్పును పరిగణనలోకి తీసుకుని అందులో 10 టీఎంసీలను తమిళనాడుకు కేటాయించవచ్చని పేర్కొంది. తీర్పు ఫలితంగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని బిల్లిగుండ్లు ఆనకట్ట వద్ద నుంచి తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం