పరాభక్తి స్వరూపుడు ప్రహ్లాదుడు


పరాభక్తి స్వరూపుడు ప్రహ్లాదుడు "బ్రహ్మదేవుడు కూడా మహా విష్ణు భక్తుడే.. కానీ ఆయనకు లోక సృజన అనే మహా కార్య చింత ఉంది. ఆ ధ్యాస ఉంది. కానీ ప్రహ్లాదుడు బ్రహ్మను మించిన మహా విష్ణు భక్తుడు. లోకం కూడా పట్టకుండా లోకేశుని మీదనే లగ్నమైన స్థిర దృష్టి ప్రహ్లాదుడిది. బ్రహ్మ పదవికంటే భక్తి పదవి గొప్పది. అట్టి పదవి ప్రహ్లాదునిది." భాగవతోత్తములలోకెల్లా ప్రహ్లాదుని చరిత్ర అత్యంత స్ఫూర్తిదాయకమని.. రూపుకట్టిన పరాభక్తునిగా ప్రహ్లాదుని స్థానం భాగవత చరిత్రలో విశిష్టమని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిపాదించారు. అతడిది ప్రేమజనిత వైరాగ్యమని అంటూ ఇది వివేకం వల్ల పుట్టిన వైరాగ్యం కంటే ఉన్నతమైనదన్నారు. ప్రహ్లాదునిలో ఉన్న స్వభావ భక్తి, సహజాసక్తి అమోఘమని.. ఈ లక్షణాన్ని పోతన తన పద్యంలో నైసర్గికీ రతి అని వర్ణించాడని తెలిపారు. ఇది భక్తిలో శిఖరాయమానమైన స్థితి అని అని చెబుతూ ఇట్టి స్వభావ భక్తి మహా సాధకులైన వారికి.. అదీ చిట్టచివరి జన్మల్లో మాత్రమే సాధ్యపడుతుందన్నారు. సాక్షాత్తు బ్రహ్మ, ఇంద్రాదులకు కూడా ఇంతటి స్థిర భక్తి, సహజమైన భగవదనుభూతి అసాధ్యమన్నారు. ప్రహ్లాదుని పరాభక్తిని, అతడి భగవదర్పిత వ్యక్తిత్వాన్ని భగవద్భక్తులు అత్యున్నత ఆదర్శంగా గైకొనాలని వక్కాణించారు. జ్ఞానానికి వయసుతో నిమిత్తం లేదని ప్రహ్లాద చరిత్ర స్పష్టం చేస్తుందన్నారు. భగవత్ కటాక్షమే అనుభూతి అనబడుతుంది అని అందుకు అర్హత ఆర్తి అని సద్గురువులు తెలిపారు. భక్తులు నాలుగు విధాల ఉంటారని ఆర్త భక్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్ధులు, జ్ఞానులుగా వారు పిలవబడతారని అంటూ ఈ నలువురూ కూడా తనకు ప్రియులేనని పరమాత్మ చెప్పాడన్నారు. కృష్ణావతారంలో ఈ అన్నివిధాల భక్తులూ కనిపిస్తారన్నారు. ప్రయోజనాల కోసం భగవంతుడిని ఆశ్రయించే వారు అర్ధార్ధులని.. . అయితే ప్రయోజనానికి కూడా భగవానుడి కాళ్లే పట్టుకుంటే ఇప్పుడు ఇహ సుఖాలు లభిస్తాయి... ఎప్పటికో పరమూ వస్తుంది అని తెలుసుకున్నవారు ధన్యులన్నారు. అసలు జన్మ జన్మల పుణ్యం ఉంటేనే భగవంతునిపై ఒక ఆర్తి అనేది ఏర్పడుతుందని తెలిపారు.ప్రహ్లాద చరిత్ర భాగవత హృదయ స్థానం అని పదిహేనవనాటి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో మాట్లాడుతూ సామవేదం వారు ప్రవచించారు. ఇది ఏడవస్కందములో వచ్చే కథ అని.. ఇది అర్థం అయితే భాగవతం బాగా అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఇందు చెప్పినది స్వభావ భక్తి అన్నారు. ఇది అనేక జన్మల సాధనాఫలితం అని వక్కాణించారు. నారద మహర్షి, శాండిల్య మహర్షి భక్తి లక్షణ గ్రంథాలు రచించారని, అవి కానీ శ్రీమద్భాగవతం కానీ.. భగవద్గీత గానీ.. పతంజలి యోగసూత్రాల్లో గానీ చెప్పిన భక్తుడి లక్షణాలన్నీ ఒకటే అన్నారు. అవన్నీ ప్రహ్లాదునికి సరిపోతాయని వెల్లడించారు. భౌతిక ప్రయోజనాలకు అతీతంగా భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆనందం కోసం అనుభూతి కోసం తెలుసుకోవాలని తెలిపారు. భగవానుడి గురించి తెలిసేకొద్దీ ఆనందం పెరుగుతుందని, అది విస్తరించే కొద్దీ భగవానుడిని పొందడం జరుగుతుందని.. ఆ తర్వాత వదలలేని స్థితి వస్తుందని పేర్కొన్నారు. హిరణ్యకశిపుడి భార్య పేరు కయాధువు అని ఇడిముందు స్కందాల్లో చెప్పబడింది అని అయితే లీలావతి అని అందరూ చెబుతున్నది నిజం కాదని సామవేదం వారు స్పష్టం చేసారు. ఆమె జంబాసురుని కుమార్తె అన్నారు. కయాధువు హిరణ్యకశిపులకు హ్లాద, సంహ్లాద, అనుహ్లాద, ప్రహ్లాదులు అనే నలుగురు బిడ్డలన్నారు. వీరు పుట్టడానికి ముందే హిరణ్య కశిపుడు అజరత్వ అమరత్వ సిద్ధి కోసం ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. అజారత్వ అమరత్వాలనేవి ప్రకృతికి లేని లక్షణాలు... ఆ ప్రకృతిలో ఉంటూ ఆ కోరిక కోరడం ప్రకృతి విరుద్ధం. కానీ కోరాడు హిరణ్యకశిపుడు. అది సాధ్యం కాదని చెప్పిన బ్రహ్మ మరేదైనా కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన చావుకి నియమాలు నిర్దేశించాడు. రాత్రి లేదా పగలు, లోపల లేదా బయట, నేలపై లేదా ఆకాశంలో, ఎట్టి ఆయుధం చేతా, మానవుల చేత గానీ, మృగముల చేత గానీ నాగులు, రాక్షసులు, దేవతలు ఇత్యాదుల వలన గానీ, ప్రాణితో గానీ, ప్రాణరహితమైన దానితో గానీ తన మరణం అసాధ్యం అయ్యేటట్లు వరం కోరాడు. ఏకఛత్రాధిపత్యమ్, యుద్ధంలో ఎప్పుడూ విజయం.. ఇలాంటివి కూడా కోరి సరే అనిపించుకున్నాడు. గొప్ప తపస్వులు, లోకపాలకులు, దిక్పాలకులకు ఉండే మహిమలన్నీ తనకి ఈయాలన్నాడు. అన్నిటికీ తథాస్తు అన్నాడు బ్రహ్మ. తపస్సుతో అనితరమైన స్థాయిని పొందిన హిరణ్యకశిపుడిని అప్పుడు ప్రజాపతులు పూజించారని వ్యాసభగవతం చెప్పిందన్నారు. ద్వంద్వాల్లో మరణిస్తే మళ్ళీ జన్మించాలి గనుక.. అలా మరణించరాదని హిరణ్య కశిపుడు కోరుకున్నాడని.. అతడి జీవుడి యొక్క పూర్వ వాసనలు ఉన్నతమైనవి కనుకనే ఇలాంటి కోరికలు కోరి, సాధించుకోగలిగాడని విశ్లేషించారు. ఐశ్వర్య అధికార మత్తుడైన హిరణ్యకశిపుడు ఆపైన వరగర్వంతో ముల్లోకాలనూ జయించాడని, దేవతలను, ఋషులను పారద్రోలాడని... అయినా అతడికి తనివి తీరడంలేదన్నారు. ఇంద్రియ దాహం అలా అపరిమితంగా ఉంటుందని ఇక్కడ గ్రహించాల్సిన విషయమన్నారు. ఇక ప్రహ్లాదుడు మహా భక్తుడని పేర్కొంటూ అతడి లక్షణాలు వివరించారు. శీల సంపన్నత, సత్య సంధత, విషయ లంపటాలపై నిరాసక్తి, కలవరపాటు లేకపోవడం, ఇంద్రియ నిరహం, కోరికలపై విజయం, పెద్దల యెడల భక్తిభావం, సముల యెడల మైత్రీభావం, దీనుల యెడల దయాదృష్టి, కష్టానికి చలించని దృఢసంకల్పం ఇత్యాది శుభలక్షణాలు అతడికి ఉన్నాయన్నారు. ఎప్పుడూ భగవదనురక్తుడై ఉండే ప్రహ్లాదుడు ఒక్క క్షణమైనా హరిచింతన మాని ఉండడన్నారు. హరి స్పర్శకు లోనైన వాడై గగుర్పాటు చెందుట.. తాదాత్మ్యతతో గొంతు గద్గదం కావడం.. పారవశ్యంతో కనులవెంట అశ్రుధారలు కురియడం సర్వ సామాన్య లక్షణాలన్నారు. వాసుదేవునిపై ప్రహ్లాదునికి సహజాసక్తి తల్లి గర్భంనుంచే సంక్రమించినదని.. అది ఈశ్వరేచ్ఛ అని వక్కాణించారు. ఇట్టి స్వభావ భక్తి ని భాగవతంలో నైసర్గికీరతి అని పేర్కొన్నారని తెలిపారు. కృష్ణ గ్రహ గృహీతాత్మ అని కూడా పోతన అన్నారని..అంటే ఏదో భూతం పట్టినట్టు.. కృష్ణ గ్రహం పట్టినవానివలె ఉన్నాడని ప్రహ్లాదుని పారవశ్యాన్ని వర్ణించారన్నారు. భూతం పడితే ఎవరికైనా లేని శక్తి కూడా వస్తుంది అంటారు గదా.. అటువంటపుడు అసలు భూమిపైన, అన్ని లోకాల్లోనూ ఉన్న సర్వభూతాలకు శక్తి వస్తున్నది ఎవడి చేత? ఆ చైతన్యరూపుడు విష్ణువే అని తెలుసుకోవడమే ఈ మాట వెనుక అంతరార్థం అని సామవేదం వ్యాఖ్యానం చేసారు. ప్రహ్లాదుని చిత్తం గోవిందుని యందు ఐక్యమై పోయి ఉందని.. అతడు దేనినీ మానడం లేదు..కానీ అన్నిటినీ భగవవంతుని పట్ల స్పృహతో.. లోకాన్ని మరచి పారవశ్యంతో నిర్వహిస్తున్నాడని తెలిపారు. సదా పరమాత్ముని యెడల అనురక్తుడవుతూ.. ఆయన సాన్నిధ్య భావన అనుభవిస్తున్నాడన్నారు. భక్తి అర్హత ఇదే అని భగవదనుభూతితో కళ్ళు తడవాలి అని, ఒళ్ళు పులకించాలి అని,.. గొంతు వణకాలి అని ... తనువు నాట్యమాడాలి అని పరమహంసలు చెప్పిన మాటలను సామవేదం ప్రస్తావించారు. అట్టి మహోన్నత భక్తి స్థితి కలిగిన శరీరమే భోగభూమి అన్నారాయన.ఒక్క క్షణం భగవదనుభూతి..భగవత్ స్పృహ విస్మరణకు వచ్చినా కూడా ఆ దినం వృథానే అన్నట్టు బాధపడతాడు భక్తుడని చెబుతూ జీవితమంతా నోరు కూడా కట్టుకుని లోభి కూడబెట్టిన సంపదని రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకుపోతే అతడు ఎలా గుండెలు బాదుకుంటూ విలపిస్తాడో.. అలా భగవత్ స్మరణ విస్మరించిన రోజున నిజభక్తుడు పరితపిస్తాడని ఆ స్థితిని వర్ణించారు. దేవుడ్ని మరచిపోయానని భక్తుడు ఏడుస్తున్నాడంటే భగవంతుడు అతడికి గుర్తు ఉన్నాడని అర్థమన్నారు. భగవంతుడిని పట్టుకోవడం అతడు తెలిసేవరకే కష్టం అని సాధన ద్వారా ఒకసారి భగవత్ స్పృహ కలిగినదంటే ఇక పరమాత్మ పరమ సులభుడు అనేది మరువరాదని సూత్రీకరించారు. బహిర్ముఖ అంతర్ముఖాల్లో సదా నారాయణ తాదాత్మ్యత ప్రహ్లాదుని సొంతమని.. నారదుడు ధర్మజునికి, శుకుడు పరీక్షిత్తుకి చెప్పిన ప్రహ్లాద చరిత్ర భక్త సాధకులకు పరమ పవిత్ర పారాయణ, ఆచరణ ఘట్టమని బ్రహ్మశ్రీ సామవేదం స్పష్టం చేశారు,అక్షరాస్యత ప్రాధాన్యాన్ని చెప్పడానికి గానీ, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవడానికి గానీ.. ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో పోతన గారు చెప్పిన పద్యాలను మించిన రచన మరెక్కడా కానరాదన్నారు. చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్చదువగ వలయును జనులకుచదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ! అనే పద్యాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. శుక్రుని పుత్రులు చండా అమార్కులు ఇద్దరూ ప్రహ్లాదుని గురువులు అని.. వారి వద్ద విద్యాభ్యాసానికి వెళ్లిన ప్రహ్లాదుడిని నయకోవిదుడు, సత్యదర్శి అని పోతన సంబోధించారని సామవేదం తెలిపారు. తత్వ విచార సామర్థ్యం గల పండితుడు అని, ఏది శాశ్వతం అనేది తెలుసుకున్నవాడని ఈ మాటలకూ అర్థం అన్నారు. అయితే గురువులు చెప్పినవన్నీ చక్కగా విధేయతతోనే ఆ బాలుడు చదివాడని, కానీ తనలోని ఆత్మజ్ఞానం చెదరకుండా, పరమాత్మ యందున్న తన అసలు మతి పోకుండా వాటిని చదివాడు అని తెలుసుకోవాలన్నారు. పోతన తపశ్శక్తి.. కవితాప్రవాహం మరింతగా పొంగిపొర్లింది ప్రహ్లాద చరిత్రలో అని బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ అన్నారు. "కొంతకాలం విద్యాభ్యాసం తర్వాత గురువులు బాలుడ్ని తీసుకొచ్చారు. ఆప్యాయంగా ఒళ్ళో కుర్చోబెట్టుకొని.. నాయనా.. ఏది మంచిదో చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. ఏది లేదో అది సత్యం అనుకుంటున్న అవివేకులు ఆ భ్రమను విశ్వసిస్తున్నారని ఫలితంగా భేదబుద్ధి, ఉద్విగ్నత, వైషమ్యాలు కలుగుతున్నాయని చెప్పాడు బాలుడు. గృహం అనే అంధకూపంలో ఉన్నంతకాలం జీవుడికి ఉన్నతి ఉండదని... అడవికి పోయి హరిని ఆశ్రయించాలని.. అదే మంచిదని అన్నాడు.అడవి అంటే సత్పురుషులైన ఋషితుల్యుల సాంగత్యం అని కూడా చెప్పవచ్చు. అలాగే తరించాలన్నాడు. ఏకాంతం అలవాటు చేసుకోవాలి. అదే ఆత్మోన్నతికి సుపథమని అన్నాడు. బహిర్ముఖత్వమే నిజమైన ఒంటరితనం అని ఆ బాలుడు చెప్పగా కుపితుడైన హిరణ్యకశిపుడు... ఇదెలా అబ్బింది నీకు?ఎవడు నిన్నిలా పాడుచేశాడని ప్రశ్నిస్తే.. నాన్నా.. సూదంటురాయిని ఇనుము ఆకర్షించినంత సహజంగా మనసు హరి వైపు మళ్లింది అని నిర్భీతిగా చెప్పాడన్నారు.హరికి భక్తునికి సహజ సంబంధం ఉందని... ఇలాగే సూదంటు రాయికి ఇనుము అంటుకున్నట్టే భక్తుని మనసు హరిపై లగ్నం కావాలని ఇక్కడ సామవేదం అభిప్రాయపడ్డారు. కానీ అలా జరగలేదంటే అర్థం ఇనుము బురద, మట్టి వంటి ఇహ సంబంధమైన మాలిన్యాల్లో కూరుకుపోయిందని అర్థం అన్నారు. అప్పుడు దానిని బాగా కడగాలి.. అంటే చిత్తాన్ని శుద్ధి చేయాలి అని ఉపదేశించారు. ప్రహ్లాదుడి మాటలకు, రాజాగ్రహానికి బెదిరిపోయిన గురువులు మరోసారి బాగా తర్ఫీదు ఇస్తామని చెప్పి తీసుకుపోయారు. ఈసారి మరిన్ని విద్యలు నేర్పి మళ్ళీ తీసుకువచ్చారు!ఇపుడు హిరణ్యకశిపుడు ఉత్తమమైన విషయం ఏదో చెప్పమన్నాడు. మొదటిసారి హరిపాదాలను శరణు వేడాలని చెప్పాడుగా.. ఇక ఇప్పుడు ఎలా శరణు వేడాలో చెబుతూ నవలక్షణ భక్తి మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ ప్రకారం శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం (నమస్కారం), దాస్య భావం, సఖ్య భక్తి, ఆత్మనివేదనం అనే తొమిది భక్తి లక్షణాలూ చెప్పాడని వివరిస్తూ... వీటిని ఒకదాని వెంట ఒకటిగా, ఒకదానితోపాటు మరొకటిగా, అన్నిటినీ కలిపి ఒక్కటిగా... త్రికరణశుద్ధిగా భక్తుడు ఆచరించాలని సామవేదం ప్రతిపాదించారు. భగవంతుడిచ్చిన ఏ ఇంద్రియాలతో అయితే ప్రాపంచిక విషయం భోగాలను అనుభవిస్తున్నామో.. ఏవ్ ఇంద్రియాలను భగవంతుడి సేవకు మళ్లించడమే భక్తికి నిర్వచనమని భాగవతం చెప్పిందన్నారు. అంతే కాకుండా.. భక్తి లేనిదే ఏ గుణమూ ప్రకాశించదని అంటూ .. ఉదాహరణకు భక్తి లేని పాండిత్యం శవానికి చేసిన అలంకారం అన్నారు. సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;తే. దేవదేవుని చింతించు దినము దినము;చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి అంటూ పోతనగారు ఈ సందర్భంగా పారవశ్యంతో రాసిన పద్యం ప్రతి ఒక్కరికీ నిత్యం పఠనీయాలన్నారు. దైవాన్ని చూడని కళ్ళు గోడకు ఉన్న కన్నాలని.. హరి స్పృహ లేని బతుకులు నీటిలో బుడగలని.. విష్ణు స్మరణ చేయని వాడు రెండు కాళ్ళపశువని ప్రహ్లాదుడు చెప్పడంతో హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. రాక్షస కులంలో చెడబుట్టిన ఈ ధూర్తుడిని చంపేయమని తన భృత్యులకు ఆజ్ఞాపించాడు. వీడు (ప్రహ్లాదుడు) విష్ణువు అనే గొడ్డలికి (రాక్షసకులం పాలిట) పిడి వంటివాడని.. దీని సహాయంతోనే హరి తమ కులాన్ని నాశనం చేసేస్తాడని రాక్షస గురువులు వాపోయారని తెలిపారు. ఆపైన ప్రహ్లాదుని దండించేందుకు తోడ్కొని పోవడంతో ఇవాళ్టి ప్రవచనం ముగిసింది.